Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెట్టచాకిరీ చట్టవిరుద్ధం, అమానవీయం, ఆక్షేపణీయం. పేదరికం వెక్కిరిస్తున్న భారతంలో బాలకార్మిక వ్యవస్థ ఊడలు విస్తరిస్తూనే ఉన్నాయి. డిజిటల్ యుగంలో మిలియన్ల బడుగులు అవిద్య, అధిక జనాభా, మానవ అక్రమ రవాణా, గృహ చాకిరీలతో కొట్టుమిట్టాడుతున్నారు. బానిసత్వ భావనలు, ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. గృహ సంబంధ సేవలకు బాలల్ని వినియో గించడం సర్వసాధారణం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా 18మిలియన్ల నిరుపేదలు బానిసల వలె ఇటుక బట్టీలు, కార్పెట్ పరిశ్రమలు, గ్లాస్‌వేర్ ఉత్పత్తి క్షేత్రాలు, గాజుల తయారీ కేంద్రాల్లో అతి ప్రమాదకర వాతావరణంలో పని చేస్తున్నారు. స్వల్ప అప్పుల ఎర చూపి కుటుంబాలను బంధించి, శ్రమదోపిడీ (తక్కువ భత్యానికి ఎక్కువ శ్రమ) చేయడాన్ని వెట్టిచాకిరీగా వ్యవహరించాలి. పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ భారతంలో కూడా ఈ చాకిరీ వ్యవస్థ విస్తరించింది.
వెట్టిచాకిరీ/బానిసల కేంద్రంగా భారతం
పౌర హక్కుల సంఘాల అంచనా ప్రకారం కనీసం 30మిలియన్ల అభాగ్యులు వెట్టిచాకిరీ ఉచ్చులో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తున్నది. భారత జనాభాలో 1.4శాతం బానిస బతుకులు అనుభవిస్తున్నారు. 2018 వివరాల ప్రకారం 18.3మిలియన్ల అభాగ్యులు బానిస విషవలలో చిక్కినారని తెలుస్తున్నది. ఒక్క యూపీ రాష్ట్రంలోనే 5-14ఏండ్ల మధ్య వయస్సు కలిగిన 2.1మిలియన్ బాలలు బానిసలు బతుకుతున్నట్లు నిపుణులు వెల్లడించడం ఓ హెచ్చరికగా భావించాలి. ప్రపంచ దేశాల్లో ఇండియాలోనే అత్యధికంగా 14మిలియన్ల వరకు పేదలు బానిస ఉచ్చులో చిక్కి ఉన్నారని తెలుస్తున్నది. బుందేల్‌ఖండ్, బీహార్, ఝార్ఖండ్ ప్రాంతాలు వెట్టిచాకిరీ కేంద్రాలుగా పేరు తెచ్చు కుంటున్నాయి. గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ వివరాల ప్రకారం 167దేశాల జాబితాలో భారతానికి 53వ స్థానం వచ్చింది. ప్రపంచ బానిసల్లో 71శాతం మహిళలు, బాలికలే ఉండటం ఆశ్చర్యాన్నే కాకుండా బాధను కూడా కలిగిస్తున్నది.
బానిసత్వం/వెట్టిచాకిరీ పెరగడానికి కారణాలు
కడు పేదరికం, అవిద్య, అవగాహనలేమి, పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్లడం, సామాజిక మూఢనమ్మకాలు, ఆర్థిక అనారోగ్యం, యాజమా న్యాల దోపిడీ సంస్కృతి కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ వ్యవస్థల సమన్వయలోపం, చట్టాల అమలు కనిపించక పోవడం, నేరం చేసిన యాజమాన్యాలకు శిక్షలు పడకపోవడం లాంటి పలు కారణాలు చాకిరీని పోషిస్తున్నాయి. యుద్ధ బంధీలు, మతపర కారణాలు కూడా బానిసత్వాన్ని పెంచిపోషిస్తున్నాయి.
బానిసత్వం/వెట్టిచాకిరీ నివారణ మార్గాలు
వెట్టిచాకిరీ, బానిసత్వ దురాచారాల పట్ల అవగాహన కల్పించడం ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంధ సంస్థల బాధ్యత. బాల కార్మిక వ్యవస్థను కఠిన చట్టాల అమలుతో కూకటివేళ్లతో పీకి వేయాలి. చాకిరీ వలలోంచి రక్షించబడిన బడుగులకు పునరావాసం కల్పించడంతో పాటు గౌరవప్రద పనిని కల్పించాలి. పౌరులకు అర్హతకు తగిన పని కల్పించడంతో పాటు పనికి సరైన వేతనం ఇప్పించే కనీస బాధ్యత ప్రభుత్వాలదని మరువరాదు. వ్యవసాయరంగంతో పాటు ప్రయివేట్ రంగంలో శ్రమదోపిడీని తగ్గించేలా తరుచుగా తనిఖీలు నిర్వహించాలి. కేరళ, ఒడిస్సా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు చాకిరీకి వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాలు చేయడం హర్షదాయకం.
