Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
గాంధీజీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ఆయన జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా జైలులో గాంధీజీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో కలెక్టర్, జైళ్ల శాఖ డీఐజీ, ఎస్పీ, అధికారులు మొక్కలు నాటారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఈ కార్యకమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత రెండు మాసాల నుండి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంతో వజ్రోత్సవాలు, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు, పండుగలు, గాంధీ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఖైదీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుచున్నదని, ఖైదీలు పరివర్తన చెందడానికి పలు సంక్షేమ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జైలులో జిల్లా యంత్రాంగం నుండి నిధులు మంజూరు చేసి మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. శాంతియుతంగా పోరాడి స్వాతంత్యం సంపాదించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్, ఎస్పీ డి.ఉదరు కుమార్ రెడ్డి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి క్షమా దేశ్ పాండే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా జైలు పర్యవేక్షకులు అశోక్ కుమార్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.