Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో ''కలుపు''. రెండవది మనదేశంలో ''అవినీతి''. కలుపు వల్ల పొలం నాశనం అవుతుంది. అవినీతి వల్ల మన దేశం సర్వనాశనం అవుతుంది. నేడు అవినీతి ఇందు గలదందు లేదనే సందేహం లేదు. ఎందెందు వెతికిన అందందు సర్వ వ్యవస్థల్లో వికృత రూపంలో వ్యవస్థీకృతమై ఉంది. ఈ ''అవినీతి వటావృక్షానికి తల్లి వేరు ''రాజకీయ అవినీతి'' అని ఎన్నో అధ్యయనాలు, నివేదికలు స్పష్టం చేసాయి. అవినీతికి, రాజకీయాలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అవినీతి మూలంగా అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ధనమంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండడం వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు న్యాయాధీశులే గౌతమ్ నవలఖా కేసు సందర్భంగా ఈ విషయమై ఆందోళన వ్యక్తపరిచారు. ఎంత అవినీతికి పాల్పడినా ధనబలంతో కొందరు సునాయాసంగా కేసుల నుండి తప్పించుకుంటున్నారనీ, ఆ అవినీతిపరులే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనీ అత్యున్నత న్యాయాధీశులే ఆవేదన వ్యక్త పరచడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. పంచాయతీ నుండి పార్లమెంటు దాకా పరిస్థితి దోచుకున్నోళ్లకు దోచుకున్నంతగా మారింది అనిపిస్తుంది. జనజీవనంలో వివిధ కార్యాలయాల కలాపాల నుండి చిన్నా చితక అవినీతి (మైనర్ కరప్షన్) మొదలై, భారీ అవినీతి (మేజర్ కరప్షన్) రాజకీయ కుంభకోణాల వరకు చూస్తున్నాం, వింటున్నాం. ఈ అవినీతి పరులందరూ ఉద్యోగులైనా, రాజకీయ నాయకులైనా దొరికిన కొన్నాళ్లే వారికి గ్రహణం పట్టినట్లు ఉంటారు. ఆ తర్వాత వారే అత్యున్నత స్థాయిలో, స్థానాల్లో ఉంటున్నారు. ఇలా వ్యవస్థలలో అవినీతి సర్వసాధారణమనేలా ప్రజల్ని మానసికంగా తయారు చేశారు. ఇది నేరమనేది మరిచిపోయినారు. అంతేకాదు అవినీతిని ప్రభుత్వ పన్నులతో పాటు ఇదొక అదనపు (అడిషనల్ టాక్స్) పన్నుగా మార్చేశారు. దీన్ని వ్యతిరేకించిన వారిని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. అందుకే ఈ స్థితి దాపురించింది. దీన్ని అరికట్టడానికి మరో సాంఘిక ఉద్యమం రావాలి. మన దేశంలో ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టైన ఎన్నికల ప్రక్రియలో ఆర్థిక, అంగ బలం గలవారిని, సంపన్నులను, నేరచరిత్ర కలిగిన వారిని గెలుపు గుర్రాల పేరుతో రాజకీయ పక్షాలన్నీ ఏరి కోరి అభ్యర్థిగా నిలుపుతున్నారు. ఓటుకు ఒక రూపాయి చొప్పున పంచిన రోజుల నుంచి నేడు ఓటుకు ఐదువేల రూపాయల వరకు పంచడం చూస్తున్నాం. అంతేకాదు అవినీతితో సంపాదించిన డబ్బును వెదజల్లుతూ ప్రజలను ప్రలోభాల మత్తులో నిండా ముంచుతున్నారు. నేడది ఎక్కడికి దారి తీసింది అంటే! ''డబ్బు ఇవ్వకుంటే ఓటు వేసేదే లేదు'' అనే స్థాయికి ప్రజల్ని దిగజార్చినారు. ఇదంతా అవినీతి సొమ్ము కాదా? ఎన్నికల వేళ కోట్లకు కోట్లు వెదజల్లూతూ, ఆ తర్వాత అంతకు రెట్టింపుగా రాబట్టుకోవడానికి విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నది నిజం కాదా! ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల (నాయకుల)పై అనేక ఆశలు పెట్టుకుంటారు. వారి జీవితాలను ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే చట్టాలతో పాలన అందించాలి. కానీ అది నెరవేరకపోగా సంతలో సరుకుల్లా అమ్ముడుపోతున్నారు. కొనుగోలు సరుకుగా మారిపోతున్నారు. ప్రజాతీర్పుకు, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వకుండా అధికారం, పదవి వ్యామోహంలో నైతిక విలువలకు తిలోదాకాలివ్వడంలో అన్ని రాజకీయ పార్టీలు ''గురివింద నీతినే'' అవలంభిస్తున్నాయి. జనాల ఓట్లతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులను కొంటున్నారు. ప్రభుత్వాలను కూలుస్తున్నారు. ఏర్పాటు చేస్తున్నారు. సామాన్యులు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితిని చూస్తున్నాం. ఇలా భారీ ఖరీదైనవిగా మారిన రాజకీయాల నుండి అవినీతిని ప్రక్షాళన చేయాలి. ఇకనైనా ఈ అవినీతి చీడపీడను కట్టడి చేయకపోతే భవిష్యత్ భారతం ఏమైపోవాలి? ప్రజలను ఇలా తయారు చేసింది ముమ్మాటికీ రాజకీయ నాయకులే. అవినీతికి, రాజకీయాలకు ఉన్న అవినా భావ సంబంధాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి అవినీతికి వ్యతిరేకంగా నిలబడి స్వీయ ప్రయోజనాలు ఆశించని నైతిక విలువలకు కట్టుబడ్డ వారిని పార్టీలు అభ్యర్థులుగా నిలపాలి. అలాంటి వారిని ప్రజలు ప్రలోభాలకు లోబడకుండా ఎన్నుకోవాలి. నేడు రాజకీయాలకు దూరంగా ఉంటున్న మేధావులు, బుద్ధిజీవులు, యువకులు విశాల భరతజాతి భవితవ్య ఆకాంక్షల కోసం రాజకీయాల్లోకి రావాలి. బతకడానికో, అవినీతితో ధనం సంపాదించడానికో రాజకీయాల్లోకి రావద్దు. ప్రజల బతుకులను మార్చడానికి రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే రాజకీయం గానీ, పార్టీ గానీ ఉద్యోగమో, వ్యాపార సంస్థో కాదు. దానిని ఒక సామాజిక బాధ్యతతో చేసే సేవగానే, సంస్థగానే నిర్వహించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన పత్రికా స్వేచ్ఛ సైతం అధికార పక్షాల కబంధహస్తాల్లో బంధించ బడుతున్నది. ప్రజల సమస్యలను, అసమ్మతులను సైతం నిర్భయంగా తెలియజేసే స్వేచ్ఛ లేకుండా పోతోంది. అంతేకాదు స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థలను, వ్యవస్థలను, దర్యాప్తు సంస్థలను అధికార రాజకీయాలకు ఊడిగం చేయించుకుంటున్నారు. ఇలాంటి వేళ మన దేశంలో వెంటనే సమగ్రమైన సంస్కరణలతో కఠినచట్టాలతో అవినీతి నిర్మూలించబడాలి. నాటి స్వాతంత్ర పోరాటంలోని జాతి నిర్మాతల స్వప్నాలు నెరవేరేలా అవినీతి రహిత, నైతిక విలువలతో కూడిన రాజకీయ నాయకుల కోసం పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవినీతి మరకలేని వారిని అభ్యర్థిగా నిలిపి ధనాన్ని పంచకుండా ఉమ్మడి నిర్ణయాలతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి. అవినీతి రహిత విధానాలతో పంచాయతీ నుండి పార్లమెంటు వరకు బంట్రోతు నుంచి అత్యున్నత అధికారి వరకు పారదర్శకంగా పాలన అందించేలా చూసే బాధ్యత పాలకులపై ఉంది. అదే సమయంలో ప్రజలు కూడా చైతన్యవంతులై అవినీతి లేకుండా మరో ప్రజా ఉద్యమాన్ని నెలకొల్పి అన్ని వ్యవస్థలను, వర్గాలను, పాలకులను సక్రమంగా నడుచుకునేలా చూడాల్సిన బాధ్యత ఉంది. రాజకీయ నాయకులు కూడబలుక్కొని అవినీతితో దేశ సంపదను వంతులవారీగా దోచుకు తింటున్న తీరుమారాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి కేసులను సత్వర విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగైనా, ప్రజా ప్రతినిధైనా అవినీతికి పాల్పడితే వారిని కఠిన చట్టాలతో శిక్షించేలా సవరణలు రావాలి. రాజకీయ అవినీతి నిర్మూలిస్తే అన్ని వ్యవస్థలు వాటి అంతట అవే సర్దుకుంటాయి. ఆసేతు హిమాచలం ఒక్కటిగా చైతన్యవంతమై నేను సైతం అంటూ పోరాడితేనే అవినీతి రహిత సమాజాన్ని స్థాపించుకోగలం. గమ్యాన్ని ముద్దాడే వరకూ సాగే అవిశ్రాంత పోరాటం నేటి అవసరం.
- మేకిరి దామోదర్
సెల్: 9573666650