Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే అనుమతి నిరాకరించిన ఎన్ఎంసీ
- అడ్మిషన్ల విషయంలో అయోమయం
- వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం : ఎమ్మెల్యే దివాకర్‌రావు
నవతెలంగాణ-మంచిర్యాల
జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఆవిరైపోతున్నాయా? ఎన్నో ఆశల మధ్య మంజూరైన మెడికల్ కళాశాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైందా? కళాశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికార యంత్రాంగం చేసిన ప్రకటనలు ఉత్తి మాటేనా? అంటే అవుననే చెప్పక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఎనిమిది మెడికల్ కళాశాలలో కేవలం మంచిర్యాల మెడికల్ కళాశాలకు మాత్రమే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుండి అనుమతి రానట్లు విశ్వసనీయ సమాచారం. కళాశాలలో అడ్మిషన్లకు సమయం దగ్గర పడటంతో చివరిసారిగా కళాశాల అనుమతి ధ్రువీకరణ విషయమై ఎన్ఎంసి అధికారుల బృందం మంచిర్యాల మెడికల్ కళాశాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ గోదాములకు మరమ్మతులు చేసి రేకుల షెడ్డులో కళాశాల నిర్వహణ విషయమై కేంద్ర బృందం ఇక్కడి కళాశాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వు లేఖను అందజేసినట్లు తెలిసింది. రేకుల షెడ్లలో మెడికల్ కళాశాల ఏ విధంగా ఏర్పాటు చేశారని కళాశాల అధికారుల బృందంపై ఎన్ఎంసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మంచిర్యాలతో పాటు జగిత్యాల, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, రామగుండం(పెద్దపల్లి) జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరైన విషయం తెలిసిందే. వీటిలో కేవలం మంచిర్యాలకు మాత్రమే అనుమతి రాకపోవడం పట్ల విద్యార్థి లోకంతో పాటు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పాలకవర్గం తీరును విమర్శిస్తున్నాయి. కళాశాల మంజూరు పట్ల సంబరాలు జరిపిన అధికార పార్టీ నాయకులు అనుమతి నిరాకరణ విషయమై మిన్నకుండిపోయారు.
అడ్మిషన్ల విషయంలో అయోమయం
మంచిర్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఈ సంవత్సరం అడ్మిషన్ల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నో ఆశల మధ్య మంజూరైన కళాశాల ఏర్పాటు కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు మంచిర్యాల కాలేజీ రోడ్‌లోని మార్కెట్ కమిటీ ప్రాంతంలోని గోదాములకు మరమ్మత్తులు చేసి తాత్కాలిక కళాశాల ఏర్పాటు కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శాశ్వత భవనం నిర్మాణం జరిగే వరకు ఇక్కడే మెడికల్ కళాశాల నిర్వహణకు తరగతి గదులు, ల్యాబ్, రోగులకు సంబంధించిన పడకలు ఆధునిక పద్ధతులలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే కళాశాలకు సంబంధించి తరగతులు నిర్వహించే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం టెండర్లు కూడా పూర్తి చేశారు.
తరగతుల నిర్వహణకు కృషి చేస్తున్నాం : ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
మెడికల్ కళాశాలలో ఈ సంవత్సరం నుండే అడ్మిషన్లు జరిగే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లాం. త్వరలోనే అన్ని అనుమతులతో మెడికల్ కళాశాల ప్రారంభమవుతుంది. కళాశాల తరలింపు అనేది అవాస్తవం. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు.