Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 14నాడు ''వరల్డ్ డయాబెటిస్ డే'' జరుపుకుంటాం. డయాబెటిస్ వ్యాధి చికిత్సలో కీలకమైన ఇన్సులిన్ హార్మోన్‌ను 1921లో ఫ్రెడరిక్ బాంటింగ్, బెస్ట్ కనుగొని 100ఏండ్లు పూర్తయ్యింది. ఇన్సులిన్ హార్మోన్‌ను కనుగొనడంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న డయాబెటిస్ డే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా డయాబెటిస్ వ్యాధికి సంబంధించిన అనేక అంశాల్ని ప్రజలలోకి విస్త్రతంగా తీసుకువెళ్లేందుకు అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య ప్రతి సంవత్సరం ఏదో ఒక నిర్ధిష్టమైన అంశాన్ని ప్రకటిస్తుంది.
2022 సంవత్సరం డయాబెటిస్ డే సందర్భంగా అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య ''రేపటి సంరక్షణ కోసం- అవగాహన'' (Education to protect tomorrow) అన్న ధీమ్‌ను ప్రకటించింది. ఈ ధీమ్ ప్రాధాన్యతను పరిశీలిద్దాం... భారతదేశంలో 2021నాటికి 20-79ఏండ్ల వయసులో ఉన్న వారిలో 7కోట్ల 40లక్షల మంది మధుమేహరోగులు ఉన్నట్లు నిపుణుల అంచనా. మనదేశంలోని మొత్తం మధుమేహరోగుల్లో యాభై శాతం మందిలో అంటే ప్రతి ఇద్దరిలో ఒక్కరు తమకు మధుమేహవ్యాధి ఉన్నట్లు కూడా గుర్తించటంలేదు. ఈ యాభైశాతం మందిలో వ్యాధిని గుర్తించేసరికే కాంప్లికేషన్స్ కలిగి ఉండటం జరుగుతున్నది.
వ్యాధిని ప్రారంభదశలో గుర్తించక, తగిన చికిత్స జరగని ఫలితంగా మనదేశంలో డయాబెటిస్ సంబంధిత కాంప్లికేషన్స్తో సాలీనా 8లక్షల మంది మరణిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. మనదేశంలోని పట్టణ ప్రాంతాలలో గర్భిణీస్త్రీలలో ప్రతి 100మందిలో సగటున 14మంది గర్భధారణ-ప్రేరిత (Gestational Diabetes)కు గురవుతున్నారు. మనదేశంలో డయాబెటిస్ కారణంగా పాదానికి పుండు పడి ఇన్ఫెక్షన్ వలన సాలీనా రెండు లక్షల మందిలో కాలు తొలగించాల్సివస్తున్నది.
2020లో మనదేశంలో ఆర్నేట్ ఇండియా (ORNATE India, UK-India Research Collaboration) ప్రాజెక్టులో భాగంగా జరిపిన అధ్యయనంలో 40ఏండ్ల వయసుపైబడ్డ మధుమేహ రోగుల్లో 4శాతం మందిలో కంటిచూపు దెబ్బతింటున్నట్లు, 2శాతం మంది పూర్తి అంధత్వానికి గురవతున్నట్లు వెల్లడైంది. 2019 లెక్కల ప్రకారం మనదేశంలో ప్రతి మిలియన్ జనాభాకు 150మంది అంత్యదశ కిడ్నీ వ్యాధి (ESRD-End Stage Renal Disease) ఫలితంగా డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. ఇందులో 44శాతం కేసులు డయాబెటిస్ ఫలితంగా సంభవించినవే. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వ్యాధిని ఎలా గుర్తించాలో వైద్యనిపుణుల గైడ్‌లైన్స్ పరిశీలిద్దాం...
డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది?
తల్లి, తండ్రి, సోదరీ సోదరులలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నట్లయితే
45ఏండ్లు వయసు పైబడిన వారిలో, ఊబకాయం (ఒబేసిటి) ఉన్నవాళ్లలో, వారంలో కనీసం మూడుసార్లు అయినా భౌతికవ్యాయామం లేని వాళ్లలో, జంక్ ఫుడ్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో, డిప్రెషన్ లేదా ఇతర మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్న వాళ్లలో, గర్భిణీ సమయంలో డయాబెటిస్ (Gestational Diabetes) వచ్చిన స్త్రీలలో, అధికంగా ధూమపానం (Smoking), మద్యపానం (Alcoholism) అలవాటు ఉన్నవారిలో, జన్యుపరమైన కారణాలవల్ల కొన్ని జాతుల (ఉదా.. ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్ అమెరికన్) ప్రజలలో.
