Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ఆడపడుచులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పండగ సారే బతుకమ్మ చీర అని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని మోతుగూడలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ అయిన బతుకమ్మకు ఆడపడుచులకు సారే అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చీరల పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చారని అన్నారు. పండగ ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపాలని కోరారు. తెలంగాణ సంస్కృతి పరిడవిల్లేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడానికి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చిన్న చూపు చూసిన తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మను రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యావత్ ప్రపంచం గర్వించేలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ పండుగ పూట సారే అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేష్, ఎంపీడీఓ శశికళ, ఎంపీవో ప్రసాద్, ఎంపీటీసీ రమేష్, సర్పంచ్ వినోద్, నాయకులు సలాం పాల్గొన్నారు.