Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో 83,102 మంది రోగులు హెచ్ఐవి బారిన పడ్డారని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. హెచ్ఐవి మహమ్మారి తెలంగాణను గజగజ వణికిస్తోంది. 2017లో ఒక్క తెలంగాణలోనే నమోదైన హెచ్ఐవి కేసులు 9,324. అప్పటి నుంచి తెలంగాణ హెచ్ఐవి బాధితుల అడ్డాగా మారిందని ''రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ'' సంస్థ తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగటం ఆందోళన కలిగిస్తున్నది.
హెచ్ఐవి భూతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. మందులేని మాయ రోగానికి నిండు జీవితాలు బలైపోతున్నాయి. అవగాహన లోపం, నిర్లక్ష్యం మూలంగా కొందరు వ్యక్తులు ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వల్ల వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. హెచ్ఐవి పట్ల ప్రజలకు అవగాహన, చైతన్యం కలిగించాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం పాటించాలని ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. ప్రపంచంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా ఎయిడ్స్ మీద అవగాహన కలిపించాలనే ఉద్దేశ్యంతో 1988'వ' సంవత్సరం నుండి ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్నది.
హెచ్ఐవి / ఎయిడ్స్
హెచ్ఐవి అనేది ఒకరకమైన వైరస్. ఇది క్రమేణా ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది. సాధారణ వ్యక్తిలో ప్రతి లీటర్ రక్తంలో వ్యాధి నిరోధక కణాలు 500 నుండి 1500 వరకు ఉంటాయి. హెచ్ఐవి సోకిన రోగులలో వీటి శాతం గణనీయంగా 200మేరకు తగ్గుతాయి. రోగిలో రోగ నిరోధక శక్తి తగ్గి వైరస్ ఎయిడ్స్ వ్యాధిగా మారుతుంది.
హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల్లో యువకులే ఎక్కువ
భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్న వారిలో ఎక్కువ 15-48 సంవత్సరాల వారే ఉన్నారు. ప్రతి వంద మంది గర్భిణీల్లో ఒకరికి హెచ్ఐవి లక్షణాలు ఉన్ననట్లు వైద్య పరీక్షలు ధృవీకరిస్తూన్నాయి.
ఇటీవలి కాలంలో 14-24ఏండ్ల యువతీ యువకులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్య ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ''విచ్చలవిడి శృంగారం'' అని తేలింది. సహజీవనం సోషల్ స్టేటస్‌గా భావించే నవతరం డ్రగ్స్‌కు బానిసలై, నీలిచిత్రాల వీక్షణ, పోర్న్ సైట్లో అశ్లీల చిత్రాలను చూడటం, సెక్స్ పైవ్యామోహాన్ని పెంచుకొని సురక్షితం కానీ లైంగిక సంపర్కంలో పాల్గొంటూ ఈ మహమ్మారి చెరజిక్కిడం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా
ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ బారిన పడి మరణించిన వారు 21లక్షల మంది ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ వ్యాధితో భాద పడుతున్న వారు 3.30కోట్ల మంది ఉన్నట్లు, 25 లక్షల మంది కొత్తగా హెచ్ఐవి సోకిన వారు ఉన్నట్లు తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయి.
భారత దేశంలో
ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం హెచ్ఐవి బారిన పడిన రోగులు 2019 సంవత్సరంలో 23.49లక్షల మంది ఉన్నారు. అయితే ఇటీవల ఈ ఎయిడ్స్ మహమ్మారి దేశం మొత్తం మీద కొంత తగ్గుతున్న దోరిణి కనబడుతోంది. తాజా అంచనాల ప్రకారంగా వార్షిక హెచ్ఐ.వి ఇన్ఫెక్షన్స్ 2010-2019 మధ్య 37శాతానికి తగ్గాయి. దేశంలో (1)సురక్షితం కానీ లైంగిక సంపర్కం (2)సురక్షితం కానీ స్వలింగ సంపర్కం (3) సురక్షితం కానీ ఇంజక్షన్స్ (4)మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి జరుగుతోంది. హెచ్ఐవిరోగుల కొరకు ప్రత్యేక ఆసుపత్రులు లేవు. ప్రభుత్వం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం కింద(ఎన్ఐసీసీ) ఎయిడ్స్ వ్యాధి చికిత్స కోసం 2020 నాటికి 570 (ఆర్.ఎ.టి.)కేంద్రాలు, 1264 లింక్ ఆర్.ఏ.టి. కేంద్రాలు నెలకొల్పింది.
తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న హెచ్ఐవి
తెలంగాణలో 83,102 మంది రోగులు హెచ్ఐవి బారిన పడ్డారని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. హెచ్ఐవి మహమ్మారి తెలంగాణను గజగజ వణికిస్తోంది. 2017లో ఒక్క తెలంగాణలోనే నమోదైన హెచ్ఐవి కేసులు 9,324. అప్పటి నుంచి తెలంగాణ హెచ్ఐవి బాధితుల అడ్డాగా మారిందని ''రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ'' సంస్థ తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్, రెండవ స్థానంలో కరీంనగర్, మూడవ స్థానంలో నల్లగొండ ఉన్నట్లు తేలింది. జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ప్రకారం ఏపీ, తెలంగాణలో చాప కింద నీరు లాగా ఎయిడ్స్ ప్రభలుతోంది. దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగటం ఆందోళన కలిగిస్తున్నది.
