Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి విపత్తులకు పేద, ధనిక వివక్ష లేదు. జీవుల ప్రాణులపై పక్షపాతం లేదు. గృహాలపై స్వార్థం లేదు. భూకంపాలు, వరదలు, సునామీల ప్రకోపానికి మనుషులు, జంతువులు, హరిత సంప దలు, ఆస్తుల విధ్వంసం సమానంగా ఉండవల సిందే. జాగ్రత్త పడడానికి సమయం ఇవ్వదు. భవనాలు ఊగి పోవడం, కాంక్రీట్ కుప్పల్లో ఆర్త నాదాలు, రోడ్లపై శీతల వాతా వరణంలో జనం బిక్కుబిక్కున చేరడం, ఆకాశహర్మ్యాలు నేలమట్టం కావడం, గడియారపు స్తంభాలు నేల కూలడం లాంటి బీభత్సాలు క్షణాల్లో జరిగి పోతాయి. డిజిటల్ యుగపు మనిషి దిక్కుతోచని దుస్థితిలో హాహాకారాలు చేయడం తప్ప చేయాల్సింది ఏమీ ఉండడం లేదు.
క్షణాల్లో నగరాలు నేలమట్టం
ఫిబ్రవరి 6న తెల్లవారుజామున జరిగిన భూకంప మృత్యుకేళితో టర్కీ, సిరియా నగరాలు విలవిల్లాడడం, పేకమేడల్లా బహుళ అంతస్తుల భవ నాలు నేలమట్టం కావడం, వేల కొద్ది జనులు శిథిలాల కింద పడి తుదిశ్వాస విడవడం చూస్తుండగానే జరిగి పోయింది. ప్రసార మాద్యమాల్లో వీడియోలు చూసిన ప్రపంచ ప్రజానీకం ఆందోళన చెందింది. కొద్ది గంటల్లోనే రిక్టర్ స్లేల్పై 7.8, 7.6, 6.0 పరిమాణంతో మూడు సార్లు భూమి కంపించడంతో దక్షణ-కేంద్ర టర్కీ ప్రాంతంలో గాజియన్టెక్ నగరంతో పాటు మరో 10నగరాల్లో భవనాలు (రోడ్లు, నివాస భవనాలు, కార్లు, వాహనాలు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు) పూర్తిగా నేల మట్టం కావడం లేదా పాక్షికంగా ధ్వంసం కావడంతో 2 మిలియన్ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. తొలిభూకంప విపత్తు తరువాత కనీసం 40సార్లు భూమి కంపించడంతో టర్కీ, సిరియాలు గజగజ వణికి పోతూ, ప్రజలు హాహాకారాలు చేస్తూ రోడ్ల వెంట ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని నిస్సహాయంగా పరుగులు తీశారు. గత వందేండ్లలో ఇంతటి భూకంపం రాలేదని, కనీసం 8వేల మంది చనిపోయి ఉంటారని వార్తలు వెలువడ్డాయి. కాని మరణాలు, క్షతగాత్రుల సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉండవచ్చని హృదయ విదారక దృశ్యాలు ధృవీకరిస్తున్నాయి. గాజియాన్టెక్ నగరానికి 33కి.మీ దూరంలో 18కి.మీ లోతులో భూకంప ప్రభావ కేంద్రం కనిపించడంతో గజియాన్టెక్ నగరంలోని 2,200 ఏండ్ల క్రితం నాటి రొమన్ కాలపు చారిత్రక కట్టడం కూడా పూర్తిగా ధ్వంసమైంది.
భూగర్భ ఫలకల కదలికతోనే పెనువిపత్తులు
భూకంపాలకు నెలవుగా మారిన టర్కీ ఒక్క 2000 సంవత్సరంలోనే 33,000 భూకంపాలు రికార్డు అయ్యాయని, ఇందులో రిక్టర్ స్కేల్‌పై 4.0 పరిమాణంతో 332సార్లు కంపించిందని వివరాలు తెలుపుతున్నాయి. టర్కీ దేశం భూకంపాల ముప్పు ఉన్న టెక్టోనిక్ ప్రదేశంగా గతంలోనే గుర్తించారు. భూమి అంతర్భాగంలో ఉన్న 15 ముఖ్య ఫలక పొరలను టెక్టోనిక్ ఫలకాలు(ప్లేట్స్)గా పిలుస్తారు. ఈ కదిలే స్వభావం కలిగిన ఫలక పొరల మధ్య రాపిడితో పగుళ్ళు, ఆకస్మిక కదలికలతో అపార శక్తి వెలువడడం వల్ల భూకంపాలు వస్తున్నట్లు ఆర్కియాలజీకల్ సర్వేలు వివరిస్తున్నది. యురాసియన్, ఆఫ్రికన్ ప్లేట్స్ మధ్య చీలిక ఏర్పడిన అనటోలియన్ టెక్టోనిక్ ఫలకాల్న(ప్లేట్స్) ఉన్న ప్రాంతంలో టర్కీ ఉన్నది. యురాసియన్, అనటోలియన్ టెక్టోనిక్ ఫలకాలు కలిసే ప్రదేశమైన 'నార్థ్ అనటోలియన్ ఫాల్ట్ లైన్' వద్ద భూకంప విధ్వంసం అధికంగా కనిపిస్తున్నది. ఇస్తాంబుల్ నుంచి టర్కీ వరకు గతంలో కూడా భయానక భూకంపాలు రికార్డయ్యాయి. పేదరికం రాజ్యమేలుతున్న టర్కీ, సిరియాల్లో అంతర్గత అశాంతి మంటలతో ప్రజలు అభద్రతల నడుమ బిక్కు బిక్కున బతుకులీడుస్తున్నారు. సిరియాలో అంతర్గత యుద్ధం, టర్కీలో 30లక్షలకు పైగా సిరియన్ శరణార్థులు చేరడం, భవనాలు బలహీనంగా నిర్మించడం, జనసాంద్రత ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు భూకంప నష్టాలను అనేక రెట్లు పెంచాయని నిపుణులు నిర్ధారిస్తున్నారు.
