Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత ధరలకే లిక్కర్ అమ్మకం
- అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు
- స్టాక్ ఉన్నంత వరకు విక్రయాలు
నవతెలంగాణ-నల్లగొండ
మద్యం ప్రియుల ఆశలు అడియాసలే అయ్యాయి. ప్రభుత్వం తగ్గించిన ధరలు ఇంకా అమలుకు నోచుకోలేదు. పాత స్టాకు ఉన్నంత వరకు బాటిల్‌పై ఉన్న ధరల లేబుల్ ప్రకారమే అమ్మకాలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కావటంతో మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తం లో స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. అది అమ్ముడుపోతేనే కొత్త స్టాకు వచ్చేది. అప్పటి వరకు పాత స్టాకుపై ఉన్న ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోందని మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించినప్పటికీ షాపుల్లో పాత ధరలకే అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు వర్షాలతో బీర్లకు డిమాండ్ తగ్గటంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మద్యం ధరలు తగ్గించిన ప్రభుత్వం
ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి వచ్చే ఆదాయం పైన ఆధార పడుతోంది. నల్లగొండ జిల్లాలో ఎక్సైజ్ పరిధిలో 137 వైన్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వం గతంలో భారీగా మద్యం ధరలు పెంచటంతో అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పడిపోతుండటంతో ప్రభుత్వం మే 5న మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఫుల్ బాటిల్‌పె రూ.40, హాఫ్ బాటిల్‌పె రూ.20, క్వార్టర్ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలను తగ్గించారు. అన్నిరకాల బ్రాండ్లపై ఇదే పద్ధతిలో రేట్లు తగ్గాయి. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పాత ధరలకే షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో షాపుల వద్ద తగ్గిన ధరలకు అమ్మకాలు చేయటం లేదని మద్యం ప్రియులు వాగ్వావాదానికి దిగుతున్నారు. ప్రభుత్వం ధరలు తగ్గించినామద్యం వ్యాపారులు పాత ధరలే వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్లు కూడా వెళ్లుతున్నాయి. ధరలపై సర్దిచెప్పలేక మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.
స్టాక్ ఉన్నంత వరకు పాత ధరలే...
మద్యం వ్యాపారులు నెలకు సరిపడా సరుకుకు ఒకేసారి ఆర్డర్ ఇస్తారు. ఏప్రిల్ 30వ తేదీనే మే నెలకు కావాల్సిన మద్యం కోసం డీడీలు చెల్లించారు. అయితే ప్రభుత్వం మే 5న మద్యం ధరలు తగ్గించింది. అప్పటికే నెలకు కావాల్సిన మద్యం పాత ధరల లేబిల్‌తో ఆయా ప్రాంతాల్లోని గోదాంలోకి చేరింది. పాత ధర ప్రకారమే వ్యాపారులు ప్రభుత్వానికి డీడీలు చెల్లించారు. తమకు వచ్చిన మద్యం పూర్తిగా అమ్మిన తర్వాతే కొత్త మద్యం
కోసం డీడీలు తీయ నున్నారు. జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల మద్యం స్టాకు ఉన్నట్లు అంచనా. దీంతో దాదాపుగా ఈ
నెలఖారు వరకు పాత స్టాకే విక్రయించనున్నారు. మద్యం సీసాలపై తగ్గిన ధరల కోసం రెండు వారాలు మద్యం ప్రియులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.వేసవిలో లిక్కర్ కంటే బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి బీర్ల విక్రయాలకు వర్షాలు బ్రేక్ వేశాయి. గతేడాది ఏప్రిల్‌లో 5,80,668 బీర్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3,95,328 బీరులను మాత్రమే విక్రయించారు. గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది 1,85,340 బీర్ల అమ్మకాలు తగ్గాయి. మే లో కూడా ఇప్పటి వరకు 2లక్షల వరకు బీర్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కురిసిన భారీ వర్షాలకు వాతావరణం చల్లబడటం బీర్ల అమ్మకాలపై ప్రభావం చూపినట్టు వ్యాపారులు భావిస్తున్నారు. మద్యం సీసాలపై ధరలను తగ్గించిన ప్రభుత్వం బీర్లపై మాత్రం పైసా కూడా తగ్గించలేదు. మద్యం కంటే బీర్లపైన అధిక ధరలు ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు మద్యం ప్రియులు ఆసక్తి చూపడం లేదనే చర్చ వినిపిస్తోంది.