Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడప్పుడు మనిషికి
బాధలు రావాలె
అప్పుడే మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరో
ఒగలమాటలు మాట్లాడేది ఎవరో
మనకు తెలిసొస్తది.
జీవితంలో
ఎప్పుడైన ఆసుపత్రిలో పడేటంతటి
రోగమొకటి
ఖచ్చితంగా వచ్చి తీరితేనే కదా..
నీ దగ్గరకు పరామర్శకు వచ్చేవాడు ఎవడు
పండ్లు తెచ్చేది
పైసలు తీసుకవచ్చేది ఎవడు
ఊరి నుంచి సద్దికట్టుకొచ్చేది ఎవడో తెలిసేది.
నీవు ఓటమిపాలై
నాల్గు బాటలకాడ తలెత్తుకొనిలేని కష్టం వస్తేనే
నీకు ధైర్యం నూరిపోసేవాడెవడు
నిన్ను మళ్లీ కొత్తగా
ఈ ప్రపంచానికి పరిచయం చేసేవాడెవడో తెలిసేది.
ఎప్పుడైన
దుఃఖం దిగమింగలేని రోజుకటి వస్తుంది
ఆ రోజున
నీ చెయ్యిపట్టుకొని నడిసేవాడెవడో
నీ గుండెమీద
తల ఆనిచ్చి ఏడ్చి ఓదార్చే వారెవరో తెలిసేది.
ఈ కడగండ్ల బత్కులో
ఆలుపిల్లలు ఉపాసముండి
ఉన్న కొండ్రాపొలం ఊరి సౌకారికి తాకట్టుపెట్టి
కట్టుబట్టలతో కానరాని దేశానికి
పయనమైనప్పుడే తెలిసేది.
ఊరి ఇడిసి పోవద్దురా
ఉన్న ఎకరలో నీకు సగం రాసిస్తా అనీ ధైర్యమిచ్చే
ఆత్మీయుడెవడో బయటపడేది.
నీవు చెరువంత బాధల నడుమ
చెట్టుకు పగ్గమేసి ఉరేసుకొని
సావలనుకున్నప్పుడే కదా తెలిసేది
నీకు పట్టెడన్నంబెట్టి ఎదమీద చెయ్యేసి
నీకు నేనున్నానని
పలికే గుండెనిబ్బరం ఇచ్చేది ఎవడనీ.!
నీవు పడిపోతేనే కదా
నీ అంతరాత్మకు అర్థమయ్యేది
నీవు పడినందుకు పండ్లిలికిలించి నవ్వేది ఎవడు
కండ్లు చెమ్మగిల్లిపోయి ఏడ్చేది ఎవడో తెలిసేది.
నీవు ఓడిపోతేనే తెలిసేది
నీ వాడెవడు
పరాయివాడెవడు
నీ మిత్రుడెవడు
నీ శత్రువు ఎవడో తెలిసేది.
ఇంట్ల ఎవరైన కాలమైనప్పుడే
తెలిసేది
ఆ మనిషి చుట్టూ అల్లుకున్న అనుబంధాలు
ఆ మనిషికున్న బలమెంత బలగమెంతనోననీ..
- అవనిశ్రీ, 9985419424