Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ తాతముత్తాతల ఆస్తులకు మాత్రమే వారసులుగా ఉంటారు. అతి కొద్దిమంది మాత్రమే ఆ తాతల మంచితనాన్ని, మానవత్వాన్ని, అభ్యుదయాన్ని వారసత్వంగా స్వీకరిస్తారు. అలాంటి వారిలో మల్లు అరుణ్ ఒకరు. కేవలం పేరులోనే కాదు అతని రక్తంలో కూడా అభ్యుదయ భావాలు ఉన్నాయి. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి సేవా భావాలను అందిపుచ్చుకున్నాడు. వైద్యుడిగా పేదలకు తనకు చేతనైనంత సేవ చేస్తున్నాడు. తాతకు తగ్గ మనవడిగా, నాయనమ్మకు తగిన వారసుడిగా అభ్యుదయ భావాలతో ఎదుగుతున్న ఆ యువ డాక్టర్ పరిచయం నేటి జోష్‌లో...
చిన్నప్పటి నుండి మనుషుల కోసం బతికిన కుటుంబం మాది. మా తాతయ్య మల్లు వెంకట నర్సింహారెడ్డి ఉమ్మడి నల్గొండలో మంచి పేరున్న కమ్యూనిస్టు నాయకుడు. మా నాయనమ్మ మల్లు స్వరాజ్యం. తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అన్యాయంపై సింహంలా గర్జించేది. చిన్నతనంలో వాళ్ళను చూస్తూ పెరిగిన నాకు వాళ్ళ భావాలు రావడం సహజం అనుకుంటాను. మా అమ్మ మల్లు లక్ష్మి, తను ప్రస్తుతం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంది. నాన్న మల్లు నాగార్జునరెడ్డి. తను సూర్యాపేట సీపీ(ఐ)ఎం జిల్లా కార్యదర్శిగా బాధ్యలు చూస్తున్నారు. ఇలా కుటుంబం మొత్తం సమాజం కోసం పని చేసేవాళ్ళే.
తాతయ్య సపోర్ట్‌తో...
తాతయ్య, నాయనమ్మ అయితే ఎన్నో త్యాగాలు చేశారు. తాతయ్యకు పేదలకు ఉచితం వైద్యం అందాలని బాగా కొరిక ఉండేది. ఎప్పుడూ దాని గురించే మాట్లాడుతుండేవాడు. నేను నల్గొండలోనే పుట్టి పెరిగాను. అక్కడ నా స్కూలింగ్ పూర్తి చేశాను. చిన్నతనంలో లెక్కలంటే నాకు బాగా ఇష్టం. కానీ తొమ్మిది, పదో తరగతిలో ఉన్నప్పుడు సైన్స్ అంటే ఇష్టం కలిగింది. ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో అయోమయంలో ఉన్నాను. అమ్మానాన్నకేమో ఎంపీసీ తీసుకుంటే త్వరగా సెటిల్ అవుతానని కోరిక. నాకేమో సైన్స్ ఇష్టం. అప్పుడు తాతయ్య ''వాడికి సైన్స్ అంటే ఇష్టం అంటున్నాడు కదా! అదే చదవని... డాక్టర్స్ కూడా సమాజానికి చాలా అవసరం. తనకు నచ్చింది చదవని'' అని నాకు సపోర్ట్ చేశాడు. అయితే నేను సైన్స్ తీసుకున్నా డాక్టర్ అవుతానో లేదా అప్పటికి నాకు తెలియదు.
మాట ఇచ్చాను...
అలా తాతయ్య సపోర్ట్‌తో 2004లో ఇంటర్ బైపీసీలో చేరాను. అయితే అదే ఏడాది తాతయ్య ఆరోగ్యం పాడై హాస్పిటల్లో చేరారు. కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అలా ఉన్న తాతయ్యను చూస్తే దుఖం ఆగలేదు. తాతయ్యకు తన మనవళ్ళు, మనవరాళ్ళల్లో ఎవరైనా డాక్టర్ కావాలని కోరిక ఉండేది. తన కోరిక నేను తీర్చాలని బెడ్‌పై ఉన్న తాతయ్యకు నేను డాక్టర్ అవుతానని మాట ఇచ్చాను. మాట్లాడలేని స్థితిలో ఉండి కూడా చాలా సంతోషంగా నావైపు చూసి మంచిది అన్నట్టు చెయ్యి ఊపి ప్రోత్సహించారు.
