Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్ సంభాషణలో జేపీఎస్‌లు
- 173 జేపీఎస్‌లు, 33 ఓపిఎస్లు విధుల్లోకి గడువుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
హలో మిత్రమా.. నెక్స్ట్ ఏం చేద్దాం..? ఉద్యమమా.. ఉద్యోగమా అంటూ జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు వివిధ జిల్లాలలో విధులు నిర్వహిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో ఫోన్ చేసి మాటల్లో అలా మునిగిపోయారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న జేపీఎస్్, ఓపీఎస్లు శనివారం మధ్యాహ్నం 12 గంటలలోగా ఉద్యోగాలలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలను జారీ చేశారు. విధుల్లో హాజరు కాని వారి స్థానంలో తాత్కాలికంగా 15 వేల నెల వేతనంతో కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా మధ్యాహ్నం వరకే గడువును విధించిన ప్రభుత్వం మరోసారి సాయంత్రం వరకు గడువును పొడిగించింది. విధులకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే నల్లగొండ జిల్లాలో జెపిఎస్‌లు 648 మంది ఉండగా 173 మంది విధుల్లో చేరారు. ఓపీఎస్లు 82 మంది ఉండగా 33 మంది విధుల్లో చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. నెక్స్ట్ ఏం చేయాలా అని విధుల్లో చేరని పంచాయతీ కార్యదర్శులు సమాలోచనలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జేపీఎస్‌లపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. కాగా సాయంత్రం 5 గంటల వరకే గడువును విధించిన ప్రభుత్వం గడువు ముగిసిపోయినప్పటికీ ఎలాంటి ఆదేశాలు మాత్రం జారీ చేయలేదని సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు.