Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ సంబరాలకు సిద్ధమైన మహిళలు
- తొమ్మిది రోజుల పాటు తీరొక్క నైవేద్యాలు
- తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు తెచ్చిన పండుగ
నవతెలంగాణ- ఆసిఫాబాద్
బతుకమ్మపండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.బతుకమ్మ పండుగ విశిష్టత సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైనది. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజుల పాటు సంబరాలు, కోలాహలంతో సందడి నెలకొంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కతిక ప్రతీక పండుగ.
తీరొక్క పూలతో బతుకమ్మలు
రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చివరి రోజున హట్టహాసంగా నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మ
మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ
ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నాన బియ్యం బతుకమ్మ
నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ
అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ
ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ
బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ
నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ
ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహౌర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
సద్దుల బతుకమ్మ ప్రత్యేకమైనది
చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాడుతారు.
తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు తెచ్చిన పండుగ
ప్రపంచంలో ఎక్కడ కూడా పూలకు పూజ చేయడం కనిపించదు తెలంగాణ సంస్కతి లో బతుకమ్మ పండుగ గొప్ప విశేషం అని చెప్పవచ్చు. ఇదే కాకుండా బతుకమ్మ పండుగలో పాడే పాటలు తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి తెలపడంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దశ దిశల వ్యాప్తి చేయడానికి పండుగ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పండగ బతుకమ్మ పండుగ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.