Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాదయాత్రలు చేస్తే అధికార పీఠాన్ని ఈజీగా అధిరోహించొచ్చనే భావన కాబోలు.. ఈ మధ్య అలాంటి యాత్రల ప్రహసనం రాష్ట్రంలో జోరుగా కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు... మరోవైపు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల... ఇంకోవైపు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్... రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ పాదయాత్రల మీద పాదయాత్రలు చేస్తూ యమ హడావుడి సృష్టిస్తున్నారు. సరే.. వారి వారి పార్టీల అభివృద్ధి కోసం యాత్రలు చేసుకోవచ్చు. సభలు నిర్వహించుకోవచ్చు. అయితే బండి సంజరు ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన పాదయాత్ర అనంతరం నిర్వహించిన పబ్లిక్ మీటింగే మస్తు చర్చనీయాంశమైంది. ఆయన బహిరంగ సభ సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ఒక పేరు మాత్రం వార్తల్లోకెక్కింది. సభ వారిష్టం.. సమయం వారిష్టం.. దాన్ని ఎక్కడ, ఎలా నిర్వహించాలనేది కూడా వారిష్టమే. కాకపోతే ఆ నిర్వహించబోయే ఊరి పేరును మాత్రం మార్చే హక్కు, అధికారం వారికి ఉండదు కదా..? కానీ బీజేపీ తానిచ్చిన ప్రకటనల్లో అదే చేసినట్టు కనబడుతున్నది. ఆ యాడ్స్‌లో 'కరీంనగర్లో...' అని రాయాల్సిన చోట 'కరినగర్లో...' అని ప్రకటించారు. ఆ పేరు అదే విధంగా ప్రచురితమైంది. ఏదో ఒక పేపర్లో ఇలా వచ్చిందనుకుంటే ఓకే... కానీ అన్ని తెలుగు పత్రికల్లోనూ ఇదే రీతిలో 'కరినగర్' అనే పేరు ప్రచు రితమైంది. ఇది యాదృశ్చికమా..? లేక ఉద్దేశ పూర్వకమా..? అంటూ పాఠకులు బుర్రలు గోక్కు న్నారు ఆ రోజు... అసలే పేర్లు మార్చటమే ఓ పనిగా పెట్టుకున్నవారాయే!.
- బి.వి.యన్.పద్మరాజు.