Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యం ప్రధానం. ఇది అశ్రద్దకు గురైంది. నిర్ధారణ పక్షపాతం అభిజ్ఞ పక్షపాతాల్లో ఒకటి. మానసికశాస్త్రం, అభిజ్ఞ విజ్ఞానశాస్త్రాల్లో దీని వివరణ లభిస్తుంది. ఒకరి నమ్మకాలు, విలువలను నిర్థారించి, మద్దతు ఇచ్చే విధంగా అన్వేషించే, వివరించే, అనుకూలంగా సమాచారాన్ని విరమించుకునే, గుర్తుచేసుకునే ధోరణిని నిర్థారణ పక్షపాతం అంటారు. హార్వర్డ్ ఆచార్యులు డేవిడ్ పర్కిన్స్ దీన్ని స్వపక్షపాతం అన్నారు. కెనడా రచయిత, ఉపాధ్యాయుడు విలియం హార్ట్ అనుకూలత పక్షపాతంగా పేర్కొన్నారు.
క్రీ.పూ.1321-1265 మధ్య ఇటలి కవి డాంటె అలిఘీరి, 460-395 మధ్య గ్రీకు చరిత్రకారుడు తుసిడిడేస్ తమ రచనల్లో నిర్థారణ పక్షపాతం గురించి ప్రస్తావించారు. ఆమోదిత సిద్ధాంతం, నిర్థారిత అంశాల పట్ల తీక్షణ దృష్టిని, వ్యతిరేక భావాల పట్ల అంధత్వాన్ని పెంచుతుందని 1844లో జర్మన్ తత్వవేత్త ఆర్థర్ స్కోపన్ హావర్ రాశారు. మేధావులు, శాస్త్రవిజ్ఞాన, గణిత, తాత్విక పండితులు కూడా కొన్ని సాధారణ సత్యాలను గుర్తించలేరని 1897లో 'వాట్ ఈజ్ ఆర్ట్' పుస్తకంలో రష్యా ప్రఖ్యాత రచయిత లెవ్ తోల్సోరు వ్యాఖ్యానించారు. 1960లో బ్రిటిష్ మనస్తత్వవేత్త పీటర్ వాసన్ ఈ పదాలను రూపొందించి ప్రయోగాలతో వివరించారు. అమెరికా మనస్తత్వవేత్త, రచయిత రేమండ్ నికర్సన్ 1998లో ఈ విషయంపై పుస్తకం రాశారు. అమెరికా సామాజిక మనస్తత్వవేత్త జెన్నిఫర్ లర్నర్, అమెరికా-కెనడా రాజకీయ విజ్ఞాన రచయిత ఫిలిప్ టెట్లాక్ మానసికశాస్త్రంలో అన్వేషణాత్మక నిర్థారణ అన్న ఆలోచనలను గుర్తించారు. అన్వేషణాత్మక ఆలోచన తటస్థంగా ఉంటుంది. పలు విధాల, కోణాల అభిప్రాయాలను పరిగణిస్తుంది. అభ్యంతరాల, ఆటంకాల సంభావ్యతను ఊహిస్తుంది. నిర్ధారణ తాత్వికులు ఒకే దృక్కోణ అభిప్రాయాన్ని సమర్థిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు అనుకూలంగా ఉద్దేశాలు మార్చుకుంటారు. నిర్థారణ ఆలోచనతో తమ విశ్వసనీయతను బలపర్చుకుంటారు. విజ్ఞులతో చర్చల్లో విమర్శనాత్మకంగా, తర్కబద్దంగా వ్యవహరించాలి. మూర్ఖులతో చర్చ గుడ్డిపిల్లి ముందు ఎలుక నాట్యంలా ఉంటుంది. సాధారణంగా చర్చలు నిర్థారణ ఆలోచన ధోరణిలో ఉంటాయి. ఇదే నిర్ధారణ పక్షపాతం. నిర్థారణ పక్షపాతంలోని నమ్మకాల, పక్షపాతాల మూలాలు బాల్యంలో ఏర్పడతాయని ప్రగతిశీల మనస్తత్వవేత్త ఈవ్ విట్మోర్ వాదన. ఈ భావాలతో పెద్దయినవారు తమనుతాము మోసం చేసుకుంటూ భ్రమల్లో కూరుకుపోతారు. ప్రశ్న, హేతువు, తర్కం, వివేకం విచక్షణలను అలవర్చుకున్నవారే తప్పులుదిద్దుకొని సక్రమ మార్గంలో పయనించగలరు. నిర్థారణ పక్షపాతం అసంబద్ద కారణాలతో మనోవైకల్యతకు దారితీస్తుంది. విచక్షణ, పారదర్శకతలను కోల్పోయిన ప్రజలు శాస్త్రీయ నిర్ధారణలు వదిలి నిర్థారణ పక్షపాతానికి లోనవుతారు. తమ అభిప్రాయాల మద్దతుకు అస్ఫష్ట ఆశాస్త్ర నిర్ధారణలపై ఆధారపడతారు. గత అభిప్రాయాలు మార్చుకోరు. ప్రతికూల నమ్మకాలకు, భావోద్రేక