విచ్చలవిడి శృంగార సంభోగాలతో ఎయిడ్స్
ప్రస్తుతం కరోనా మహమ్మారి మానవాళిని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే కరోనా మళ్ళీ విజృంభించిన విధంగా అప్రమత్తంగా ఉండక పోతే ఎయిడ్స్ మరింత విజంభిస్తోంది. విచ్చలవిడి శృంగారం వల్ల, ఒకరి కంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల వచ్చే వ్యాధి ఇది. స్త్రీ నుండి పురుషుడికి పురుషుని నుండి స్త్రీకి రావడం, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజి వల్ల కూడా ఒకరి నుండి ఒకరికి ఎయిడ్స్ వస్తుంది. సెక్స్ అందుబాటులో లేకపోతే తట్టుకోలేని తీవ్ర స్వభావమే లైంగిక వ్యసనం. లైంగిక వ్యసన పరులు సెక్స్ లేకపోతే తట్టుకోలేరు. ఓ రకమైన డిప్రెషన్‌కు గురి అవుతారు. ఎంతకైనా తెగిస్తారు. మంచి, చెడు, నైతికత, అనైతికత, పరువు, ప్రతిష్ట ఏవీ గుర్తుకు రావు. విచ్చలవిడి శృంగారానికి ఎగబడుతుంటారు. ఈ విచ్చలవిడి తనంతోనే హెచ్ఐవి వ్యాప్తి జరుగుతోంది.
హెచ్ఐవి సోకని కార్యక్రమాలు
గాలిని పీల్చడం, కౌగిలింతలు, ముద్దులు, షేక్ హ్యాండ్ ద్వారా, ఒకే ప్లేట్లో తినడం ద్వారా, ఒకే షవర్ కింద స్నానం చేయడం ద్వారా, వ్యక్తి గత వస్తువులను ఒకరివి ఒకరి పంచుకోవడం ద్వారా, ఒకే టాయ్‌లెట్ వాడడం ద్వారా, డోర్ హ్యాండిల్ ముట్టుకోవబం ద్వారా ఎయిడ్స్ రాదు. హెచ్ఐవి శరీరద్రవాల ద్వారా అంటే రక్తం, వీర్యం, తల్లి పాల ద్వారా వ్యాపిస్తుంది.
కండోమ్స్ వాడకంలో జాగ్రత్తలు
శృంగార సమయంలో కండోమ్స్ చిరిగిపోతే జారిపోయే ప్రమాదం ఉంది. వీర్యం లీక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు హెచ్ఐవి సోకుతుంది. కండోమ్స్ ధరిస్తే సరిపోదు, హెచ్ఐవి పరీక్షలు తప్పని సరి చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం హెచ్ఐవి ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవి ఉన్నట్లు తెలియదు. దాని వల్ల ఇతరులకు హెచ్ఐవి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
ఓరల్ సెక్స్
నోటి ద్వారా సెక్స్ చేయడం ఓరల్ సెక్స్ అంటారు. ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. అయితే ప్రతి 10వేల కేసుల్లో 4 కేసుల్లో మాత్రమే ఈ అవకాశం ఉంది. వారి నోటిలో ఇన్ఫెక్షన్ ఉంటే హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది.
అవగాహన అప్రమత్తతతో ఎయిడ్స్ అంతం
యువతీ యువకులు పెళ్లికి ముందు లైంగిక సంపర్కానికి దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో నమ్మకమైన దాంపత్య జీవితం గడుపాలి. ప్రస్తుతం ఎయిడ్స్ నివారణకు మందు మార్కెట్లోకి రాలేదు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు కొనసాగించవద్దు. రక్త మార్పిడి చేసేటపుడు ''ఫ్రెష్ సిరంజీలను'' వాడాలి. రక్త మార్పిడి జరిపేటపుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. స్టెరిలైస్డ్ సిరంజీలను మాత్రమే వాడాలి. ప్రభుత్వ ఆమోదిత బ్లడ్ బ్యాంకుల రక్తాన్ని వాడాలి. గర్భిణీలు విధిగా హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవాలి. సెక్స్ వ్యసన పరులకు సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలి. విచ్చలవిడి శృంగారం నుండి వారికి విముక్తి కలిగించాలి. పాఠశాల కళాశాల స్థాయిలో సెక్స్ ఎడ్యుకేషన్ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. నైతిక విలువలు, మానవీయ విలువలు కాపాడుకోవాలి. వైవాహిక వ్యవస్థ ప్రాధాన్యత పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించాలి. విద్యార్థులకు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన, చైతన్యం కలిగించడంలో ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. ''అవగాన, అప్రమత్తతే ఎయిడ్స్ నివారణకు మందు.''
- నేదునూరి కనకయ్య
9440245771