Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-తాండూర్
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆమె శుక్రవారం నియోజకవర్గంలోని తాండూర్, కాసిపేట, బెల్లంపల్లి మండలాల్లో నూతనంగా రూ.7కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకుగాను ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు రూపకల్పన అత్యున్నత సౌకర్యాల కోసం మన ఊరు మన బడి ద్వారా ఏడు వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా బెల్లంపల్లి నియోజకవర్గానికి 6వేల కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. బెల్లంపల్లిలో ఇంజనీరింగ్ కళాశాల, తాండూర్లో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం ఎమ్మెల్యే చిన్నయ్య కోరిక మేరకు సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో బోధన సిబ్బంది సక్రమమైన రీతిలో విద్యాబోధన చేస్తూ అత్యున్నత ఫలితాలు రాబట్టాలని ఆమె కోరారు. కస్తూరిబా గురుకుల పాఠశాలల్లో పేద ఆడపిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా కృషి చేస్తున్నామన్నారు. బతుకమ్మ ఉత్సవాలను సంతోషాల మధ్య జరుపుకోవాలని ఆమె కోరారు. తెలంగాణలో పచ్చదనం, ప్రశాంతతను ఓర్వలేని బిజెపి కుల మతాల మధ్య చిచ్చుపెడుతోందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి పేద ప్రజల దుర్భరమైన జీవితం గడుపుతుంటే పట్టించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ల కొమ్ము కాస్తోందన్నారు.