కాగితాలకే పరిమితమైన చట్టాలు
వెట్టిచాకిరీ నిషేధ వ్యవస్థ చట్టం-1976 ప్రకారం మానభంగాలు, శ్రమ దోపిడీ, హింస, దాడి, కిడ్నాప్‌లు, బలవంతంగా బంధించడం, చాకిరీ కోసమే బాలల్ని కొనడం, చట్టవ్యతిరేకంగా నేర వృత్తిలోకి దించడం లాంటి అమానవీయ చర్యలకు పూనుకున్న వారికి 10ఏండ్ల వరకు జైలుతో పాటు నగదు ఫైన్ విధించడం జరుగుతుందని తెలిసినా విచ్చల విడిగా ఈ అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలల న్యాయ చట్టం-1986 ప్రకారం బాలలను బలవంతంగా పనుల్లో వినియోగించడం, నేరప్రవృత్తిని పెంచి పోషించే నేరానికి 3ఏండ్ల వరకు కారాగారవాసం ఇవ్వవచ్చు. ప్రజలకు కనీస అవసరాలు కల్పించవలసిన ప్రభుత్వాలు చాకిరీ వ్యవస్థను నిర్మూలించే చర్యలను చేపట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నాయి. చాకిరీ, బానిసత్వ దురాచాలను రూపుమాపడానికి పౌర సమాజం ప్రధాన బాధ్యతను తీసుకోవాలి. వీటికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బానిసలుగా మార్చే యాజమాన్యాలను బోనులో నిలపడం, సామాన్య బడుగులకు అవగాహన కలిపించడం విధిగా నిర్వహించాలి.
అనాదిగా శ్రమ దోపిడీ దురాచారం
ఆకలి కోరల్లో బతుకులు ఈడుస్తున్న అభాగ్యులు మరోమార్గం తోచని దుస్థితిలో వెట్టి చాకిరీ విష వలయంలో చిక్కి బతుకుల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. పని ప్రదేశంలోనే చాపంత భూమిలో గుడారాలు వేసుకొని అతి ప్రమాదకర వాతావరణంలో బతుకుతున్నారు. ఇటుక బట్టీల్లో వెయ్యి ఇటుకలు చేసిన వారికి రూ.200 ఇవ్వడం, యాజమాన్యాలు వాటిని కనీసం ఏడు వేలకు అమ్మడం జరుగుతోంది. బట్టీల్లో పనిచేసే బాలికలు, మహిళలను బలవంతంగా వశపర్చుకొని లైంగికంగా వేధించడం, హింసించడం సర్వసాధారణంగా కనిపిస్తున్నది. ఇటుక బట్టీల్లో అత్యధికంగా నిరక్షరాస్య ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదలు పని చేయడం జరుగుతోంది. యూపీ బదోలి ప్రాంతంలోని కార్పెట్ల పరిశ్రమల్లో వెట్టిచాకిరీ తీవ్రత అధికంగా కనిపిస్తున్నది. చేతి గాజులు 350 తయారు చేసిన వారికి ఆరు రూపాయలు చెల్లిస్తారు. ఒక రోజులో 12-14 గంటలు పని చేసిన వారికి రూ.180 వరకు కూలీ చెల్లిస్తున్నారు. జీవించే హక్కు, సమానత్వ హక్కు, గౌరవ ప్రద హక్కు కల్పించబడిన భారతంలో వెట్టిచాకిరీ వ్యవస్థ యదేచ్ఛగా కొనసాగడం దౌర్భాగ్యం, అవమానకరం.
ఆధునిక నాగరిక సమాజంలో మనిషిని మనిషిలా చూడటం మరిచిన సమాజం రాక్షస రాజ్యాన్ని తలపిస్తుంది. మురికి కూపాల్లో జీవచ్ఛవాలుగా బతుకుతున్న బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేదెన్నడు, ఆదుకునే ఆప్తులు ఎవ్వరు? బాల్య వివాహాలు, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించడం లాంటి అనాగరిక పరిస్థితులు సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి. వెట్టిచాకిరీ, బానిసత్వాలను తగ్గించే చర్యలను కూడా ప్రభుత్వాలు విస్మరిస్తుండటం విచారకరం. దీనికి పౌర చైతన్యమే పరిష్కారం చూపగలదు.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037