Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుదీర్ఘ కాలంగా పోడు సమస్యలపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏదైనా సమస్య పరిష్కారం కావాలని ఎదురు చూస్తున్న గిరిజన, పేద జనాలకు న్యాయం జరగటం అంటే తమ సాగులో ఉన్న భూములకు పట్టా హక్కులు దక్కటమే. నేడు రాష్ట్రంలో పోడు భూములకు పట్టాల సమస్య నివురుగప్పిన నిప్పులా రగులుతున్నది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు తాతల కాలంగా తమ సాగులో ఉన్న భూములకు పట్టాలు కావాలని ఎదురుచూస్తున్నారు. 2005కు పూర్వం తమ గ్రామాలను ఆనుకొని ఉన్న చిన్నచిన్న చెట్లు, పొదలు నరికి సాగు చేసుకుంటున్న భూములలో ఫారెస్టు అధికారులు రిజర్వు ఫారెస్టు పేరుతో జోక్యం చేసుకోవటం వలన సమస్య జఠిలమైంది. ఈ నేఫథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చే విషయంలో దరఖాస్తులు సేకరించి పోడు రైతులకు న్యాయం చేస్తాం అంటూ ఇచ్చిన హామీ పోడు సాగుదారుల్లో ఆశలు రేకెత్తించింది. కాని సమస్య పరిష్కారానికి తగిన ప్రణాళిక లేదు. ప్రస్తుతం జరుగుతున్న పోడు భూముల సర్వేలపై ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇది అనేక అపోహలు, అనుమానాలు పెరగటానికి తావిస్తోంది.
అధికారుల లెక్కల్లో గందరగోళం
రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8లక్షల ఎకరాలపైగా పోడు భూముల్లో గిరిజనులు, గిరిజనేతరలు సాగులో ఉన్నట్లు అర్థమవుతున్నది. రాష్ట్రంలోని 10జిల్లాల పరిధిలో 150పైగా మండలాలలో ఈ సమస్య ఉంది. నిర్థిష్ట్ట సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం గందరగోళంలో ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం సాగు వివరాలు పరిశీలిస్తే 31మండలాల పరిధిలో 3లక్షల 37వేల 451ఎకరాల 33సెంట్ల పోడుభూమిలో 1,01,340 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తి ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నది. జిల్లాలో23 మండలాలున్నాయి. 23 ఎజెన్సీ మండలాలే. కాకపోతే కొన్ని గ్రామాలు మాత్రమే నాన్ షెడ్యూల్డ్ ఏరియాగా మిగిలి ఉన్నాయి. ఈ జిల్లాలో ఫారెస్టు అధికారుల లెక్కల ప్రకారం 23మండలాల పరిధిలో 82,757మంది గిరిజన గిరిజనేతర రైతులు 2,94,890.37 ఎకరాల భూమికి ధరఖాస్తు చేసుకున్నారు.
గిరిజన సాగులో ఉన్నది పోడు భూమేనా?
పోడు భూమి అంటే రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు అర్థాలున్నాయి. ఎక్కువ భాగం కొండలపై చెట్లుకొట్టి, పుట్టలు సరిచేసిన ఎత్తైన గుట్టలతో కూడిన సమానంగా లేని భూమిని పోడు భూమి అంటారు. అలాగే నాగలి పెట్టి దున్నటానికి అవకాశంలేని భూమిలో కరేదా అంటే విత్తనాలను భూమిపై ఎదజల్లటం దాని ద్వారా ఉత్పత్తి అయిన పంటను పోడు సాగు పంట అంటారు. భద్రాచలం ఏరియాలో కొన్ని ప్రాంతాలలో గుట్టలపై ఈ రకమైన సేధ్యం చేస్తారు. ఆదివాసీ గిరిజనులు, వలస ఆదివాసీ (గుత్తకోయ), కొండరెడ్లు కూడా గుట్టలపై పోడు వ్యవసాయం పరిమితంగా చేస్తారు. కాని ప్రస్తుతం గిరిజనుల సాగులో ఉన్న పోడు భూమిలో ఒకశాతం కూడా వ్యవసాయ భూమి ఉండదు. కాగా ఇప్పుడు సాగులో ఉన్న భూమి అంతా పోడుభూమిగా ప్రచారంలో ఉన్నది. వాస్తవంగా ప్రస్తుతం గిరిజనుల సాగులో ఉన్న భూములు పోడు భూముల కిందకు రావు. ఈ భూములను అలా పిలవటం ద్వారా ఫారెస్టు డిపార్ట్మెంట్ వారు రిజర్వు ఫారెస్టు భూములని వివాదాలు సృష్టిస్తున్నారు. అక్కడక్కడ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉన్న భూములు కూడా కొన్ని చోట్ల ఉండొచ్చు. అంత మాత్రాన ఈ వ్యవసాయ భూమిని మొత్తం పోడు భూమి అనటం న్యాయం కాదు. రిజర్వ్ ఫారెస్టులో పెద్ద పెద్ద వృక్షాలను నరికి అడవినంతటిని గిరిజనులే నాశనం చేస్తున్నారనే ప్రచారం కూడా సరయైనది కాదు.
