Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యాన వనంలో బెంచిపై
కూర్చోగానే ఎక్కడ లేని స్థిరత్వం !
వ్యర్థ ఆలోచనలు చెట్ల గాలికి
ఎటో చిరునామ లేకుండానే మరి !
నేను ఖాళీ ఖాళీ
బెంచి పై కూర్చోగానే ఎన్నెన్నో
కొత్త పాఠాలు ప్రబోధంగా మనసులో
అంటుకట్టుకున్న అంతర్ముఖత్వం
ఈ రోజు బరువంతా దించినట్లైంది
నాలాగే ఎక్కడిదో పక్షి ఎగెరివచ్చి
చెట్టు కొమ్మ మీద వాలింది
నాలాగే నెమ్మది నెమ్మదిలోకి !
పక్షి కొత్త కొత్తగా దోస్త్
నాకూ రెక్కలు వచ్చినట్లు సహవాసం కొత్తబలం
నా పాదాల వద్ద స్వర్ణ వర్ణ పండుటాకుల పై ఎన్నెన్నో
ఋతువుల అనుభవాలు
తాళపత్రం పై రాసినట్లు అక్షరాలు
అలికినట్లు లేకున్నా పసుపు రంగు
జీవితాన్ని చదివిస్తుంది
నిజంగా ఈ బెంచి పై కూర్చుంటే
ప్రాథమిక తరగతి విద్యార్థిలా ఎన్నో
పాఠాలు నేర్చుకుని కొత్త తరగతికి వెళ్లినట్లే మరి
ఎదురుగా పడమట ఆకాశంలో
సంచారి సూర్యుడు క్షణం తీరిక
లేక పనిచేసే కార్మీకుడిగా
ప్రత్యక్ష పాఠం - ఆకాశం కళాశాలే
ఈ బెంచి పై ఎవరిదో దివంగత మాతమూర్తి
పేరు చెక్కి ఉంది ు
అందుకే బెంచి తల్లి ఒడిలా
విశ్రాంతం మానసం ప్రశాంతం
ఇక ఇప్పుడైతే బెంచి వాన సొంతం
బెంచి కడిగిన అరుగులా తడితడి
నిన్న బెంచి పై ఒక భిక్షువు
గాఢ నిద్రలోకి ప్రవేశమై
రాజైనట్లు కలగన్నడేమో !
బెంచి హంసతూళికా తల్పమైంది
ఇగ ఎందుకు లేపడం
బెంచి నా జాగిరి కాదు అందరిదీ
ఈ రోజు బెంచి పై ఒక సన్యాసి
ఆచారి పీఠం వేసుకుని తిష్ట
నిజంగా జ్ఞానోదయం అయిందేమో
ఎవరిని ఆకలిగా యాచించటంలే
వనం గాలితో కడుపు పూర్ణమేమో
రోజువారిగా బెంచి పై రాస్తే
ఉద్గంథమే ఔతుంది
నిజంగా జనం బెంచి పై కూర్చుని
దులుపుకుని పోతారు ు
ఏ స్పందన ఉండదు
సిమెంటు మనసులు
ఎందుకు ఋణగ్రస్తుడను కావాలి
నేనూ ఒక కొత్త బెంచిని ప్రతిష్ఠిస్థాను
అవిశ్రాంత మనుషులకు
విశ్రాంత బెంచిలు ఎన్నైనా తక్కువే
- కందాళై రాఘవాచార్య
8790593638