Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆసిఫాబాద్
క్రీడల్లోనూ గురుకుల విద్యార్థులు రాణించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడ మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆశ్రమ పాఠశాల జోనల్ స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో వసతుల కల్పన కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల్లో గురుకులాలకు దీటుగా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎదగాలన్నారు. జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు. దీనికోసం తీవ్రమైన సాధన చేయాల్సి ఉంటుందని సూచించారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా కేంద్రంలో మరిన్ని పోటీలు నిర్వహించే అవకాశం ఉందని, దీనికి సరిపడా క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల జోనల్ స్థాయి పోటీలు జిల్లా కేంద్రంలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. జోనల్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఏటూరునాగారంలో అక్టోబర్ 18 నుండి 20 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్‌లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిటిడిఓ మణెమ్మ, జిసిడిఓ శకుంతల, ఏటీడీఓలు క్షేత్రయ్య, పురుషోత్తం, హుస్సేన్, మంచిర్యాల జిల్లా స్పోర్ట్స్ అధికారి జీవరత్నం, పెటా సెక్రటరీ కృష్ణమూర్తి, పీడీలు మధుసూదన్, మీనారెడ్డి, ధనలక్ష్మి, భవానీ, దశరథ్, కోచ్‌లు అరవింద్, సాగర్, తిరుమల్, రాకేష్ పాల్గొన్నారు.
అండర్ 17 బాలుర విభాగంలో..
కబడ్డీలో ఆసిఫాబాద్ జట్టు ప్రథమ స్థానం సంపాదించగా, మంచిర్యాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఖోఖో, వాలీబాల్ పోటీలలో ఆసిఫాబాద్ ప్రథమ స్థానం, కాగజ్‌నగర్ జట్టు ద్వితీయ స్థానం సంపాదించింది. టెన్నికాయిట్‌లో ఆసిఫాబాద్‌కు చెందిన శివకృష్ణ, ఉదరు కిరణ్ ప్రథమ స్థానం సంపాదించగా, కాగజ్‌నగర్‌కు చెందిన విజరు కుమార్, నరసింహ ద్వితీయ స్థానంలో నిలిచారు. చెస్ పోటీల్లో చిరంజీవి ప్రథమ స్థానంలో నిలవగా, ప్రసాద్ ద్వితీయ స్థానం సంపాదించారు. క్యారమ్స్ పోటీల్లో ప్రథమ స్థానం ఉదరు కిరణ్, రాజేందర్(ఆసిఫాబాద్) గెలుపొందగా, ద్వితీయ స్థానం నిశాంత్, అశోక్(కాగజ్‌నగర్) పొందారు.
అండర్ 17 బాలికల విభాగంలో..
కబడ్డీ పోటీల్లో మంచిర్యాల ప్రథమం, జైనూర్ ద్వితీయ స్థానం సంపాదించింది. ఖోఖో, వాలీబాల్ పోటీలలో జైనూర్ ప్రథమస్థానం సంపాదించగా, కాగజ్‌నగర్ ద్వితీయ స్థానం సంపాదించింది. టెన్నికాయిట్‌లో మంజుల, మాధురి(మంచిర్యాల) ప్రథమ స్థానంలో నిలువగా మమత, ఈ.మమత (కాగజ్‌నగర్) ద్వితీయ స్థానంలో నిలిచారు. చెస్‌లో హీరాబాయి(జైనూర్), జాస్మిన్(కాగజ్‌నగర్) ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. క్యారమ్స్‌లో జైనూర్ ప్రథమం, మంచిర్యాల ద్వితీయ స్థానం పొందింది.
అండర్ 14 బాలుర విభాగంలో..
కబడ్డీ, టెన్నికాయిట్ పోటీలలో ఆసిఫాబాద్ జట్టు ప్రథమ స్థానం సంపాదించగా, జైనూర్ ద్వితీయ స్థానం సంపాదించింది. ఖోఖో, వాలీబాల్ పోటీల్లో జైనూర్ ప్రథమ స్థానం సంపాదించగా, కాగజ్‌నగర్ జట్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. చెస్‌లో రోహిత్ ప్రథమ స్థానం, ఈశ్వర్ ద్వితీయ స్థానంలో నిలిచారు. క్యారమ్స్‌లో ఆసిఫాబాద్, ప్రథమ స్థానం మంచిర్యాల జట్టు ద్వితీయ స్థానం పొందింది.
అండర్ 14 బాలికల విభాగంలో..
కబడ్డీలో కాగజ్‌నగర్ ప్రథమ స్థానం, ఆసిఫాబాద్ ద్వితీయ స్థానం పొందగా, ఖోఖోలో ఆసిఫాబాద్, జైనూర్ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందాయి. వాలీబాల్‌లో కాగజ్‌నగర్ మొదటి స్థానం, మంచిర్యాల ద్వితీయ స్థానం సాధించాయి. టెన్నికాయిట్, క్యారమ్స్ పోటీల్లో జైనూర్ జట్లు ప్రథమ స్థానంలో నిలువగా, మంచిర్యాల జట్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. చెస్ పోటీల్లో అశ్విని, సంజీవిని ప్రథమ, ద్వితీయ స్థానం సంపాదించారు.