చదువంతా పూర్తి చేసుకుని...
ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసి రెండు మార్కుల్లో ఫ్రీ సీట్ మిస్ అయ్యాను. తర్వాత లాంగ్ టర్మ్ తీసుకొని మన స్టేట్‌లో 700 ర్యాంక్ తెచ్చుకున్నాను. కర్నాటకలో అయితే 320 ర్యాంక్ వచ్చింది. మన స్టేట్‌లోనే చదువుకోవాలనే ఆలోచనతే నార్కెట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో చేరాను. తర్వాత మహబూబ్ నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఆర్ధోఫెడిక్ పీజీ చేశాను. గాంధీలో ఇంటన్‌షిప్ చేశాను. ఆ తర్వాత బెంగుళూరులో స్పోర్ట్స్ సర్జన్ కోర్సు చేసి అక్కడే ప్రాక్టీస్ కూడా చేశాను. అక్కడ పెద్ద పెద్ద క్రీడాకారులకు మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్లు చేసేవాళ్ళం. తర్వాత బొంబేలో రోబోటిక్ నీల్, హిప్ రీప్లెస్‌మెంట్ పైన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని హైదరాబాద్ వచ్చాను.
చేతనైనంతగా..
వీటితో పాటు నా దగ్గరకు వచ్చే పేషంట్లకు కొంత అవగాహన కల్పిస్తుంటాను. ఉదాహరణకు ఆరోగ్య భద్రత అని ఉంటుంది. పోలీస్ డిపార్ట్ మెంట్లో పని చేసే కానిస్టేబుల్స్ కుటుంబాలకు ఏవైనా ప్రమాదాలు జరిగి మోకాళ్ళ మార్పిడి చేసుకోవల్సి వస్తే ఫ్రీగా చేసుకోవచ్చు. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటి గురించి చెబుతుంటాను. అలాగే హాస్పిట్లో అతి తక్కువ ఖర్చుతో మోకాళ్ళ మార్పిడి చేసుకునే కొన్ని స్కీమ్‌లు ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు పేద వాళ్ళకు చెబుతుంటాను. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో ఇంత వరకు చేయగలుగుతున్నాను.
ప్రభుత్వ ప్రోత్సాహం లేదు...
భారతదేశంలో వైద్యం అత్యంత ఖర్చుతో కూడుకు న్నది. వైద్యంలో క్వాలిటీ కావాలి, ఖర్చు తక్కువ ఉండాలి. అలా కావాలంటే యుకే లాగా ఎన్‌హెచ్ సిస్టమ్ మన దగ్గర కూడా రావాలి. అక్కడ వైద్యం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. అందుకే ఫ్రీ. మన ప్రభుత్వం కూడా ఇలా చేస్తే పేదలకు మంచి వైద్యం అందించవచ్చు. కానీ మన దేశంలో అది సాధ్యం కావడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్నవాళ్ళు డబ్బు ఎలా సంపాదించాలా అనే ఆలోచిస్తారు. అలాగే చిన్న నర్సింగ్ హౌం పెట్టుకుందా మన్నా చాలా కష్టం. రాయితీలు ఇవ్వరు. అదే సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తారు. కానీ హాస్పిటల్ పెట్టాలంటే మాత్రం పర్మిషన్ ఇవ్వడానికి కష్టం. వైద్యం విషయంలో ప్రభుత్వ ప్రోత్సహం లేదు. అందుకే వైద్యం మన దగ్గర వ్యాపారంగా మారిపోయింది.