వివాదాలకు ముఖ్య కారణం
రిజర్వు ఫారెస్టు భూములను గిరిజనులు ఆక్రమించారు ఆనటానికి ఫారెస్టు డిపార్టుమెంట్వారు చెబుతున్న ప్రాతిపదిక ఏమిటి అంటే... ఎప్పుడో దశాబ్దాల క్రితం గ్రామాలకు, అడివికి మధ్య బౌండరీలు (సరిహద్దులు) నిర్ణయించారు. ఆ తరువాత అటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు లేవు. సర్వేలు చేసి సరిహద్దులు నిర్ణయించలేదు, ఫలితంగా వివాదాలు వస్తున్నాయి. దీనికి తోడు అడవిని ఆనుకొని జీవనం సాగిస్తున్న గిరిజన గ్రామాల ప్రజలు, కుటుంబాలు పెరగటం వలన ఆయా గ్రామాలలో నివాసం ఉంటున్న గిరిజనుల ఊరిని ఆనుకొని ఉన్న చిన్న చిన్న పొదలు, చెట్లు చదును చేసుకొని ఆ భూములలో ఇండ్లు నిర్మించుకోవడం, సాగుకు యోగ్యంగా కొంత భూమిని తయారు చేసుకోవటం ప్రారంభమైంది. 2005కు ముందు ఈ ప్రక్రియ అంతా జరిగింది. 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం రాకతో గిరిజనుల్లో ఆశలు చిగిరించాయి. మూడు తరాలుగా షెడ్యూల్ ఏరియాలో జీవనం సాగిస్తున్న గిరిజనులకు కూడా చట్టం అవకాశం కల్పించింది. దీని ప్రకారం ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం, వీరి వద్ద సరైన లెక్కలు నిర్థిష్టంగా లేని కారణంగా కూడా ప్రస్తుతం ఈ వివాదాలు పెరుగుతున్నాయి. ఇందులో కొంతమంది ఫారెస్ట్ అధికారుల అవినీతి కూడా తోడైంది. వలస ఆదివాసి గిరిజనుల వద్ద కొంత సొమ్ము ఆశించి గ్రామాలకు దూరంగా అడవిలో ఉన్న ఏరియాలో వారు గ్రామాలు, ఇండ్లు నిర్మించుకోవటానికి వీలు కల్పించారు. అలాగే ఆ ముసుగులో కొంత ఖరీదైన కలప చెట్లను నరికి పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని, ఇందులో రాజకీయ జోక్యం కూడా ఉందని ఆరోపణలున్నాయి. వాస్తవం ఇది కాగా, రిజర్వ్ ఫారెస్టులో గిరిజనులు అడవులు నరికి పోడు వ్యవసాయం చేస్తున్నారని, అడవులను నాశనం చేస్తున్నారని ఫారెస్టు డిపార్ట్మెంట్ వారు గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కూడిన ప్రయత్నం చేయడంలేదు. ప్రభుత్వం సర్వే అధికారులకు సరైన విధి విధానాలు ఇవ్వకపోవడం వలన కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10ఎకరాల భూమి ఇవ్వాలనే ప్రాధమిక అవగాహన కూడా ఇప్పుడు సర్వే చేస్తున్న సర్వే టీమ్‌కు ఉన్నట్లు కనిపించడం లేదు.
సర్వేలో వస్తున్న కొత్తసమస్యలు
ప్రస్తుతం గ్రామాలలో జరుగుతున్న సర్వేల సందర్భంగా అనేక కొత్తరకం సమస్యలు వస్తున్నాయి. దీని వలన సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేయకుండా సర్వే కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సర్వే ఎప్పటి వరకు పూర్తి చేస్తారో నిర్థిష్ట కాలపరిమితిలేని కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఏరియాలలో సర్వే చేయమని నిరాకరిస్తున్నారు. ఇందులో రాజకీయం జోక్యం, దళారుల ప్రమేయం కూడా పెరుగుతుంది. గిరిజనేతరులు కొందరు బినామి పేర్లతో భూములు తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటున్నారనే విమర్శలు బహిరంగంగానే ఉన్నాయి.
పారదర్శకతలేని సర్వే కమిటీలు షెడ్యూల్డ్ ఏరియాలో 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 1/70 యాక్ట్, 5,6 షెడ్యూల్డ్‌లను పరిగణలోనికి తీసుకోలేదు. పీసా కమిటీలు ఎఫ్ఆర్సి కమిటీలు పోడు భూములను గుర్తించి ఫైనల్ చేయటంలో కీలకం పాత్రపోషించాలి. కానీ అటువంటి కమిటీలను ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కన పెట్టింది. వీటిని నీరుగారిస్తూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో కమిటీలు వేసి సర్వే చేస్తున్నారు. దీంతో మొత్తం ఈ ప్రక్రియపైనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఫారెస్టువారు కమిటీలో ఉండటం వలన సర్వేకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. అధికారిపార్టీ జోక్యం, రాజకీయ పైరవీలు ఈ సర్వే టీమ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ సర్వే టీమ్‌కి తొడుగా ఎఫ్ఆర్సి కమిటీలను భాగస్వామ్యం చేయడం వలన సమస్య కొంతవరకైనా పరిష్కారం అవుతుంది. ఈ సర్వే అనంతరం నియోజికవర్గ కమిటీలు, జిల్లాస్థాయి కమిటీలలో చర్చించి పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చే విషయం ఫైనల్ చేస్తామని అధికారులు చెబుతున్న సమాచారం రైతులు తెలుసుకొని ఈ కమిటీల వలన కాలయాపన తప్ప పరిష్కారం దొరకదనే అందోళనలో ఉన్నారు. పోడు రైతులకు నమ్మకం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
సర్వేలతో సాగదీతా? పరిష్కారమా?
సర్వేలతో సాగదీత వలన సమస్య పరిష్కారం కాదు. గతంలో పోడు భూముల సమస్యలు, పట్టాల విషయంలో అనేక దఫాలుగా సంబంధిత అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. సమస్య పరిష్కారం అవుతుందని ఎదురుచూస్తున్న గిరిజనులకు అనేక అనుమానాలు వచ్చే పద్ధతిలో ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని చర్చ సాగుతోంది. ఆరు నెలల క్రితం దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం మరలా ఇప్పుడు సర్వేలు చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వందల కేసులు వేలమందిపై పెట్టి నిర్బంధానికి గురిచేసిన ఫారెస్ట్ ఆగడాలకు అధికారుల అవధులులేవు. అందువలన కాలయాపన కమిటీల వలన సమస్య పరిష్కారం కాదు. చిత్తశుద్ధితో సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరుతున్నారు. తాజాగా పోడు కొట్టే వారిని నివారించి ఇప్పటివరకు సాగులో ఉన్న వారందరికీ పట్టాలు హక్కు పత్రాలు ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని పలువురు భావిస్తున్నారు.
- మచ్చా వెంకటేశ్వర్లు
సెల్:9490098192