Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ వదిలిన జ్ఞాపకం నేనైతే
అమ్మ రూపం మా పిన్నమ్మ
కొత్త పెళ్ళి కూతురిగా అడుగుపెట్టిన ఆమెను
నేనూ, తమ్ముడు అమ్మగా ప్రమోట్ చేసేశాం
సంసారపు సరిగమలు నేర్వక ముందే
దిగులు పరదాలో దాగిన మమ్మల్ని
ఆర్థ్రంగా ఒడి చేర్చుకున్న మానవీయ పతాకం
త్యాగమే స్వయంగా చెక్కిన శిల్పం
మోడువారిన చెట్టుకు
ఆశల చిగుళ్లు తొడిగి
అష్టకష్టాలను ఇష్టంగా భరించిన ధాత్రి
ఒకప్పుడు తెలుగు సినిమాలోని
సూర్యకాంతంల, ఛాయాదేవిలంతగా కాకపోయినా
నా కళ్లకు తాను విలన్ లాగానే కనపడేది
ఊహ తెలిసాక నా కళ్లకు పట్టిన పొరలు
ఒక్కటొక్కటిగా తొలిగిపోతుంటే
ఆమె నిలువెల్లా అమ్మతనం అల్లుకున్న
పొదరిల్లు లా కనిపించింది
మానవీయ పరిమళాలు వెదజల్లే మల్లె పందిరే అయింది
ఏనాడూ పరాయి అనిపించని పసిపాప
ఆమే లేకపోతే
తాడు తెగిన బొక్కెనలమే
నూతి అడుగున ఏ పాతాళాగిరక వేసినా
కానరాని లోకాలకు అంకితమయ్యేవాళ్ళం
ఎవరికి వారుగా గిరి గీసుకునే
ఇప్పటి మనిషి కాదామె
తన పొత్తిళ్లలో పొదువుకున్న అమ్మలగన్న అమ్మ
మాయమ్మ
పూలదండలోని దారంలాంటి ఆధారం
మరుజన్మ లేదు
కానీ ... ఉంటే
ఈ అమ్మే మా అమ్మ కావాలి
- అనంతోజు మోహన్ కృష్ణ