Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
- వివిధ విభాగాల పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా పాలనలో ప్రముఖ పాత్ర పోషించాల్సిన ఐఏఎస్ అధికారులకు శిక్షణలో భాగంగా తలపెట్టిన క్షేత్రస్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తమ శిక్షణలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆరుగురు శిక్షణ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయితో కలిసి ప్రముఖ విభాగాలైన 10విభాగాల జిల్లా అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విభాగాల పనితీరుపై చేయాల్సిన మార్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో తనదైన ముద్ర చూపించాలంటే తప్పనిసరిగా శిక్షణలో ఐఏఎస్ అధికారులు అనేక అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. కుమురం భీం జిల్లా లాంటి జిల్లాలో ఎన్నో కొత్త అంశాలు తెలుస్తాయని ప్రజల అవసరాలు, చేయాల్సిన పనులు, కండ్లకు కట్టినట్టు కనబడతాయని అన్నారు. వీటిని నిజజీవితంలో వర్తింపచేయాలని సూచించారు. దీనికిగాను ప్రతి జిల్లాలో ముఖ్యమైన విభాగాలు 43 ఉంటాయని దానిలో అతి ముఖ్య విభాగాలు పాలనలో ప్రభావం చూపించేవి 10 ఉంటాయన్నారు. జిల్లాలో విద్యా, వైద్యం, స్త్రీ, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గిరిజన అభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖలు ప్రధానమైనవిగా ఉంటాయని అన్నారు. ఆయా శాఖలో జిల్లాలో చేస్తున్న అభివృద్ధిని, మార్పును ఐఏఎస్ అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా శిక్షణ ఐఏఎస్ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు జిల్లా అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశుసంక్షేమ శాఖాధికారిని సావిత్రి, జిల్లా విద్యాధికారి అశోక్, వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శ్రీనివాస్, కుటుంబరావు, రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిని మణెమ్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.