Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత గూడు లేక అద్దె చెల్లించలేక అవస్థలు
- ఆర్థికంగా చితికిపోతున్న పట్టణ పేదలు
- నిర్మించి వృథాగా వదిలేసిన అధికారులు
- ఇండ్ల పంపిణీపై లబ్దిదారుల ఎదురుచూపులు
ఏండ్లుగా అదే ఇంటిలో నివాసముంటున్నారు.. కానీ అది వారి సొంత ఇల్లు కాదు.. సొంతంగా ఇల్లు కడుదామంటే ఆర్థిక స్థోమత సరిపోదు. ప్రభుత్వమే కరుణించి ఇల్లు మంజూరుచేస్తే సరి..లేదంటే ఎన్నేండ్లయినా అద్దె చెల్లిస్తూ అవస్థలు పడటం తప్పని పరిస్థితి. పట్టణాలే జీవనాధారంగా బతుకుతున్న అనేక మంది చిరువ్యాపారులు, రోజువారీ కూలీలు, తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న నిరుపేదల దీనస్థితి ఇది. ఇలాంటి వారికి అండగా ఉండాలనే ఉదేశ్యంతో ప్రభుత్వం డబుల్ బెడ్ రూంలను నిర్మించింది. కానీ అవి పేదల దరికి చేరకుండా అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. నిధుల లేమి..కాంట్రాక్టర్ల అయిష్టత కారణంగా మంజూరైన వాటిలోనూ అనేకం నిర్మాణాలకు నోచుకోవడం లేదు. కాగా నిర్మించిన వాటిని సైతం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదు. ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడంతో రూ.కోట్లు వెచ్చించిన నిర్మాణాలు వృధాగా మారుతున్నాయి. ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అనేక మంది లబ్దిదారులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పట్లో వారి ఆశలు నెరవేరడం కష్టమనే భావన కనిపిస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ గూడు లేని నిరుపేదలు అనేకం. సొంత జాగాలేని వారూ కొకొల్లలు. వీరంతా ప్రభుత్వ సాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూంలకు ప్రాధాన్యం పెరిగింది. అర్హులైన నిరుపేదలందరికీ రెండు పడక గదుల ఇండ్లను కేటాయిస్తామని ప్రభుత్వం కొన్నేండ్ల కిందట హామీనివ్వడంతో అనేక మంది లబ్దిదారులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ భావించినట్లుగానే ఆయా జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటి నిర్మాణాలను చేపట్టింది. ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఒకే ప్రాంగణంలో వీటి నిర్మాణాలను చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో 3559ఇండ్లు మంజూరు కాగా 3271ఇండ్లకే టెండర్లు పిలువగా..2070ఇండ్లకు మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి. ఇందులో కేవలం 596ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇలా నిర్మల్, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లోనూ డబుల్ బెడ్ రూంల నిర్మాణాలు చేపట్టారు. లబ్దిదారుల ఎంపిక మాత్రం పూర్తికావడం లేదు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిర్మాణాలు పునాదుల దశను దాటడం లేదు. వీటితో పాటు కొన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో చేపట్టిన వాటిలోనూ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు వృథాగా వదిలేశారు.
అద్దె చెల్లించలేక అవస్థలు
ఉమ్మడి నాలుగు జిల్లా కేంద్రాల్లో అనేక మంది నిరుపేదలు తాత్కాలిక గుడిసెలు వేసుకోవడంతో పాటు తడకలతో ఇంటి నిర్మాణాలు చేపట్టి నివాసం ఉంటున్నారు. శివారు కాలనీల్లో అనేకం ఇలాంటి ఇండ్లే కనిపిస్తుంటాయి. వీటితో పాటు అనేక మంది చిరువ్యాపారులు సైతం నెలనెలా అద్దె చెల్లిస్తూ ఏండ్ల నుంచి జీవనం సాగిస్తున్నారు. వివిధ రకాల పనులు పనులు చేసుకుంటూ పట్టణం మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి వారికి ఇండ్లు కేటాయిస్తామని ప్రభుత్వం, అధికారులు హామీనివ్వడంతో అనేక మంది భరోసా పెట్టుకున్నారు. ఇటీవల ఆదిలాబాద్లో లబ్దిదారుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. మంచిర్యాలలోనూ లాటరీ నిర్వహించినా లబ్దిదారులకు పంపిణీ చేయడం లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేండ్లు కావస్తున్నా ఇండ్ల పంపిణీ లేకపోవడంతో లబ్దిదారుల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. వచ్చే అరకొర వేతనంతో ఏండ్ల నుంచి నెలనెల అద్దె చెల్లించలేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.
కేటాయింపులో అలసత్వం..!
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మంజూరైన వాటిని పక్కనపెడితే.. నిర్మాణం పూర్తయినవి కూడా ఉన్నాయి. పలు చోట్ల వీటికి రంగులు వేసి అందంగా ముస్తాబుచేశారు. పూర్తయి ఏండ్లు గడుస్తున్నా లబ్దిదారులకు మాత్రం పంపిణీ చేయడం లేదు. లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం..నిర్మాణం పూర్తనవి తక్కువగా ఉండటంతోనే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయనే ఉదేశ్యంతోనే పంపిణీని పక్కన పెట్టేశారనే ఆరోపణలున్నాయి. లబ్దిదారుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉదేశ్యంతోనే ప్రజాప్రతినిధులు సైతం వీటి జోలికి వెళ్లడంలేదనే తెలుస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కాలయాపన చేయడం మూలంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుపేద లబ్దిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
డబుల్బెడ్రూం అందజేయాలి : పాలెపు భూమన్న, ఆదిలాబాద్
గత 20ఏండ్ల నుంచి ఆదిలాబాద్ పట్టణంలో నివాసముంటున్నాం. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దెకు ఉంటున్నాం. ప్రభుత్వం మాలాంటి పేదలను గుర్తించి డబుల్ బెడ్రూంలు అందజేసి ఆదుకోవాలని కోరుతున్నాం.