Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే గుమ్మం ముందు పండుకున్న
చీకటిని నీళ్ళు కొట్టి నిద్రలేపి
ఆకాశంలో ఉన్న చుక్కల్ని వాకిట్ల గుమ్మరించి
ముత్యాల ముగ్గులు పెడుతుండంగనే
ఈడ ముచ్చట్లు షురువైతై
వాకిళ్లు కడిగిన నీళ్ళు
పక్కింటోల్ల దిక్కు పోతే
నోర్లు ఫిరంగులై
తూటాల వర్షం కురిపిస్తాయి
అత్త కోడళ్ళ గొడవలు
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగా
రోజుకో మలుపు తిరగుతుంటై
పళ్ళు తొంకుంటనే
రాత్రైన ఎదురింట్లో గొడవకు
పక్కింటోలతో కలిసి
రివ్యూలు రాసేస్తరు
బట్టల్ని పిండుతునే
బాధల్ని పంచుకుంటూ
సబ్బు నురుగులోని బుడగల్లాగా
కష్టాల్ని కన్నీళ్ళతోనే పగలకొడుతారు
ఆదివారం వచ్చిందంటే
వారం రోజుల కష్టమంతా
సర్కారు జేబులో పడేసి
మద్యపానంలో మునిగి తేలుతుంటారు
మత్తు నెత్తికెక్కితే
ఆ రోజు పెళ్ళాం విపు మీద
పప్పుగుత్తి విరగాల్సిందే
కన్నీళ్లు నేలమ్మనీ ముద్ధాడాల్సిందే
వర్షాలు పడ్డయి అంటే చాలు
కాలువ నీళ్ళు ఇంట్లోకి ఓచ్చి
వద్దంటున్న కాళ్ళు కడిగి సంబరపడుతై
జిడ్డు చుట్టం లక్క
నాలుగు రోజులు ఇంట్లోనే తిష్ట వేసి
పోతూ పాకురుని గోడలకు
జ్ఞాపకంగా అంటించి పోతై
పనికాడి కెళ్ళి
చెమట నదిగా మారి ఇంటికొస్తుంటే
ఎదురుగా ఉరుకుంటు వచ్చే పిల్లల నవ్వే
పచ్చి చేసిన మనసుకి
మలాము రాస్తది
టెన్షన్లను చెప్పులతో పాటు
గుమ్మం ముందే వదిలేసి
ఇంట్లో మాటల మంత్రాలను విసిరి
చిరునవ్వులు కురిపిస్తారు
అమ్మ చేతి
గంజి నీళ్ళ పాయసం
పేదరికాన్ని ఇంటి ముందు
కుక్క పిల్లని కట్టి నట్టు
కట్టి పడేస్తది
సాయంత్రం ఐతే
అరుగుల మీద ముచ్చట్లు నిండిపోతై
వాకిట్ల పిల్లల ఆటలతో సందడి మొదలైతది
గల్లీ అంతా జాతరను గుర్తుజేస్తది
ఇదంతా ఇరుకిల్ల పుణ్యమే
ఎండాకాలంలో అందరూ ఇంటి బయటనే
చాపలు పరిసి పండుకుంటే
గల్లీ చల్లని నిండు కుండై
ఉడుకపోతని తరిమికొడుతది
ఈడ ఒంటరితనం అనేదే ఉండదు
ఇద్దరు మనుషులు మూడు సమస్యలు
ఎప్పుడు వాళ్ళని అంటిపెట్టుకొనే ఉంటాయి
చుట్టరికం లేకపోయినా
అన్న చెల్లినంటు వరసలు కలిపి
రాఖీ బంధాన్ని ముడేసుకునే జాఘ ఇది
ఎవరికి కష్టం ఒచ్చినా
అందరి తలుపులు తెరుచుకుంటై
మరి మానవత్వం పరిమళించే బస్తీలు కదా
కావాలంటే ఒక్కసారి ఒచ్చిచుడు
మొయ్యలేనంత ప్రేమను వెంటతీసుకుపోవచ్చు
- ఆకాష్ మునిగాల, 8106390647