Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీదేవి, రాముడి బొమ్మలు ముద్రించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అది ఆయనకున్న అజ్ఞానాన్ని తెలియచేస్తుంది. ఒకవైపు ప్రపంచ మానవుడు ఇతర గ్రహాలలో కాపురం పెట్టేందుకు ఉరకలేస్తుంటే, ఇక్కడ మనం ఊహాజనితమైన, కల్పితమైన పురాణాలలో పేర్కొన్న వారి బొమ్మలను కరెన్సీ మీద వెయ్యమంటూ ఒకరకమయిన ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం సరికాదు. నోట్లపైనే కాదు. ప్రతి పేదవాడి గుడిసెల్లో కేజ్రీవాల్ చెప్పిన లక్ష్మి, వినాయకుడు, రాముని బొమ్మలు ఉన్నాయి. మరి వారి జీవితాల్లో ఏరకమైన మార్పు వచ్చిందో చెప్పాలి.
సమాజాన్ని మార్చిన శాస్త్రవేత్తల బొమ్మలు పెట్టుకుంటే వారి స్ఫూర్తి గుర్తుకొచ్చి, వారి ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించవచ్చు. అసలు ప్రభుత్వం ముద్రించే కాగితం తయారు చేసిన వారెవరో, ముద్రణా యంత్రాన్ని కనిపెట్టింది ఎవరో ఈ ప్రధానికి, ఈ కేజ్రీవాల్‌కు తెలుసా! మూఢనమ్మకాలను నిర్మూలిస్తేనే సమాజం బాగుపడుతుందని ఎలుగెత్తి చాటిన చార్వాకుల బొమ్మలు ముద్రించినా ప్రజలలో చైతన్యం వచ్చేందుకు అవకాశముంది. పురోహిత వర్గాన్ని, యజ్ఞయాగాలను, ముహూర్తాలను ఉతికి ఆరేసిన వేమన, ప్రపంచమంతా తిరిగి బాబాల మహిమలను తన ముందు ప్రదర్శించమని సవాల్ చేసిన డాక్టర్ కోవూర్, పెరియార్ రామస్వామి, త్రిపురనేని రామస్వామి, ఫూలే, అంబేద్కర్ లాంటి వారి బొమ్మలు పెట్టాలి. అలాగే కొన్ని నోట్లపై ఇతర శాస్త్రవేత్తల పేర్లు, సామాజిక శాస్త్రవేత్తల పేర్లూ ముద్రించాలి. అంతేకాని ఊహాజనితమైన, కట్టుకథలలో ఉన్నవారి బొమ్మలు పెట్టవద్దు. సమాజం ఇప్పటికే ఎంతో వెనక్కి పోయింది. ఇంకా వెనక్కి తీసుకుపోవద్దు.
- నార్నె వెంకట సుబ్బయ్య