నిర్ణయాలకు లోనవుతారు. రుజువున్నా నిజాన్ని నమ్మరు. రుజువులులేని పుక్కిటి పురాణాలను విశ్వసిస్తారు. ఆచరిస్తారు. హేతువు, తర్కం, శాస్త్రీయతలను వదిలేస్తారు. తప్పుడు అవగాహనతో భ్రమల్లో కొట్టుకుపోతారు. ప్రత్యామ్నాయాలు పట్టించుకోరు. సొంత ఆలోచనలు కోల్పోతారు. అతివిశ్వాసంతో ఛాందసభావాలు సంతరించుకుంటారు. మానవాతీత శక్తులను నమ్ముతారు. శాస్త్రజ్ఞులు, మేధావులు కూడా దీనికి అతీతులు కారు. విశ్వ సృష్టివాదులు నిర్థారణ పక్షపాతులు. జీవపరిణామ సిద్ధాంతకర్తలు దీనికి వ్యతిరేకులు.
నిర్థారణ పక్షపాతం తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది. పరిశోధన ఫలితాలను అపమార్గం పట్టిస్తుంది. పాలకుల, నాయకుల, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ తప్పుడు నిర్ణయాలకు కారణం అవుతుంది. మన అభిమాన రాజకీయుని గురించి అనుకూలంగా చెపితే నమ్ముతాం, వ్యతిరేకయదార్థాన్ని నమ్మం. ఇందులో పక్షపాతాల, భ్రమల ప్రభావాలే తప్ప నిజానిజాల ప్రమేయం ఉండదు. నిర్ధారణ పక్షపాతం అపార అనుభవంగల నిపుణులనూ దారితప్పిస్తుంది. ఎడమచేతి వాటంవారు మేధావులన్న వాదన, ఫలానా రోజుతో ప్రపంచం అంతమవుతుందన్న ప్రచారాలు ఈ నమ్మకం ఫలితాలే. నిర్థారణ పక్షపాత వైద్యులు రోగిలో తమకు తెలిసిన రోగలక్షణాల కోసం వెతుకుతారు కాని కొత్త రోగలక్షణాలను గుర్తించరు. ప్రజలు అమెరికా, చైనా, రష్యాల గురించి తమ పాత అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారు. కొత్త పరిణామాలను పరిశీలించరు. విశ్వసించరు. రాజకీయుల గురించి మోసపోతూ ఉంటారు. తమ నమ్మకమే సరైందని ఓటరిస్తారు. ఫలానా సంగీతమే మంచిదనటం, హౌమియో వైద్య వ్యవస్థ, భూతభవిష్యత్ శాస్త్రాలు నిర్థారణ పక్షపాత ఫలితాలే. నేటి పాలకవర్గ ఆలోచనలు నిర్థారణ పక్షపాత ధోరణులే. సామాజిక మాధ్యమాల్లో ఈ నమ్మకాలు, పక్షపాతాలు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు పతనమవుతున్నాయి. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమ యాజమాన్యాలు పేరు, వ్యాపారలబ్ధి కోసం నిర్థారణ పక్షపాత ప్రకటనలతో తప్పుడు వార్తలు ప్రచారంచేస్తున్నాయి. 2016 అమెరికా ఎన్నికల్లో, 2014, 2019, 2022 భారత ఎన్నికల్లో నిర్ధారణ పక్షపాత సామాజిక మాధ్యమాలు తీవ్ర ప్రభావం చూపాయి. నిర్థారణ పక్షపాతంతో వ్యాపార, సామాజిక దురవగాహన పెరిగి ఆర్థికవ్యవస్థ, సమాజం దెబ్బతింటున్నాయి. శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు వక్రీకరణ చెందుతున్నాయి. భౌతిక, మానసిక ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. న్యాయవ్యవస్థ ఆలోచనా ధోరణి దారితప్పింది. పోలీసు, పాలన, సంక్షేమ, వితరణ వ్యవస్థలు ప్రజావ్యతిరేకంగా మారాయి. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వాలు పక్షపాత తాత్విక పద్దతులు పాటిస్తున్నాయి. అమెరికాలో కార్ల నిషేధంపై అభిప్రాయ సేకరణలో జర్మన్ కార్లను ముందుగా నిషేధించాలనడం పాలక వక్రీకరణ.
