Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజంగా మనిషి కళాకారుడు. ప్రేమికుడు. తనకు ఇష్టమైన నడకల్లో ఎన్నో నేర్చుకుంటాడు. ఎన్నింటినో తనలోకి ఒంపుకుంటాడు. వాటిని ఎంత ప్రేమిస్తాడో అంతే కదిలిస్తాడు. ఎన్నో నైపుణ్యాలు ఉన్న మనుషులు కొందరే ఉంటారు. అటువంటి కోవకు చెందిన యువకుడు ధర్పల్లి సాయి. కవిత్వం, పెయింటింగ్, పాటలు, ఫోటోగ్రఫీలతో ఇలా తనదైన తన చుట్టూ కదిలే జీవితాలకు రంగులద్దుతుంటాడు. అక్షరాలను కుప్పబోసి ఆకలి గురించి మాట్లాడుతాడు. ఆకలి కడుపుల్ని తన్నే అన్యాయంపై అరుస్తాడు. అంతరించి పోతున్న మానవ జీవనంలోని వస్తువులకు రంగుల్ని పులుముతాడు. జన జీవనంలో సహజమైన దశ్యాలను తనలో పదిల పరుచుకుంటాడు. మనిషితరుపున గొంత్తెత్తి పాట అవుతాడు. చరణాలు
చరణాలుగా మనిషికోసం తపిస్తుంటాడు.
ధర్పల్లి సాయి కుమార్ నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం, గ్రామంలో 1992 జూన్ 2న ధర్పల్లి సాయిలు, గంగవ్వ దంపతులకు జన్మించిచాడు. కన్న ఊరుపై మమకారంతో ఊరు పేరును ఇంటిపేరుగా మార్చుకున్నాడు. బాల్యం ఊరిలోనే గడిచింది. అదే ఊరిలో పదవ తరగతి, ధర్పల్లి జూనియర్ కళాశాలలో ఇంటర్ చేశాడు. డిగ్రీ, పీజీ గిరాజ్ పల్లిలో పూర్తిచేశాడు.
కలర్ ఫుల్ రూపాలు..
బడికి వెళ్తున్న వయసులోనే పెయింటింగ్‌ను ఇష్టపడ్డాడు. అప్పటి నుండి సాధన చేస్తూ తనదైన శైలిలో అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తున్నాడు. వాటితో కనుమరుగవుతున్న జీవన విధానాలను చూపుతున్నాడు. చేతి వృత్తులు, శ్రమ జీవులు, ఇసురురాయి, బతుకమ్మ, ఒగ్గుకథ చెప్పే విధానం, బావి నీళ్ళు చేదుకోవడం, ఇంటి గడపకు బొట్లు పెట్టడం, బోనమెత్తుకొని ఊగడం, వంటి వివిధ జానపద కళాకారుల, శ్రమజీవుల కదలికలకు కలర్‌ఫుల్ రూపాలను కండ్ల ముందు ఉంచుతాడు. తెలంగాణ సంస్కృతి, సహజమైన జీవనంలో మనం కోల్పోతున్న వస్తువులను తన కళ ద్వారా రికార్డు చేస్తూ రంగులద్ది సమాజానికి అందిస్తున్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న దోపిడీ, అన్యాయం, పేదరికం ఎన్నో విషయాలను ఆకట్టుకునేలా బొమ్మలు కూడా వేశాడు. ఈ కాలంలో తన మిత్రులు సిరిసిల్లా గపూర్ శిక్షక్, చాట్ల ప్రాణీత్, ముక్కెర విజరు, సాయి లావోలు వంటి మిత్రులు అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు చేసుకున్నాడు.
అతడొక అక్షర క్షిపణి..
ఇంటర్మీడియట్ నుంచే పెయింటింగ్స్, బొమ్మలతో పాటుగా సమాజాన్ని పట్టిపీడుస్తున్న సమస్యలపై కవిత్వమై ప్రతిధ్వనించాడు. వ్యవస్థను అర్థం చేసుకోవడానికి దృశ్యాలు ఎంత అవసరమో అక్షరాలు కూడా అంతే అవసరం. అందుకే కవిత్వం తనలోకి ఒంపుకున్నాడు. తన లోలోపల మెదిలిన కోపం, దు:ఖం, వ్యవస్థ నలు రూపాలను చిన్న చిన్న మినీ కవితల ద్వారా చూపించాడు. అయితే ఒక పరిశీలనాత్మకంగా చూస్తే నిజానికి మనకు చిత్రాలు, కవిత్వం రెండు కలిపి 'రక్తరేఖ' అలిశెట్టి ప్రభాకర్ కవిత్వ పుస్తకంలా కనిపిస్తుంది. అక్కడక్కడ పాత పుస్తకాలను వెతికితే అద్భుతమైన చిత్రాలు కవితతో పాటుగా కనిపిస్తాయి. ప్రస్తుత కాలంలో అక్బర్ లాంటి వాళ్ళు పుస్తకాలలో కవితలకు బొమ్మలేస్తున్నారు. ఆ వారసత్వం కొనసాగిస్తున్న వాళ్ళలో సాయి తన కవితలకు తానే స్వయంగా బొమ్మలేసుకొని ''అక్షర క్షిపణి'' పుస్తకాన్ని తీసుకొచ్చాడు. దీనిలో సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను చూపెట్టారు. చిత్రాలతో కవిత్వంగా రాయగలిగితే చాలా సులువుగా చెప్పాలనుకున్న విషయం అర్థమవుతుందని ఈ కోణాన్ని ఎంచుకున్నట్లు చెపుతున్నాడు. దాని వల్లనే ఈ చిత్ర కవిత్వం ప్రారంభించాను అంటున్నాడు.
