Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా, కార్యధక్షుడిగా ప్రసిద్ధిగాంచారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారు. అనారోగ్యంతో బాధపడుతూ 4 డిసెంబర్ 2021న హైదరాబాదులో కన్నుమూశారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయనొక నిబద్ధనేత. డిసెంబర్ 4న ఆయన ప్రధమ వర్థంతి సందర్భంగా అనేకులు ఈ నిబద్దతనే స్మరించుకోవం విశేషం.
కొణిజేటి రోశయ్యది మంచి వాగ్ధాటి. గొప్ప హాస్య చతురతతో పాటూ ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా పట్టు, అవగాహన ఆయన స్వంతం. వివాదాలకు దూరంగా ఉంటూ, మంచి సలహాదారుగా కూడా వ్యవహరించే వారు. రాజనీతిలో అపర చాణక్యుడు రోశయ్య. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామా. ఆయనో మాటల మాంత్రికుడు. మాటలతో చెడుగుడు ఆడుకొనే తీరు ఆయన సొంతం. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు, మాటల తూటాలు కూడా పేల్చేవారు. చట్టసభ లోపల, బయట కూడా ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని మాట తూలకుండా ఆటలాడుకునేవారు.
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు.
ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున 1968, 1974, 1980లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హౌంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా, కాంగ్రెస్‌లో అందరి కేబినెట్లలో కీలక మంత్రిగా పని చేయడం సామాన్య విషయం కాదు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించారు.
1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. 2007లో ఆంధ్ర విశ్వ విద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31 నుండి 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ప్రతిపక్షంలో ఉంటే నెగటివ్ పాలిటిక్స్ చేయొచ్చు. ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్రతో పాజిటివ్ పాలిటిక్స్ నడపవచ్చు అనేవారు. అదే ఆయన కత్తికి రెండు వైపులా పదును. రాజకీయాలనుంచీ విశ్రాంతి తీసుకున్న తరువాత మిత్రులతో గడపడం మహా వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆర్థిక, రాజకీయ సామాజిక అంశాల పుస్తకాలు చదవడం ఆయన దైనందిన కార్యక్రమం. వార్తా పత్రికలు, ప్రసార సాధనాలు ఆయనకు రాజకీయ ఊపిరి. ఆధ్యాత్మికత, సంప్రదాయం, సంస్కృతి ఆయనకిష్టం. శ్రేయోభిలాషులు నిర్వహించిన సాహితీ, సాంస్కృతిక కార్యాక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరై అలరింప జేసేవారు. సొంత జిల్లా వారుకానీ, సన్నిహితులుకానీ ఎవరు ఎప్పుడు వెళ్ళినా ఆతిథ్యం ఇచ్చి తీరికగా కులాసా కబుర్లతో కాలం గడిపేవారు.
రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా, కార్యధక్షుడిగా ప్రసిద్ధిగాంచారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారు. అనారోగ్యంతో బాధపడుతూ 4 డిసెంబర్ 2021న హైదరాబాదులో కన్నుమూశారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయనొక నిబద్ధనేత. డిసెంబర్ 4న ఆయన ప్రధమ వర్థంతి సందర్భంగా అనేకులు ఈ నిబద్దతనే స్మరించుకోవం విశేషం.
- తిరుమలగిరి సురేందర్