Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
స్త్రీ నిధి రుణాలను రికవరీ చేసి మొండి బకాయిలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ నిధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీ నిధి ద్వారా 1162 మహిళా సంఘాలకు రూ.96కోట్ల రుణాలు అందించడం జరిగిందని, ఆయా రుణాల రికవరీ 11.83 శాతం చేయాల్సి ఉందని అన్నారు. అక్టోబర్ 31 నాటికి మొండి బకాయిలు 10 కోట్ల రూపాయలు రికవరీ చేయాలన్నారు. రుణగ్రస్తుల నుండి రికవరీ చేసి స్త్రీ నిధి ఖాతాకు చెల్లించని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా ఏపీఎంలు రికవరీ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకొని నిర్ణీత గడువులోగా చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మొండి బకాయిలతో పాటు, రెగ్యులర్ వాయిదాలను రికవరీ చేయాలని ఆదేశించారు. బ్యాంకు లింకేజీ రుణాలు అక్టోబర్ 20 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ రుణ గ్రస్తుల నుండి బకాయి పడిన వాయిదాలను రికవరీ చేయాలని, మొండి బకాయిలు చెల్లించని వారి నుండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. చెల్లించని వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వచ్చే నెల చివరి నాటికి మొండి బకాయిల శాతం తగ్గించాలని అన్నారు. పట్టణ పరిధిలో మొండి బకాయిల విషయంలో ఆర్పీలపై చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు మొండి బకాయిల శాతం ఎక్కువగా ఉన్న మండలాల ఎపిఎంలు, సీసీలతో సమీక్షించారు. స్త్రీ నిధి జోనల్ మేనేజర్ అనంత కిషోర్ మాట్లాడుతూ యూనిట్ల స్థాపనకు స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించడం జరుగుతోందన్నారు. స్త్రీ నిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా తిరిగి ఎక్కువ మొత్తంలో రుణాలు పొందవచ్చని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, స్త్రీ నిధి రీజినల్ మేనేజర్ పూర్ణచందర్, ఏపీడీలు, ఏపీఎంలు, సీసీలు, స్త్రీనిధి, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పూర్తయిన పనుల ఫొటోలు పంపాలి
మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టి పూర్తైన పనులకు సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 37 పాఠశాలల్లో పూర్తయిన పనులకు సంబంధించిన ఫొటోలను వెబ్సైట్లో పూర్తి వివరాలతో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు దివ్యాంగుల కొరకు ర్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులు, వరండాలలో ప్రభుత్వం నిర్దేశించిన రంగులను వేయడానికి గుర్తించాలని, అందుకు నమూనా కలర్లను వేసి చూపించాలని ఏజెన్సీలకు సూచించారు. ఈ కార్యక్రమం కింద పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఆర్డీఓ కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, సెక్టోరల్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.