జీవన విధానం మారాలి
ప్రస్తుతం యువత జీవన విధానం బాగా మారిపోయింది. విపరీత మైన ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షల ఒత్తిడి ఒక భాగం అయితే, తొందరగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో మందు, సిగరెట్ లాంటి చెడు అవాట్లకు లోనవుతున్నారు. ఆరోగ్యం గురించి పూర్తిగా మర్చిపోతున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అలాగే యువత చెడు మార్గం పట్టకుండా స్కూల్ స్థాయి నుండి మోరల్ సైన్స్ క్లాసులు చెప్పాలి. ఒత్తిడిని తగ్గించు కోవాలి. మరో విషయం ఏమిటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల చాలా మంది నడుం నొప్పి, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. వీళ్ళంతా రోజూ ఉదయం వ్యాయామం చేస్తూ, మంచి జీవిన విధానాన్ని అలవర్చు కుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
క్యూబా స్లోగన్ ప్రభావంతో...
మనం ఎక్కడ ఉన్నా మనలోని అభ్యుదయ భావాలు మాత్రం ఎక్కడి పోవు. పేదలకు ఏదో ఒక విధంగా సేవ చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ నాలో ఉంది. తాతయ్య కోరిక కూడా అదే. కాకపోతే నేను ఒకటే అనుకున్నాను. నా చేతిలో ఉన్న వైద్యంతో నాకు సాధ్యమైనంత వరకు పేదలకు సేవ చేయాలి. విప్లవ దేశమైన క్యూబాలోనొక స్లోగన్ ఉండేది. వారానికి ఒకరోజు సమాజ సేవ చేయాలి అని. ప్రస్తుతం అదే అనుసరిస్తు న్నాను. నేను పని చేసే హాస్పిటల్ తరఫున ప్రతి వారం ఉచిత క్యాంప్ ఉంటుంది. అలాగే ఎం.హెచ్ భవన్లో తాతయ్య పేరుతో నిర్వహిస్తున్న విన్.ఎన్ మెమోరియల్ క్లినిక్‌కి ఒక రోజు వస్తాను. అలాగే గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారానికి ఒకరోజు వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను. ప్రస్తుతం నాకున్న అవకాశం మేరకు చేస్తున్నాను. భవిష్యత్‌లో నాకు మంచి అవకాశాలు వస్తే కచ్చితంగా సేవా కార్యక్రమాలు పెంచుతాను.
కార్పొరేట్ల వద్ద పని ఇష్టం లేదు
ఈ రంగంలో పరిస్థితి ఘోరంగా ఉంటుంది. మన తాతలో, తండ్రులో ఎవరైనా ఇందులో ఉంటే ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా సులభం. కానీ నాకు అలాంటి పరిస్థితి లేదు. మంచి ఎడ్యుకేషన్, నైపుణ్యం ఉండడంతో కార్పొరేట్ సంస్థల వాళ్ళు తీసుకుంటామని ముందుకొచ్చారు. కానీ నాకు అలాంటి చోట పని చేయడం ఇష్టం లేదు. అందుకే గచ్చిబౌలిలో చిన్న హాస్పిటల్లో ఆర్థోపెడిక్ విభాగం తీసుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అక్కడ చాలా చిన్న సెటప్ ఉండేది. మంచిగా ట్రీట్ చేయడం, ఆపరేషన్లు సక్సెస్ కావడంతో తొమ్మిది నెలల్లోనే హైటెక్ సిటీ మొత్తం మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు నేనే సొంతంగా చిన్న ఆస్పత్రి ప్రారంభిస్తే ఇంకొంత సేవ చేయొచ్చుకదా అనే ఆలోచన వచ్చింది. అలాంటి సమయంలోనే కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిలిచారు. వాళ్ళు ప్రతి విభాగంలో ఒక యంగ్ డాక్టర్లను ప్రోత్సహించేవారు. పైగా మిగిలిన హాస్పిటల్స్ కంటే చాలా తేడా ఉంటుంది. కార్పొరేట్ పద్ధతి అక్కడ ఉండదు. అందుకే వాళ్ళు పిలవడంతో వెంటనే వెళ్ళాను. ప్రస్తుతం అక్కడే చేస్తున్నాను.
- సలీమా
ఫొటోలు : పి.వెంకటేశ్