Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతనెల అక్టోబర్ నెలలో ఐ.యమ్.ఎఫ్., ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో సుమారు 180 దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ప్రతినిధులతో ప్రత్యక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆర్థిక తిరోగమనం, ద్రవ్యోల్బణం, అధిక ధరలు, చమురు గ్యాస్ ధరలు, సప్లై చైన్ సరఫరాలో అంతరాలు మొదలగు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే అన్ని దేశాలు రకరకాలైన పరిష్కార మార్గాలను సూచించాయి. కానీ ఏ ఒక్క దేశం సూటిగా సమస్య పరిష్కారానికి సూచనలు ఇవ్వలేదు. ఈ సమావేశానికి ముందు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్ పాస్ మాట్లాడుతూ ''ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది అని, అనుకోని సంఘటనలు అనేకం ఒకదాని తర్వాత మరొకటి సంభవిస్తూ అభివృద్ధి చెందిన దేశాల నుంచి అల్పాదాయ దేశాల వరకూ ప్రపంచం అనేక ఆర్థిక రాజకీయ సామాజిక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నది అని తెలిపారు. అమెరికాను కూడా ఆర్థిక ఒడిదుడుకులు, గ్యాస్ ధరలు పెరగడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి'' అని తెలిపారు.
కోవిడ్ ప్రారంభానికి ముందే చాలా దేశాల్లో అధిక ధరలు, నిరుద్యోగం, ఆహార ద్రవ్యోల్బణం వంటి సమస్యలు మొదలైనాయి. ఈ రెండు సంవత్సరాల కోవిడ్ కాలంలో లాక్డౌన్, కర్ఫ్యూలతో ఈ సమస్యలు మరింతగా పెరిగి, దాదాపు అన్ని దేశాల్లో బహుముఖంగా పేదరికం విజృంభించింది. నేటికీ ఏ ఒక్క దేశం పూర్తిగా ఈ సంక్షోభం నుంచి బయటపడలేదు. దీనికి తోడు ఇటీవల రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో ఆహార పదార్థాల గొలుసు (ఫుడ్ చైన్) అంతరాయం, గ్యాస్, చమురు ధరలు పెరగడం వల్ల మొత్తం ప్రపంచం తల్లడిల్లుతున్నది. ఒక పక్క అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడం, మరొక పక్క చమురు దేశాలు ఆయిల్ ఉత్పత్తి తగ్గించడం కూడా ప్రస్తుత పరిణామాలు మరింత దిగజారడం కారణమవుతున్నాయి. మరుకొన్ని రాజకీయ కారణాలు బ్రిటన్, శ్రీలంక దేశాల్లో ప్రభుత్వాల అస్థిరత్వం. కేవలం రెండు నెలల్లో బ్రిటన్లో ముగ్గురు ప్రధానులు మారడం మనం అందరం చూస్తున్న ప్రత్యక్ష సంఘటనలు. అమెరికాలో, ఇటలీలో అంతర్గత రాజకీయ పరిస్థితులపై చర్చలు జరుగుతున్నాయి. మరొక ప్రజాస్వామ్య దేశం బ్రెజిల్లో లూల ఎన్నిక, చైనాలో మూడోసారి జిన్ పింగ్ నాయకత్వం ఆసక్తి గొలుపుతున్నాయి. ఆల్ పైన్ దేశాల ఆధిక్యత మరీ ముఖ్యంగా క్లైమేట్ ఛేంజ్ మొత్తం ప్రపంచాన్ని అన్ని రంగాల్లో ఒడుదుడుకులకు గురిచేస్తున్నది. వివిధ సమస్యల పరిష్కారానికి, వాతావరణ మార్పులు అరికట్టేందుకు గతంలో వరల్డ్ బ్యాంక్ ''గ్రీన్ రిజలెంట్ ఇన్కిజివ్ డెవలప్మెంట్ (జి.ఆర్.ఐ.డి)'' ఏర్పాటు చేసి, పరిష్కారానికి కృషి చేస్తుంది గానీ అమెరికా వంటి దేశాలు సహకరించడం లేదు. బ్రిటన్లో ద్రవ్యోల్బణం పడగవిప్పి నాట్యం చేస్తున్నది. జర్మనీలో పారిశ్రామిక రంగం గ్యాస్ చమురు ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నది. ఇరాన్లో సామాజిక అశాంతి నెలకొన్నది. మహిళల వస్త్రధారణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాలన, పాకిస్థాన్లో వరదలు ఇలా దాదాపు ప్రతీ దేశం ఏదో సమస్యతో సతమతమవుతున్నాయి.
ముఖ్యంగా చాలా దేశాలు ''అప్పులు ఊబిలో'' కూరుకుపోయినాయు. కనీసం వడ్డీ కట్టే స్తోమత కోల్పోతున్నాయి. ఇక మనదేశం కూడా 130 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఓట్లు దండుకునే పథకాలే ఎక్కువగా ఉంటున్నాయి. విద్వేష, విభజన రాజకీయాలు తీవ్రమవుతున్నాయి. ఈ సమావేశంలో దాదాపు అన్ని దేశాల్లో ఉన్న ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను చర్చించారు. ఎనర్జీ క్రైసిస్, క్లైమేట్ ఛేంజ్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యల నుండి బయట పడాలంటే ఉత్పత్తి రంగం బలోపేతం కావాలి. సంపద వికేంద్రీకరణ జరగాలి. యమ్.యస్.యమ్.ఇ కంపెనీలు, పరిశ్రమలకు చేయూత నివ్వాలి. గ్రీన్ బాట పట్టాలి. ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి సాధించాలి. ఆహార వృధాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. తమ తమ దేశాల్లో రాజకీయ సుస్థిరత సాధించాలి. అన్ని దేశాలు అశాంతి, తీవ్రవాదంపై పోరుబాట పట్టాలి. మనదేశంలో ''హేట్ స్పీచ్'' వంటి అంశాలకు చెక్ పెట్టాలి. కుల మత ప్రాంతీయ భాషా వంటి సంకుచిత భావాలకు చెల్లుచీటి ఇవ్వాలి. వాస్తవాల ఆధారంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలి. అన్ని దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుట ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయగలమని గుర్తించాలి.
- ఐ. ప్రసాదరావు
సెల్:6305682733