Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఔను... నీవు కవివే
కూలిపోతున్న జనం బతుకుల్లో జీవం నింపే
ప్రతి అక్షరం, పదం, వాక్యం
నీ సొంతమైనప్పుడు నీవు కవివే..
చలిని ఒంటినిండా కప్పుకొని
రాలిపోతున్న వయస్సు రెక్కలను
రెండు చేతులతో లెక్కగట్టుకుంట
ముడుచుకొని ఉన్న మనసులను
మేల్కోల్పుతున్నవంటే
నిన్ను... కవి అనక ఏమనాలే
నీవు మాటలను ఈటెల్ల
లక్ష్యం వైపు గురితప్పక విసురుతుంటే
గుండెలో మేకులు దిగినట్లే ఉంటది
విషయాన్ని ఇంకులో అద్ది
ముద్దెర గుద్దినట్లే ఉన్నది ఉన్నట్లు చెప్తే
నీవు కవిగాక మరేమైతవు
జంకులేనితనం బొంకడగమేరుగని నైజం
నీ నీడలా జంటగా నడుస్తుంటే
ధిక్కారం నీ తలపాగపై
జెండై ఎగురుతునప్పుడు
నిన్ను... కవి అనక ఏమనాలే
రాతల పూతలలో పేదల ఎతలను,
కష్టాలను కన్నీళ్ళను ఎత్తిరాసి...
ఎద బాధలనార్పే నిన్ను
కవి అనక ఏమనాలే...
మది అంతరంగంలో పొద్దు పొడ్సే
ఇష్టమైన రూపాన్నీ
ఎన్ని పదాలతో పలకరించావు
గోడాడే మనసు చుట్టు
అప్పటికప్పుడే అక్షరాల గోడ కట్టే నిన్ను
కవి అనక ఏమనాలే
నీవు... ఎప్పటికి కవివే
కన్నీళ్ళ చెలిమితో చలువ పందిరేసి
ఆత్మీయ ఆలింగనాలతో మురిపించే నిన్ను
కవి... అనక ఏమనాలే...
దుఃఖంలో మునిగిన కాలంనెత్తిన
కావ్యాలతో సంబురం గొడుగు పట్టిన నిన్ను
కవి అనక ఏమనాలే....
ఔను... నీవు ఈ కాలం కవివి
మా కాలపు మనసున్న కవివి..
- బోల యాదయ్య