Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బస్సు సౌకర్యం కూడా లేని ఊళ్లో పుట్టి.. రాష్ట్ర పొలిమేర దాటి..నేడు దేశ సరిహద్దులలో పహరా కాస్తూ దేశానికి భరోస ఇస్తున్నాడు. జవాన్‌గా గస్తీ కాయడమే కాదు... తన పాటలతో మస్తు ఖుషి చేస్తున్నడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన అతడు.. పాటతో ఆ ప్రేమను పంచుకున్నాడు. అతడే.. ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగులో తన పాటల మధురిమతో అందరిని మంత్రముగ్ధులను నగిరి చక్రపాణి. ఈ సైనికుడు తన పాటల బాట నేటి జోష్..
భారత్-పాక్ సరిహద్దుల్లో ప్రాణాలు లెక్కచేయకుండా దేశానికి పహారాకాసే సైనికుడు సంగీతంపై మక్కువతో మైక్ పట్టాడు. ఇండయన్ ఐడల్ లో న్యాయనిర్ణేతలను మెప్పించాడు. బీఎస్ఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న చక్రపాణి దేశం పట్ల తనకున్న బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే సంగీతం పట్ల ఆయనకున్న ఇష్టానికి సాధన రూపంలో మెరుగులు దిద్దాడు. సంగీతంలో ఏ శిక్షణా లేకుండానే తన అద్భుతమైన గాత్రంతో న్యాయనిర్ణేతలను ముగ్ధులను చేశాడు. సరిహద్దుల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మొబైల్ నెట్ వర్క్ కూడా దొరకని ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే తనకు పాటే తనకు అండగా నిలిచిందని గర్వంగా చెప్పుకునే పాటల బాణి.. చక్రపాణి.
ప్రవీణ్ ప్రోత్సాహం
పలాస దగ్గర చిన్న పల్లెటూరు పొత్తంగి. . చిన్నతనంలోనే పాటలపై మక్కువ పెంచుకున్న చక్రపాణి..ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు టేప్ రికార్డర్లో వింటూ, సాహిత్యాన్ని రాసుకొని పాటికి పదిసార్లు పాడుకునే వాడు. పాటపై మమకారం. సరదాగా కూనిరాగాలు తీసేవాడు. దేశభక్తి గీతాలు పాడేవాడు. ఎనిమిదో తరగతిలో ఇలాగే ఓ పాట పాడుతుంటే.. ప్రవీణ్ సరదాగా దాన్ని రికార్డు చేశాడు. 'చక్రీ.. నువ్వు బాగా పాడుతున్నావ్ చూడూ.. ఏదైనా టీవీ షోలో ప్రయత్నించవచ్చు కదా' అన్నాడు. అప్పుడే పాడాలన్న ఆలోచనకు బీజం పడింది.
చిన్నప్పుడే తండ్రి మరణించడంతో.. ముగ్గురు పిల్లల బాధ్యత తల్లిపై పడింది. ఇల్లు గడవడమే కష్టం. అలాంటి పరిస్థితిలో ఆమె తన ముగ్గురు పిల్లలను హాస్టల్లో వేసి ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లింది. వేసవిలో హాస్టల్ మూసేస్తే మళ్లి ఇంటికే... కానీ, అక్కడ అమ్మ ఉండేది కాదు. మా పక్కింటి ముత్యాలమ్మ వారి సొంతబిడ్డల్లా సాదింది. అప్పుడే చక్రపాణి ఒక టీచర్ దగ్గర పాటలు పాడటం నేర్చుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఇంటర్ పూర్తిచేశాడు. ఇంకా చదువుంటే తల్లికి భారమని.. తాను అమ్మ కష్టానికి చేదోడు కావాలని తలచాడు. బీఎస్ఎఫ్ నియామక పరీక్ష రాసి అర్హత సాధించాడు. ఇప్పుడు అ తల్లికే కాదు దేశానికే బాసటగా నిలుస్తున్నాడు.
