Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ ఎన్నికల హామీలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : పి.ఆశయ్య, ప్రజా సంఘాల వేదిక రాష్ట్ర నాయకుడు
నవతెలంగాణ- మంచిర్యాల
ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో పేదలు శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య మాట్లాడారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేని నిరుపేదలందరికీ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్నారు. నిర్మించిన కొద్దిపాటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సైతం పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం వల్ల నాసిరకం నిర్మాణంతో ఇండ్లు కూలే దశకు చేరుకుంటున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ పంపిణీలో జాప్యం జరిగితే తెలంగాణ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో పేదలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలు స్వాధీనం చేసుకొని నివాసం ఉంటున్న ప్రభుత్వ భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని, వరద ముంపులో సర్వం కోల్పోయిన నిరుపేదలకు వెంటనే నష్టం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను వెంటనే తగ్గించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వాలు నెరవేర్చాలని, లేదంటే రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్, చేతివృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి బోడేంకి చందు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, రవి, రజిత, శ్యామల, మమత పలువురు పేదలు పాల్గొన్నారు.