Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్లో భారీ కుంభకోణం
- తప్పుడు రికార్డులతో రూ.2కోట్లకు పైగా స్వాహా
- రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో వెలుగులోకి
- ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
- అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో విస్తృత తనిఖీలు
నవతెలంగాణ-కాగజ్‌నగర్
కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులు ఈ అవినీతి భాగోతానికి తెర తీశారు. రైస్ మిల్లు నుండి బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్‌కు సరఫరా కాకున్నా సరఫరా జరిగినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఏకంగా రూ.2కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేశారు. ఇది రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి తనిఖీ చేసే వరకు కూడా బయటకు రాకపోవడం గమనార్హం. వారం రోజుల క్రితం హైదరాబాద్ నుండి వచ్చిన రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్లో తనిఖీలు చేపట్టింది. రికార్డులు సక్రమంగా లేకపోవడం, రికార్డులకు తగ్గట్లుగా బియ్యం నిల్వలు లేకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దీనిపై 24 గంటల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులు సత్వరమే విచారణ చేపట్టగా 8,400 క్వింటాళ్ల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్లో తక్కువగా ఉన్నట్లు తేలింది. వాస్తవానికి ఈ బియ్యం రైస్ మిల్లు నుండి ఎంఎల్ఎస్ పాయింట్‌కే సరఫరా కాలేదని విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. దీంతో వెంటనే ఉన్నతాధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి గోపినాథ్‌ను సస్పెండ్ చేశారు.
ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత?
ఈ భారీ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత అనే విషయంలో జోరుగా చర్చ సాగుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిని బాధ్యుడిని చేసి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు దీని వెనుక అసలైన సూత్రదారులు ఎవరనే విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరముంది. జిల్లాలోని రైస్ మిల్లుల నుండి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా చేస్తారు. ప్రతి రైస్ మిల్లు నుండి ఎంత మేర బియ్యం సరఫరా చేయాలనేది ముందుగానే నిర్దేశిస్తారు. ఆ నిర్దేశం మేరకు ఆయా రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన ఎంఎల్ఎస్ పాయింట్లకు నేరుగా బియ్యం సరఫరా చేస్తారు. ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిర్పూర్(టి) మండలంలో ఉన్న ఒక రైస్ మిల్లు నుండి బియ్యం సరఫరా జరుగుతోంది. ఈ రైస్ మిల్లు నుండే బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్‌కు సరఫరా చేయకపోయినా, సరఫరా చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. ఈ రికార్డులను జిల్లా పౌరసరఫరాల అధికారి, జాయింట్ కలెక్టర్లు వెరిఫై చేసిన తర్వాతే సదరు రైస్ మిల్లు యజమానికి బిల్లు చెల్లింపు జరుగుతుంది. లెక్కల్లో లేని 8,400 క్వింటాళ్లకు సంబంధించిన బియ్యం బిల్లులు రూ.2కోట్లకు పైగా అధికారులు ఇప్పటికే చెల్లించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు కూడా తనిఖీలు చేపట్టకుండా బిల్లుల చెల్లింపు ఎలా చేశారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. తప్పుడు రికార్డులు సృష్టించి బిల్లు కాజేయడంలో రైస్ మిల్లు యజమాని పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్‌కు సరఫరా అయ్యే బియ్యం, రైస్ మిల్లర్లకు చెల్లించిన బిల్లుల వివరాలను అందజేయాలని గతేడాది డిసెంబర్ నుండి ఇప్పటి వరకు జాగృతి యువమంచ్ వ్యవస్థాపకులు ఎండి అష్రఫ్ మూడు సార్లు దరఖాస్తు చేశారు. అయినా సమాచారం ఇవ్వలేదు. నాలుగు సార్లు జిల్లా కలెక్టర్‌కు కూడా అప్పీలు చేసుకున్నారు. అయినా దీనిపై ఎలాంటి విచారణ జరపకపోవడం పట్ల సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అన్ని పాయింట్లలో విస్తృత తనిఖీలు
ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ ఉదంతంతో నిద్ర నుండి మేల్కొన్న అధికారులు జిల్లాలోని ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లలో విస్తృత తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా మండలాల తహసీల్దార్లను విచారణాధికారులుగా నియమిస్తూ ఈ నెల 27న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్లో రెబ్బెన తహసీల్దార్, జైనూర్ ఎంఎల్ఎస్ పాయింట్లో సిర్పూర్(యు) తహసీల్దార్, కాగజ్‌నగర్ ఎంఎల్ఎస్ పాయింట్లో ఆసిఫాబాద్ తహసీల్దార్, సిర్పూర్(టి) ఎంఎల్ఎస్ పాయింట్లో కాగజ్‌నగర్ తహసీల్దార్, బెజ్జూరు ఎంఎల్ఎస్ పాయింట్లో చింతలమానెపల్లి తహసీల్దార్లు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు తనిఖీ చేశారు. బియ్యం నిల్వలను పరిశీలించారు.
ఎంఎల్ఎస్. పాయింట్ ఇన్చార్జి గోపీనాథ్ సస్పెండ్
ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డ ఎం.గోపీనాథ్‌ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న రెబ్బెన తహసీల్దార్‌తో సహా పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలో ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం నిల్వల్లో తేడా అధికంగా ఉండడంతో సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బియ్యం కుంభకోణం వాస్తవమే : ఆర్.రాజేశం, జాయింట్ కలెక్టర్
ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన బియ్యం కుంభకోణంలో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిని సస్పెండ్ చేశాం. రికార్డుల తనిఖీలో 8,400 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం.