Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్ణాటక ఫలితాలు అందుకు సంకేతం
- తొమ్మిది రాష్ట్రాలలో అనైతికకంగా ప్రభుత్వాల ఏర్పాటు
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చిట్యాల
ప్రధాని మోడీ పాలన పై తిరుగుబాటు మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంత్రి జగదీష్‌రెడ్డి స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యతో కలసి విలేకరులతో మాట్లాడారు. మోడీ పాలన పై తిరుగుబాటు మొదలైందనడానికి కన్నడ నాట ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనంగా మారిందన్నారు. అసలు తిరుగుబాటు ఎట్లా ఉంటుందో అన్న రుచిని కర్ణాటక ప్రజలు ఈ ఎన్నికల్లో మోడీకి చూపించారని తెలిపారు. తొమ్మిది రాష్ట్రలలో అనైతికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర మోడీదని విమర్శించారు. ప్రజల తీర్పును ఖాతరు చెయ్యకుండా అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన దుర్మార్గం బీజేపీదని ఆయన మండిపడ్డారు. అందుకే కన్నడ నాట ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు యావత్ భారతావని సన్నద్ధం అవుతున్నారని హెచ్చరించారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు స్థితికి చేరుకుందన్నారు. ప్రజలు అధికారాన్ని అప్పగించినా నిలబెట్టుకోలేని దుస్థితికీ కాంగ్రెస్ పార్టీ చేరుకుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీటీసీ సుంకర ధనమ్మ యాదగిరిగౌడ్, మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొలను వెంకటేశంగౌడ్, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.