Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనేక ప్రాణాంతక రోగాలకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా 2 -3 మిలియన్ల పిల్లలకు పలు రకాల వ్యాధినిరోధక టీకాలను ఇప్పించని కారణంగా అకాల మరణాలు నమోదు కావడం విచారకరం. వ్యక్తి జీవితకాలంలో పలు సంక్రమణ వ్యాధులు రాకుండా నిరోధించడానికి అందుబాటులో ఉన్న వైద్య సదుపాయమే వ్యాక్సినేషన్ ప్రక్రియ. ఇప్పటికీ విశ్వవ్యాప్తంగా 18.7 మిలియన్ల శిశువులు టీకాలకు దూరంగా ఉంటూ, సులభంగా భయంకర మహమ్మారుల విష వలయంలో చిక్కుకోవడం జరుగుతున్నది.
యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్: అధిక జనాభా, పేదరికం, నిరక్షరాస్యత వంటి దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న భారతంలో అందరికీ టీకాలు అందించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక 'సార్వత్రిక వ్యాధినిరోధకత కార్యక్రమం (యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్)' గత మూడు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ, దేశంలోని 65శాతం పిల్లలకు మాత్రమే మొదటి సంవత్సరంలో టీకా రక్షణ లభిస్తోంది. భారత శిశువులు అందరికి నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ వసతులు కల్పించాలనే భారీ లక్ష్యంతో కేంద్ర ఆరోగ్యశాఖ 2014లో 'మిషన్ ఇంద్రధనుష్' కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయినప్పటికీ ప్రపంచ శిశువుల్లో 33శాతానికి పైగా టీకాలు వేయించుకోలేని పిల్లలు ఇండియాలో ఉన్నారనే వాస్తవం దేశ అనారోగ్య దుస్థితిని తెలియజేస్తున్నది. విశ్వ మానవాళికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రాధాన్యతను వివరించేందుకు, నిరోధించగల వ్యాధుల నుంచి జీవితకాల రక్షణ పొందేందుకు కావలసిన అవగాహన కల్పించేందుకు ప్రతి యేటా 10 నవంబర్ రోజున 'ప్రపంచ వ్యాధినిరోధకత దినం (వరల్డ్ ఇమ్యునైజేషన్ డే)' పాటించడం జరుగుతున్నది.
టీకా అంటే..: జీవ ప్రక్రియ ద్వారా తయారు చేయబడి, ఒక ప్రత్యేక వ్యాధిని జీవితకాలం నిరోధించడానికి తీసుకునే ఔషధాన్ని టీకా లేదా వ్యాక్సీన్ అని పిలుస్తారు. టీకాలు వేయించడంతో వ్యక్తి శరీరంలో రోగనిరోధక శక్తి జీవితకాలం బలపడుతుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా, ప్రయివేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉండే టీకాలను సకాలంలో క్రమం తప్పకుండా శిశువులకు ఇప్పించాల్సిన కనీస బాధ్యత తల్లితండ్రుల మీద అధికంగా ఉన్నది. ఎలాంటి దుష్ప్రభావం లేని టీకాలను వైద్యుల సలహాలతో మాత్రమే ఇప్పించడం శ్రేయస్కరం.
రక రకాల టీకాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 25 రకాల సంక్రమణ వ్యాధులను నిరోధించడానికి 240 రకాల టీకాలు ఉన్నాయి. 1802లో మూడేండ్ల భారత బాలిక ప్రప్రథమంగా మశూచి టీకాను తీసుకొని చరిత్ర సృష్టించింది. గత ఆరు దశాబ్దాలుగా టీకాల సహాయంతో మశూచి వ్యాధిని అరికట్టగలగడం ఒక వైద్యరంగ ఘనవిజయంగా చెప్పవచ్చు. అతి భయంకరమైన పోలియో వ్యాధిని సమూలంగా అరికట్టేందుకు 'పోలియోరహిత భారత్'గా 2014లో ప్రకటించేందుకు పోలియో టీకాలు అందరికి అందుబాటులో ఉండటమే కారణం. డిప్తీరియా, మాసిల్స్, టిబి, పోలియో, రోటావైరస్, హెపటైటిస్ ఏ/బి, కలరా, మంప్స్, ర్యాబిస్, రుబెల్లా, మశూచి, టెటనస్, టైఫాయిడ్, ఎల్లో ఫివర్, డయేరియా, న్యుమోనియా లాంటి అనేక వ్యాధులకు సరైన చవకైన టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనిసెఫ్ గుర్తించిన ప్రమాదకర వ్యాధుల్లో మీసిల్స్, పోలియో, డిప్తీరియా, వూఫింగ్ కాఫ్, డెంగ్యూ, టిబి, టెటనస్లకు టీకాలతోనే చరమగీతం పాడవచ్చు. శిశువుకు పూర్తి వ్యాధినిరోధక సురక్షను కలిగించడానికి ఒక డోస్ బిసిజి, మూడు డోసుల పిసివి, పోలియో చుక్కలు, రెండు డోసుల రోటా వైరస్, ఒక డోసు మీసిల్స్ టీకాలను నిర్థేశించిన వయస్సుల్లో ఇప్పించాలి. నేటికీ హెచ్ఐవి, ఏయిడ్స్, హంటింగ్టన్ వ్యాధి, హైడ్రోసిఫలస్ల వంటి కొన్ని భయంకర వ్యాధులకు టీకాలు అందుబాటులో లేకపోవడం విచారకరం.
యూనివర్సల్ వ్యాక్సినేషన్ వైఫల్యాలు: సార్వత్రిక వ్యాక్సినేషన్లో వైఫల్యాలకు కారణాలుగా ప్రభుత్వ బలహీన ఆర్థిక స్థితి, ప్రజల్లో అవగాహనా లేమి, నిరక్షరాస్యత, అధిక జనాభా, వ్యాక్సీన్ కొరత లాంటి అవరోధాలను చెప్పవచ్చు. ప్రతి వ్యాక్సీన్‌కు కాలపరిమితి (ఎక్సపైరీ) ఉండడం, సకాలంలో అందకపోవడంతో టీకా మందులు వృధా కూడా అయిపోతున్నాయి. అందుబాటులో ఉన్న టీకాలను పిల్లలకు సకాలంలో ఇప్పించే ఆరోగ్య యజ్ఞంలో తల్లితండ్రులు, పౌర సమాజం, స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వాలు తమ తమ కర్తవ్యాలను నిర్వహించాలి. వ్యాక్సీన్ అందుబాటులో లేని హెచ్ఐవి లాంటి వైరస్‌లకు త్వరగా వైద్య పరిశోధనా ఫలితాలతో పరిష్కారాలు రావాలని ఎదురు చూస్తూ, అవి సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, వ్యాధి సోకక ముందే నివారించుకునే ప్రయత్నాలు చేద్దాం. టీకాలతో జీవితకాల రక్షణ పొందుతాం.
(10 నవంబర్ ''ప్రపంచ వ్యాధినిరోధకత దినం'' సందర్భంగా)
- డాక్టర్ బుర్రా మధుసూదన్‌రెడ్డి
సెల్:9949700037