Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్‌రూరల్
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం చాంద (టి) గ్రామ సమీపంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన పదార్థాలను కిచన్ గదిలోకి వెళ్లి పరిశీలించారు. విద్యార్థుల చదువు, భోజన విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం, శుద్ధమైన తాగునీరు అందించాలని వార్డెన్లను ఆదేశించారు. వసతి గృహాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త చెదారం కనపడకుండా స్థానిక పారిశుధ్య సిబ్బంది ద్వారా శుభ్రం చేయించుకోవాలని సూచించారు. అనంతరం స్టోర్ రూమ్‌లోని బియ్యం, పప్పులు, గుడ్లు, కూరగాయలు, తదితర సామానులను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లోని సరుకులను నేలమీద కాకుండా బెంచీల మీద ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే అన్నంలో ఎలాంటి పురుగులు రాకుండా బియ్యంను శుభ్రం చేయాలని అన్నారు. విద్యార్థులకు వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంక్షేమ అధికారులు వారి పరిధిలోని వసతి గృహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, విద్యార్థులు అనారోగ్య బారిన పడినపుడు వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్లి చికిత్సలు ఇప్పించాలని అన్నారు. స్టోర్ రూమ్‌లోని కాలం చెల్లిన సరుకులను ఆయా ఏజన్సీలకు తిరిగి అప్పగించాలని అన్నారు. మరుగుదొడ్లను, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అన్నారు. ఆయా పాఠశాలలో వండిన అన్నం, పప్పు, గుడ్లు, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు భోజనం అందించే ముందు ఫుడ్ కమిటీ బోజనాలను రుచి చూడాలని, ఆ రోజున భోజనం రుచి చూసిన వారి పేర్లను రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. విద్యార్ధులు దసరా సెలవుల సందర్భంగా వారి ఇండ్లకు వెళ్లి తిరిగి పాఠశాల ప్రారంభం రోజున హాజరయ్యే విధంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పోషకులకు తెలియజేయాలని అన్నారు. సంక్షేమ వసతి గృహాలలో అధికారులు పర్యటించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం, సౌకర్యాలను పరిశీలించాలని అన్నారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి సునీత కుమారి, మైనారిటీ సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్లు, వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.