Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం భూగోళానికి సంబంధించిన సముద్రమట్టం, వాతావరణ ఉష్ణోగ్రతలు, కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం, సముద్ర మంచు కొండలు, గ్లేసియర్స్, అటవీ వైశాల్యం, జీవవైవిధ్యం లాంటి 35 ముఖ్య ధర్మాల్లో (వైటల్ సైన్స్) 16 ధర్మాలు హద్దులు దాటి తీవ్ర వాతావరణ మార్పులకు దారితీస్తూ పర్యావరణ సంక్షోభానికి కారణం కానున్నాయని అంతర్జాతీయ ఐక్య పర్యావరణ శాస్త్ర సమాజం ముక్తకంఠంతో హెచ్చరికలు చేయడం పరిస్థితి తీవ్రతను వివరిస్తున్నది. వాతావరణ సంబంధ మానవ ప్రమేయ విపత్తులు అనేకం ప్రపంచ మానవాళిని భయకంపితులను చేస్తున్నాయని, రాబోయే రోజుల్లో పర్యావరణ కల్లోలంతో భూమి నివాసయోగ్యతను కోల్పోనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు మానవాళి అనుభవిస్తున్న వాతావరణ ప్రతికూల మార్పులతో సాధారణ జన, జీవుల జీవనం ప్రశ్నార్థకం కానున్నది.
ది సైంటిస్ట్స్ వార్నింగ్
ఇటీవల యూయస్లోని ఓరిగాన్ స్టేట్ యూనివర్సిటీ విడుదల చేసిన 'ది సైంటిస్ట్స్ వార్నింగ్' అనబడే 35-నిమిషాల వీడియో వాతావరణ మార్పుల తీవ్రతలతో ఎర్పడనున్న ముప్పును కండ్లకు కడుతోంది. మానవ మనుగడ ప్రశ్నార్థకం, జీవవైవిధ్య విఘాతాలు, పర్యావరణ కాలుష్య మంటలు, హరిత వైశాల్యం తరగడం, కార్చిచ్చులతో దట్టమైన అడవులు ఎడారులుగా మారడం, తీవ్ర వడగాలులు వీచడం, అకాల వర్షాలతో వరదల్లో ఆశలు కొట్టుకుపోవడం, సూక్ష్మజీవుల సంబంధ వ్యాధుల విపత్తులు దాడి చేయడం, కార్బన్ ఉద్గారాలు పెరగడం, వణ్యప్రాణుల ఉనికి ప్రమాదంలో పడడం, భూతాపంతో పరిస్థితులు విషమించడం లాంటి పలు ప్రమాద భరిత పరిస్థితులు రాజ్యమేలడమే కాకుండా రోజు రోజుకు పెరగనున్నాయని స్పష్టం చేస్తోంది. నేడు వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి 418 పిపియంల వరకు పెరగడంతో 2022లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. యూరోప్‌లో తీవ్ర కరువు, ఆస్ట్రేలియా ఈస్ట్‌కోస్ట్‌లో రికార్డు వర్షపాతం, ఇండియా, పాకిస్థాన్‌లో అతి వడగాలులు (హీట్ వేల్స్), మిడిల్ ఈస్ట్‌లో దుమ్ము తుఫానులు (డస్ట్ స్టార్మ్స్), యూయస్ ఎల్లోరా స్టోన్ నేషనల్ పార్క్‌లో వరద ఉప్పెనలతో రోడ్లు ఆసాంతం కోట్టుకుపోవడం లాంటి అనేక పర్యావరణం ప్రకోపాలను మానవాళి ప్రత్యక్షంగా అనుభవిస్తున్నది.
