Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
టీఆర్ఎస్ మహిళా మండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో ఆద్యంతం అలరించాయి. బతుకమ్మ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు ఆడి పాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఖుషి క్రియేషన్ ఆధ్వర్యంలో దర్శకుడు రాచర్ల మహేష్ బతుకమ్మ పాటను చిత్రీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కథగా మలిచి ప్రత్యేక వీడియోను రూపొందించిన సదరు కళాకారులను అభినందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కృషితో బతుకమ్మ సంబరాలను అధికారికంగా వైభవంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మలతో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ స్ఫూర్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారన్నారు. ప్రపంచ దేశాలలో నేడు బతుకమ్మ పండగను నిర్వహించుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జరుపుకునే ఏకైక పూల పండగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ సంబరాలను మహిళలు భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో గాయిని ఉలువకాని సుజాత, కెమెరామెన్ అశోక్, నృత్యకారిణి కృతిక, టిఆర్ఎస్ మహిళాఅధ్యక్షురాలు స్వరూప, ప్రధాన కార్యదర్శి బొడగం మమత, మహిళ కౌన్సిలర్ శ్రీదేవి, మహిళా నాయకురాలు కస్తాల ప్రేమల, అనసూయ, పర్వీన్, ప్రభ, రమ పాల్గొన్నారు.