భర్తలు సొంత తప్పులతో అకాలంలో చనిపోతారు. ఐనా విధురుని (భార్య చనిపోయినవాని) కంటే విధవ బాధలు, కష్టాలు ఎక్కువ. ఆధునిక సమాజంలోనూ ఆచారాల అమలుకు నిర్ధారణ పక్షపాతం కారణం. ఈ కారణంతోనే ప్రధానితో సహా పాలకులు, సంఘీయులు రాజ్యాంగ స్ఫూర్తి, శాస్త్రీయతలను తుంగలోతొక్కారు. పురాణాలను చరిత్రగా మార్చారు. శాస్త్రాలు, శాస్త్రజ్ఞులను ఎగతాళిచేశారు. పన్నుల ఆదాయం తగ్గుదల దేవుని పని అన్నారు ఆర్థికమంత్రిణి. సమస్యలను దేవుడే పరిష్కరించాలని ఆమె ఉద్దేశమా? చలనచిత్ర దర్శకుడు, కథకుడు విశ్వనాథ్ కళాతపస్వి. అభ్యుదయవాది. అయితే ఆయన చిత్రాల్లో భక్తిభావం, దైవపూజ, హైందవ సాంప్రదాయాల ప్రదర్శన ఎక్కువగా కనపడతాయి. కథాకథనాలు, ఘటనలు, కళాసాధనలు గుళ్ళలో, గుళ్ళ చుట్టూ జరుగుతాయి. దేవుని కళ్ళకు కడతాయి. దైవచింతన ప్రేరేపిస్తాయి. క్రైస్తవ దేశాల్లో గర్భస్రావాలను ఒప్పుకోరు. తల్లికి ప్రాణాంతకమైనా పంతం వీడరు. మరణశిక్ష కొన సాగాలన్న వాదనకు సనాతన ప్రతీకారభావాలే కారణం. మతోగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, సామాజిక దుర్వ్యసనాలు నిర్ధారణ పక్షపాతాలే. సామ్రాజ్యవాద కుట్రల ఏర్పాటు, అమలులో నిర్ధారణ పక్షపాతం ప్రధాన పాత్ర పోషించిందని, శాస్త్రీయ ఆవిష్కరణల కంటే సామ్రాజ్యవాదం తీవ్రమైందని అమెరికా పరిశోధకులు క్రిస్టఫర్ వుల్ఫ్, అన్నేబ్రిట్ నివేదించారు. ఉద్యోగనియామకాల్లో యజమానులు అభ్యర్థులకు ఏకపక్ష ప్రశ్నలు సంధిస్తారు. అనుకూలుర స్వీకరణ, కానివారి తిరస్కరణ వారి ఉద్దేశం. అయితే కొన్నిసార్లు అర్హులను పోగొట్టుకొని అనర్హులను తీసుకుంటూ ఉంటారు.
భావ దారిద్య్రానికి దారితీయగల నిర్ధారణ పక్షపాత పరిష్కారానికి ప్రత్యేక మానసిక శిక్షణ అవసరం. ఇతరులు చెప్పేది శ్రద్ధగావినాలి. వారి తాత్వికత, ఆచరణకోణాల నుండి ఆలోచించాలి. విన్నసమాచారాన్ని మన జ్ఞానంతో పోల్చి, విశ్లేషించి రుజువులతో వాస్తవాన్ని నిర్ధారించాలి. గందరగోళ సందిగ్ధస్థితుల నుండి బయటపడాలి. స్వీయావలోకన, స్వీయవిమర్శ, శాస్త్రీయ దృక్పథం, సకారాత్మక ఆలోచన, చర్చలు, ఇతరుల అభిప్రాయాల మన్నన అలవర్చుకోవాలి. తీవ్ర వ్యతిరేక ఆలోచనల పోటీ రాజకీయులను అబ్రహాం లింకన్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. నిర్ణయాలకు ముందు విపరీత వాదనలు, చర్చలను అనుమతించేవారు.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్:9490204545