డయాబెటిస్ ఎన్ని రకాలు?
అత్యంత సాధారణంగా మూడురకాల డయాబెటిస్‌ను చూస్తుంటాం.
1. టైప్-1 డయాబెటిస్: మొత్తం డయాబెటిస్ రోగుల సంఖ్యలో సుమారు 10శాతం ఈ కోవకు చెందుతారు. ఆటో-ఇమ్యూన్ రియాక్షన్ (AUTOIMMUNITY) వలన క్లోమగ్రంధిలో(PANCREAS) ఇన్సులిన్ తయారుచేసే కణాలు నశించడం ఫలితంగా టైప్-1 డయాబెటిస్ వస్తుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ఈ ప్రక్రియను ప్రేరేపించవచ్చు. సాధారణంగా పిల్లల్లో, యువకుల్లో వస్తుంది. ఈ రకం డయాబెటిస్ చికిత్సకు ఇన్సులిన్ తప్పనిసరి.
2. టైప్-2 డయాబెటిస్: మొత్తం డయాబెటిస్ రోగుల సంఖ్యలో మెజారిటి ఈ కోవకు చెందుతారు. శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు స్పందించకపోవడం (INSULIN RESISTANCE) టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, భౌతికవ్యాయామం లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి వంటి పలు కారణాల వలన వస్తుంది. టైప్-2 డయాబెటిస్ సాధారణంగా పెద్దలలో వస్తుంది. ఈ రకం డయాబెటిస్ చికిత్సలో ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి విధానంలో మార్పులతో పాటు అవసరమైతే టాబ్లెట్లు వాడాల్సివుంటుంది.
3.జెస్టేషనల్ డయాబెటిస్: ఇది గర్భిణీస్త్రీలలో తొలిసారిగా కనబడే డయాబెటిస్. జన్యుపరమైన కారణాలవల్ల, కొన్ని జాతుల స్త్రీలలో, గర్భిణి సమయంలో హార్మోన్లలో అసమతుల్యత వంటి కారణాల వలన వస్తుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో 24వారాల తర్వాత ఇది బయటపడుతుంది. గర్భధారణ సమయంలో టాబ్లెట్లు సురక్షితం కాదు కాబట్టి ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
పైన చెప్పిన మూడు సాధారణ రకాల డయాబెటిస్ కాకుండా ఇంకా కొన్ని రకాల డయాబెటిస్ కూడా రావచ్చును. కొన్ని ఔషధాల వాడకం వల్ల క్లోమగ్రంధిలో రాళ్లు లేదా ఇతర వ్యాధుల వలన, ఇన్సులిన్ ఉత్పత్తిచేసే బీటాకణాలలో జన్యులోపాలు వలన వచ్చే డయాబెటిస్‌ను 'సెకండరి డయాబెటిస్' (Secondary Diabetes) అంటాం.
డయాబెటిస్ వ్యాధి లక్షణాలు ఏమిటి?
డయాబెటిస్ వ్యాధిలో అన్ని కేసులలో రోగలక్షణాలు ఉండకపోవచ్చును. ఇలాంటి కేసుల్లో రక్తంలో షుగర్ టెస్ట్ ద్వారా మాత్రమే నిర్థారించగలం. కొందరిలో అతిగా దాహం, అతిగా మూత్రం, అతిగా ఆకలి, నీరసం, బరువు తగ్గిపోవడం, పుండ్లు మానకపోవడం, కంటిచూపు మందగించడం, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, తరచుగా దురదలు, తామర వంటి చర్మవ్యాధులు రావడం, తరచుగా జననేంద్రియాలలో ఇన్ఫెక్షన్లు రావడం, లైంగిక సమస్యలు వంటి లక్షణాలు కనబడవచ్చు. కొందరిలో లక్షణాలేమీ లేకుండానే ఏదైనా శస్త్రచికిత్సకు (Surgery) ముందు చేసే రొటీన్ పరీక్షలలో డయాబెటిస్ ఉన్నట్లు వెల్లడవుతుంది.
డయాబెటిస్ వలన వచ్చే కాంప్లికేషన్స్ (దుష్ఫలితాలు) ఏమిటి?
