Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోచమ్మ తల్లికి అభిషేకం..భారీగా తరలివచ్చిన భక్తజనం
- సాయంత్రం గుడికి చేరిన అమ్మవారి ఆభరణాలు
- కనుల పండుగగా సాగిన శోభాయాత్ర
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్, దిలావర్పూర్ మండలాల్లో ఆదివారం అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర ఘనంగా జరిగింది. భక్తజనం తండోపతండాలుగా తరలి వచ్చారు. సాంగ్వి గ్రామంలోని గోదావరి నది నుండి అడెల్లి పోచమ్మ అమ్మవారి గుడి వరకు పాదయాత్రగా సాగిన శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగింది. గంగపుత్రులు చేతపట్టిన వలలలో పోచమ్మ తల్లి ఆభరణాలు, మరోవైపు మేళతాలాలకు శివసత్తుల పూనకాలు, భక్తుల భజనలతో శోభాయమానంగా జాతర సాగింది.
నవతెలంగాణ-దిలావర్పూర్, సారంగాపూర్
భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీర్చే మహాతల్లి అడెల్లి పోచమ్మ జాతర ప్రతీ యేట అశ్వయుజ మాసం మొదటి ఆదివారం గంగనీళ్ల జాతరను ఘనంగా నిర్వహిస్తారు. శనివారం ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరి దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి గ్రామానికి చేరుకున్నారు. రాత్రి వేళలో అక్కడి పోచమ్మ ఆలయంలో జాగరణ చేసి ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు గోదావరి నదిలో పోచమ్మ తల్లి ఆభరణాలను శుద్ది చేశారు. అనంతరం భక్తులు గోదావరి నదీ జలాలను తీసుకొని అమ్మవారి ఆభరణాలతో ఊరేగింపుగా వెళ్లారు. సాంగ్విలోని గోదావరి నది నుండి అడెల్లి పోచమ్మ ఆలయానికి వెళ్లే బాటలోని కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడేగాం, ప్యారమూర్, యాకర్‌పల్లి గ్రామాల్లో అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. సాయంకాల సమయానికి ఆలయానికి చేరుకున్న తర్వాత అమ్మవారిని ఆభరణాలతో అలంకరించారు.
పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు
జాతరలో మేళ తాళాలతో అమ్మవారి ఆభరణాల ఊరేగింపు చేశారు. ఈరగోళలతో పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు జాతరలో వైభోగ్యమానంగా కనిపించాయి. భాజా భజంత్రీల మధ్య తల్లి దీవించమ్మా..అమ్మ కాపాడమ్మా అని భక్తుల నినాదాలతో భజన పాటలు, యువకుల నృత్యాలతో జాతర కోలాహాలంగా నిర్వహించారు.
వీడీసీ తరపున ఘన స్వాగతం
దిలావర్పూర్ గ్రామానికి ఆభరణాలు చేరుకోగానే వీడీసీ సభ్యులు భాజా భాజంత్రీలతో ఘన స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఎంపీపీ పాల్దే అక్షర అనిల్, సర్పంచ్ వీరేష్ కుమార్, ఉపసర్పంచ్ సామ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ దొడ్డికింది గంగవ్వ ముత్యంరెడ్డి, రైతు సమన్వయ కమిటీ చైర్మెన్ కోడే రాజేశ్వర్, వీడీసీ సభ్యులు నామాయి సాయన్న, కుంట ముత్యం, మెట్టు రాజు, పసుల పవన్, సల్ల మహిపాల్ రెడ్డి అమ్మవారి ఆభరణాలు దర్శించుకుని స్థానిక ముత్యాలమ్మ ఆలయంలో గంగాజలాలతో పూజలు చేశారు.
ఘనంగా సాగనంపిన గంగపుత్రులు
సాంగ్వి గ్రామం నుండి వచ్చిన ఆభరణాలను దిలావర్పూర్ గ్రామంలో గంగపుత్రులు వలలను గొడుగుగా పట్టుకొని గ్రామ పొలిమేరల వరకు ఘనంగా సాగనంపారు. వలల కింద నుండి వెళ్తున్న అమ్మవారి ఆభరణాల పసుపును భక్తులు నుదుట బొట్టుగా పెట్టుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి ఆభరణాలు తరలిస్తున్న గ్రామాల గుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నిర్మల్ సీఐ వెంకటేష్, దిలావర్పూర్ ఎస్సై గంగాధర్, నర్సాపూర్ ఎస్సై పాకాల గీతా, సారంగాపూర్ ఎస్సై కృష్ణ సాగర్రెడ్డిల బందోబస్తును పర్యవేక్షించారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం
ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి దర్శనం కోసం భక్తులు వరుసకట్టారు. పక్కనే గల నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గడ్, ఒరిస్సా, రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో రెండు రోజుల పాటు ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని రాత్రి వేళలో తిరుగు ప్రయాణమయ్యారు.ఈ సందర్భంగా దిలావర్పూర్ గ్రామానికి చెందిన యువకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల దాహర్తి తీర్చేందుకు దారి పొడవునా తాగునీటి సౌకర్యం కల్పించారు.
అడెల్లిలో ఆలయ కమిటీ ఏర్పాట్లు
అడెల్లి పోచమ్మ తల్లి ఆభరణాలు ఆదివారం సాయంకాల సమయానికి ఆలయానికి చేరుకున్నాయి. ఆలయ సమీపంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చందు ఆధ్వర్యంలో వివిధ సౌకర్యాలు కల్పించారు. ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రవీందర్‌రెడ్డి, ఈఓ మహేష్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజలు అధిక సంఖ్యలో అమ్మావారిని దర్శించుకున్నారు.