పర్యావరణ విధ్వంసాలకు విరుగుడు
మానవుడు స్వార్థంతో, అజ్ఞానంతో పర్యావరణ వ్యవస్థలను బాగుచేయలేని దుస్థితిలోకి నెడుతున్నాడని తెలుసుకోవాలి. మానవాళి వర్ణించలేని బాధలకు విరుగుడు తెలుసుకొని, దాని దుష్ప్రభావాలను కట్టడి చేసే మార్గాలను వెతకాల్సిన సమయం ఆసన్నమైందని శాస్త్ర సమాజం విన్నవిస్తున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరిత క్షేత్రాల వృద్ధి, రక్షణ, శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిషేధించే స్థాయికి చేరడం, వాతావరణ సానుకూల మార్పుల దిశగా మన జీవన విధానాలను మార్చుకోవడం, అల్పాదాయ దేశాలకు చేయూత ఇవ్వడం, పర్యావరణ పరిరక్షణ అవశ్యకతను అందరికీ విధిగా అవగాహన పర్చడం లాంటి చర్యలను వెంటనే ప్రారంభించాలి. 2100 వరకు వాతావరణ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని అధ్యయనాలు చెపుతున్నాయి. అదే జరిగితే మానవాళితో పాటు ప్రాణికోటి మనుగడే ప్రశ్నార్థకం కానుంది. ప్రజల సహకారంతో సత్వరమే పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకోవడానికి కంకణబద్దులం కావాలని నిపుణులు ముక్తకంఠంతో వేడుకొంటున్నారు. మనం కుర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దు. తమ తమ స్థాయిల్లో ప్రతి ఒక్కరు భూగ్రహ ఆరోగ్యానికి వైద్యం చేయాలి. కార్చిచ్చులు, వడగాలులు, భారీ వరదలు, తీవ్ర తుఫానులు, భూతాపం, సముద్రజలాలు వెడెక్కడం, సాగర మట్టాలు పెరగడం, గ్లేసియర్స్ కరగడం, ఆర్కిటిక్ మంచు కరగడం లాంటి ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సమాజం రాబోయే తరం ఆరోగ్యకర మనుగడకు బాటలు వేయాలి. తీవ్రమైన వాతావరణ మార్పుల పట్ల విస్తృత ప్రచారం అనివార్యమని భావించాలి. పరిశోధనలు చేసే యజ్ఞంలో మునిగి తేలుతున్న శాస్త్రజ్ఞులు పలు పర్యావరణ పరిరక్షణ అంశాలను సామాన్యులకు సరళ భాషలో వివరించి, వారి ప్రస్తుత కర్తవ్యాలను వివరించాలి. వాతావరణ విధ్వంసాలను తెలుసుకుంటూ, వాటి దుష్ప్రభావాలను తగ్గించడానికి లేదా తొలగించడానికి ప్రయత్నాలు ముమ్మరపరచాలి.
అవగాహన, ఆచరణలే ఔషధాలు
అనాలోచిత, విచక్షణారహిత వ్యవసాయ పద్ధతులు, అడవుల నరికివేత, జనాభా విస్పొటనం, అధిక పర్యావరణ వినియోగం, ప్లాక్టిక్ భూతం, కార్బన్ ఉద్గారాలు, గాలి, నేల, నీటి కాలుష్యం, భూగ్రహ దుర్వినియోగం లాంటి అంశాల పట్ల అందరికీ కనీస అవగాహన కల్పించాలి. పర్యావరణ పరిరక్షణ చట్టాలను విధిగా అమలు పర్చాలి. భూమికి జబ్బు చేసింది. గాలి గరళమైంది. మట్టి మర్యాద మారింది. జలానికి జ్వరం వచ్చింది. ఈ ప్రకృతి అనారోగ్యానికి ఏకైక కారణం మానవుడే. వాటికి వైద్యం చేయవలసిన వైద్యుడు కూడా మానవుడే అని అర్థం చేసుకోవాలి. చెట్టు, పుట్ట, గుట్ట, చెరువు, చేను, వాగు, అడవి, జంతువులు, వృక్షాలు, సముద్రాలు, వాతావరణం, జలావరణం, శిలావరణం దిగాలుగా మనిషి వైపు దీనంగా చూస్తున్నాయి. వాటి అనారోగ్యానికి సరైన ఔషధాలను కాలానుగుణంగా మనమే ఇస్తూ, రేపటి తరానికి ఆరోగ్యకర పర్యావరణాన్ని అందించే బాధ్యతను అందరం భుజాన వేసుకుందాం. పరిస్థితి చేయి దాటకముందే భూగృహాన్ని చక్కదిద్దుకుందాం. వాతావరణ సానుకూల మార్పులకు విత్తులు నాటుతూ, ఆరోగ్యకర ఫలాలను రేపటి తరానికి అందిద్దాం. ఇది పట్టించుకోని శక్తులను నిలదీద్దాం.
(ఇటీవల అమెరికన్ 'ఓరిగాన్ స్టేట్ యూనివర్సిటీ' శాస్త్రజ్ఞులు విడుదల చేసిన 'ది సైంటిస్ట్స్ వార్నింగ్' వీడియోకు స్పందనగా)
- డాక్టర్ బుర్రా మధుసూదన్‌రెడ్డి
సెల్:9949700037