మినీ కవితలో అభివృద్ధి గురించి చెప్తూ ఆకలినే తెలుసుకోలేని అభివృద్ధి అంటున్నాడు.
అంతరిక్షంలోకి
అవలీలగా అగ్రరాజ్యాలు
అడుగు పెడుతున్నా
ఆకలి కడుపుల్లో అర్తనాధాల్ని మాత్రం
కనిపెట్టలేక పోతున్నాయి. (టెక్నాలజీ)
ధర్పల్లి దరువు..
సాయిపెయింటింగ్కో, కవిత్వంకో పరిమితమై ఆగిపోలేదు. పాటై పల్లవించాడు. జానపదమై కదిలించాడు. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళె క్రమంలో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. కవిత్వం, పెయింటింగ్స్ ద్వారా చెప్పాలనుకున్న విషయాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పాటను ఎత్తుకున్నాడు. ఈ పాటల్ని రాయడానికి పల్లె సంస్కృతి సంప్రదాయాలు వాటి మూలాలను అధ్యయనం చేస్తూ అనేక జాతుల అస్తిత్వాలను అన్వేషిస్తూ వారి చరిత్రను బయట పెడుతున్నాడు. ఇప్పటివరకు తెలంగాణ సమాజంలో కొన్ని వందల జానపద కళలు గ్రామీణ జీవన కళలు కనుమరుగై పోయాయి. వాటిని పాటల రూపంలో బయటకు తెచ్చేందుకు పరితపిస్తున్నాడు. అట్లాగే పల్లె మూలాలను ప్రపంచీకరణ దోపిడీని దేశంలో నెలకొన్న సామాజిక పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీని, అవి అనుసరిస్తున్న విధానాలపై కై కడుతూ, పాటలతో ప్రజల్ని చైతన్య పరుస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు 200 పాటల దాకా రాశాడు. వీటిల్లో 20 పాటల దాకా తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు.
తనను కన్న ఊరిని తలుచుకుంటూ ఊరు అందాలను చెరువును, కట్ట, గుట్ట తాటికల్లు, ఊరి నలుమూలను ప్రేమను 'ఎన్నెన్ని అందాల పచ్చని తల్లి.. నను కన్న నా ఊరు ధర్పల్లి' అని రాసుకున్నాడు.
'పల్లె రూపం నువ్వు పారేటి ఏరువు
సలువ నీడవు నీవు మండేటి పొద్దువు గంగవ్వ'
అంటూ తల్లిని గంగవ్వలాంటి ఎందరో పల్లె తల్లుల శ్రమను, ప్రేమను, దు:ఖాన్ని చరణాలుగా రాసుకున్నారు. పాట గురించి పాట రాస్తూ
''పల్లెతల్లి పొత్తిళ్ళల్లో పాటవయినావు
ప్రజల వెంట నడిచి నీవు ఉద్యమించినావు
గాయపడ్డ పాట నీకు వందనం
తిరగబడ్డ పాట నీకు వందనం'' అంటూ పాట రూపాన్ని, పాట మీద ఉన్న మమకారాన్ని ప్రేమతో పాట రూపం ఇచ్చాడు. వీటితో పాటుగా పూల సింగడి బతుకమ్మ, ఆకలి కడుపుతో అడగవే, అరేసి ఋతువులు అంటూ తన ఛానల్లో పాటు రాస్తున్నాడు. ఇంకా రికార్డు చేయాల్సిన పాటలు చాలనే ఉన్నాయి.
గతేడాది ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29 వరకు సిరిసిల్లా సిపిఐ కార్యాలయంలో ఫొటోగ్రఫీ, పెయింటింగ్స్ ప్రదర్శనను ప్రముఖ కవి జూకంటి జగన్నాథం ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలోచింపజేసింది.
తెలంగాణ జీవనమే..అతడి ఫోటోగ్రఫీ
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను, బొట్టు నుంచి బోనం దాకా మట్టి నుంచి మాగాని దాకా కాపాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ జీవన విధానం మీద ఫోటోగ్రఫీ చేశాడు. వత్తుల్ని పండుగలని, తెలంగాణ తల్లుల కట్టుబొట్టును తన కెమరాతో ప్రపంచానికి తెలియజేశాడు. సాయి కుమార్ ఫోటోగ్రఫీలో పల్లె మూలాలు ఎన్నో ప్రతిబింబిస్తాయి. ఎన్నెన్నో వత్తులు స్పర్శతో ఆకట్టుకుంటాయి. బతుకమ్మ ఉత్సవాలు, పల్లె జీవన విధానం, ఇసిరేలు, పాడిపంటలు పల్లె అందాలు కనువిందు చేస్తాయి.
- పేర్ల రాము, 9642570294