భూకంపాలు కొత్తేమీ కాదు
టర్కీ దేశంలో దాదాపు 90శాతం అధిక భూకంప సంభావ్యత కలిగిన ప్రదేశంగా (ఇస్తాంబుల్, ఇజ్మిర్, ఈస్ట్ అనటోలియాలతో కలిపి) గుర్తించబడింది. 2013-22 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 30,673 సార్లు భూమి కంపించినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. 1999లో గోల్కుక్, డస్సీ ప్రాంతాల్లో వచ్చిన భూకంపానికి (7.4, 7.0 స్కేల్) 18వేల మంది మరణించడం, 45వేలమంది గాయపడ్డారు. డిసెంబర్ 1939లో ఎర్జిన్కాన్ నగరంలో 8.0 తీవ్రత కలిగిన భూకంపం రావడంతో 20,000 మంది చనిపోవడం, 1,16,720 భవనాలు ధ్వంసం కావడం తరువాత అంతటి తీవ్రత కలిగిన భూకంపంగా నిన్నటి విపత్తు గుర్తించబడింది. ఆగస్టు 1999లో ఇజ్మిత్ ప్రాంతంలో అన్టోలియన్ ఫాల్ట్ వల్ల వచ్చిన భూకంపంలో 17వేల మరణాలతో పాటు 1,20,000 గృహాలు కుప్పకూలడం, 2.50 లక్షల జనులు నిరాశ్రయులు కావడం తెలిసిందే. 1900 సంవత్సరం తరువాత జరిగిన 76 తీవ్ర భూకంపాల్లో దాదాపు 90,000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా.
శాస్త్రజ్ఞుల హెచ్చరికలు పెడచెవిన పెట్టారా..?
ఫిబ్రవరి 3 శుక్రవారం రోజున 'ఫ్రాంక్ హూగర్‌బీడ్స్' అనబడే డచ్ పరిశోధకుడు టర్కీ, జోర్డన్, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో 7.5 రిక్టర్ స్కేల్ కలిగిన తీవ్ర భూకంపం సమీప భవిష్యత్తులో రావచ్చని ట్వీట్ రూపంలో హెచ్చరించడం నేడు చర్చనీయాంశంగా మారింది. ఈ భూ ప్రళయం తరువాత కూడా వెంటనే తిరిగి భూకంపాలు రావచ్చని, ప్రజలు ముందు జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన సలహాలు ఇవ్వడాన్ని పెడచెవిన పెట్టరాదు. ఈ భయానక, విధ్వంసకర భూ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు ఆవాసాలు కోల్పోవడం విచారకరమని ఫ్రాంక్ తెలియజేశారు. గోరుచుట్టుపై రోకలి పోటులా ఏండ్ల తరబడి అంతర్యుద్ధంతో తిరుగుబాటు దారుల అధీనంలో అతలాకుతలం అవుతున్న సిరియాకు తాజా భూ కంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపాల ముప్పు ఉన్న ప్రదేశాలుగా గుర్తించి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ తుర్కియే, సిరియాల పాలకులు కనీస ముందు జాగ్రత్తలు, నిర్మాణ సమయాల్లో ప్రకంపనలు తట్టుకునేలా చర్యలు తీసుకోక పోవ డంతో నష్టం అపారంగా కనిపిస్తున్నది. శాస్త్రజ్ఞుల హెచ్చరికలు భూకంపాలను నిరోధించనప్పటికీ ఆయా దేశాల ప్రభుత్వాలు, పౌర సమాజం గమనించి ఆ నష్టాల నుంచి బయటపడేలా సాంకేతికత తీసుకురావాలని విశ్వ మానవాళి విన్నవిస్తున్నది.
- డా|| బి మధుసూదన్‌రెడ్డి
9949700037