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో సైనికుడిగా చేరాడు. డ్యూటీ ఎక్కగానే యథా ప్రకారం పాటతో సేద తీరేవాడు. ఉద్యోగ విధుల్లో ఒత్తిడికి గురయ్యే తొటి సైనికులకు తన పాటతో సేద తీర్చేవాడు. 'సందేశ్ ఆతే హై', 'మిట్టీ మే మిల్ జావా', 'ఆయే మేరే వతన్ కే లోగో..', 'పుణ్యభూమి నా దేశం..' వంటి పాటలతో గుండె దైర్యం నింపేవాడు. 125వ బెటాలియన్ వార్షికోత్సవమైనా, స్వాతంత్రదినోత్సవమైనా, గణతంత్ర దినోత్సవమైనా, దీపావళైనా.. పండుగేదైనా చక్రపాణి పాట లేకుండా జరిగేది కాదు. అంతలా పాటతో పెనవేసుకున్నాడు. చక్రపాణి గాత్రాన్ని తోటి సైనికులు ఆస్వాదించే వాళ్లు. అడిగి మరీ పాడించుకునేవాళ్లు. ఆ ప్రోత్సాహం, పొగడ్తలు విన్నకొద్దీ ఒక్కసారైనా ఏదైనా షోలో పాల్గొనాలని అనుకునేవాడు. అదే సమయంలో తెలుగు గాయకుడు ఎల్వీ రేవంత్ 'ఇండియన్ ఐడల్' నెగ్గడంతో తనకీ ఆ షోలో పాల్గొనాలనే ఆసక్తి ఎక్కువైంది. హిందీపై పెద్దగా పట్టు లేకపోవడంతో.. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్‌కి ప్రయత్నించి ఎంపికయ్యాడు.
నా జీవితానికి ఇది చాలు
చిన్నప్పటి నుంచి టీవీలో కనిపించాలని ఉండేది. ఇప్పుడు ప్రతిరోజూ టీవీలో కనిపిస్తున్నా. స్టేజీ మీద నన్ను చూసి మా అమ్మ బోరున ఏడ్చేసింది. గీతా మాధురి మేడమ్ మా అమ్మను జడ్జి కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించారు. అందులో కూర్చొని అమ్మ నా పెర్ఫార్మెన్స్ చూసింది. నా జీవితానికి ఇది చాలు అనిపించింది.
గోల్డెన్ మైక్... సైనిక వందనం...
సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చింది ఆర్మీ ఉద్యోగ బాధ్యతలని మానసవాఛ నమ్మిన చక్రపాణి. అదే సైనిక దుస్తుల్లో వేదికనెక్కి ఒక్కసారైనా పాడి వెళ్లిపోదాం అనుకున్నాడు. కానీ తనకు సహజసిద్ధంగా అబ్బిన కళతో, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవారితో కూడా పోటీ పడి మరీ ముందుకెళ్లాడు. నిజానికి ఈ షోకి ఎంపికవడమే పెద్ద విజయం. వేలమంది పోటీ పడి.. అనేక వడపోతల అనంతరం అతికొద్దిమందే వేదికనెక్కి పాడే అవకాశం దక్కుతోంది. జీవితంలో ఎన్నో ఆటుపోటు దాటుకొని వచ్చిన చక్రపాణికి.. ఇవి అడ్డుంకులే అనిపించలేదు. ఆ దశలన్నీ దాటి చక్రపాణి తుది 12 మంది జాబితాలోకి వచ్చాడు. పాడటం మొదలు పెట్టాక న్యాయనిర్ణేతలు తమన్, కార్తీక్, గీతామాధురిల ప్రశంసలు పొందాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటల ప్రత్యేక ఎపిసోడ్లో అందర్నీ మెప్పించేలా పాడి, ఎస్పీ బాలు గోల్డెన్ మైక్‌ని ఎస్పీ చరణ్ చేతుల మీదగా అందుకున్నాడు. అతిథిగా వచ్చిన హీరో బాలకృష్ణని ఆకట్టుకొని, సైనిక వందనం స్వీకరించాడు. క్లాసిక్, మెలోడీలు ఇష్టపడే చక్రపాణి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'లోని 'ఓ సైనికా..', 'లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో..'లాంటి ఫాస్ట్బీట్లతోనూ అదరగొట్టాడు. అన్నింటికన్నా ముఖ్యంగా తను ప్రాణంలా భావించే అమ్మ సమక్షంలో పాడటం ఓ మర్చిపోలేని అనుభూతి.