డయాబెటిస్ రోగుల్లో దీర్ఘకాలంగా డయాబెటిస్ నియంత్రణలోలేని సందర్భాల్లో శరీరంలోని పలు అవయువాలు దెబ్బతిని ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంది. న్యూరోపతి((Neuropathy)వలన అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు లేదా మొద్దుబారడం జరుగుతుంది. వాస్కులోపతి (Vasculopathy) వలన రక్తనాళాలలో రక్తప్రసరణ తగ్గిన ఫలితంగా కొద్దిదూరం నడిస్తేనే కాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది. న్యూరోపతి, వాస్కులోపతిలతో పాటుగా రోగనిరోధక వ్యవస్ధ పనితీరు మందగించడం ఫలితంగా పాదాలలో పుండ్లు (Foot Ulcers) మానకుండా ఉండి ఇన్ఫెక్షన్ కూడా తోడై ప్రమాదకరంగా పరిణమించినప్పుడు పాదం తొలగించాల్సి (amputation) రావచ్చు. కిడ్నీలలో జరిగే మార్పుల వలన కలిగే నెఫ్రోపతి (Nephropathy) వలన ముఖం, శరీరమంతా ఉబ్బడం, నడిస్తే దమ్ము రావడం జరుగుతుంది. కిడ్నీల పనివిధానం మరింత దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరమవుతుంది. డయాబెటిక్ రెటినోపతి (Retinopathy) వలన కంటిచూపు తగ్గడమేగాక పూర్తి అంధత్వానికి కూడా దారితీయవచ్చు. రక్తప్రసరణ తగ్గడం వలన గుండెపోటు (Heart Attack) వచ్చే అవకాశం కూడా డయాబెటిస్ రోగుల్లో ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ నివారణకు ఏం చేయాలి?
ఎత్తుకు తగ్గ బరువును మాత్రమే కలిగివుండాలి. అవసరమైనన్ని కేలరీలను మాత్రమే ఇచ్చే తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ఫైబర్ తగినంత ఉండేలా చూసుకోవాలి. జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వారంలో కనీసం ఐదురోజులు నడవాలి. రోజుకు సగటున 40నిమిషాలు వేగంగా(5Km/hr) నడవాలి. నడకతో పాటుగా ఇతర వ్యాయామాలు కూడా చేయవచ్చు. పాజిటివ్ దృక్పథం కలిగివుండాలి. మానసిక అలజడి, ఒత్తిళ్లను దూరంగా ఉంచాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. మహిళల్లో గర్భధారణ సమయంలో మధుమేహవ్యాధిని గుర్తించేలా అవగాహన కల్పించాలి. జెస్టేషనల్ డయాబెటిస్ కేసుల్లో గర్భిణీలలో సంభవించగల రిస్క్‌ను నివారించుకునేలా ముందస్తు ప్రణాళికను వారికి బోధించాలి. 45ఏండ్ల వయస్సు దాటిన వారందరూ రెగ్యులర్‌గా రక్తంలో షుగర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి.
డయాబెటిస్ కాంప్లికేషన్స్
నివారణలో ABC టార్గెట్స్ ప్రాముఖ్యత
డయాబెటిస్ వలన నాడీవ్యవస్ధకు, కండ్లకు, కిడ్నీలకు, గుండెకు కలిగే ప్రాణాంతక దుష్ఫలితాలను నివారిం చేందుకు ABC లను కఠినంగా నియంత్రించుకోవాలి.
A అంటే A1c. గత మూడు నెలల్లో సగటు బ్లడ్ షుగర్‌ను HbA1c అనే ఈ పరీక్ష తెలియజేస్తుంది. దీన్ని 7శాతం లోపు ఉండేలా నియంత్రించుకోవాలి. B అంటే Blood Pressure (రక్తపోటు). డయాబెటిస్ రోగులలో ప్రాణాంతక దుష్ఫలితాలకు దారితీయగల మరో అంశం అయిన రక్తపోటును 140/90 లేదా అంతకంటే తక్కువగా ఉండేలా నియంత్రించుకోవాలి.
C అంటే Cholesterol (LDL-C). రక్తనాళాలను సన్నబరచి గుండెపోటుకు దారితీయగల ఈ LDL కొలెస్టరాల్‌ను 100mg దాటకుండా నియంత్రించుకోవాలి.
డయాబెటిస్ వ్యాధి పట్ల విస్తృతంగా అవగాహన కల్పించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు విధాన నిర్ణేతలు, వైద్యరంగ నిపుణులు, ప్రజారోగ్య శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున కృషి చేయాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.
(నవంబర్ 14, 2022 ''వరల్డ్ డయాబెటిస్ డే'')
- డాక్టర్ కె. శివబాబు