Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియా, ఇది భరించలేని కాలం ఒక్క అడుగు కూడా కదలకుండా నన్ను వేధించటానికి వెక్కిరించిటానికి నిలిచి మరీ ఆడిస్తున్న యమకాలం. నీకు నాకు మధ్య కులపర్వతాలు వెలిశాయి. వాటిని దాటే క్రమంలో నేను సగంలోనే ఆగిపోయాను.నీ జ్ఞాపకాలన్నీ చిత్రవధ చేస్తున్న ఈ కాలం కొంచెం కూడా ముందుకు కదలడం లేదు.
తొలినాళ్లలో నువ్వూ నేను జంటగా వేసిన అడుగులు, అరణ్యాన్ని ధైర్యంతో దాటేసిన కాలం ఈ రోజు నవ్వుతుంది కులారణ్యం ముందు నువ్వు నేను ఒడిపోతున్నామని.
ఓ వాన గడియల్లో నువ్వు నేను ఆగి చెప్పుకున్న ముచ్చట్లన్నీ ఇప్పుడు నన్ను వేధించటానికి నా చుట్టూ చేరాయి. నా కోసమే నువ్వు నీ కోసమే నేను అన్న మన మాటలు ఈ రోజు కులం కోసం మారిపోతుంటే ప్రాణాలని అరచేతిలో పెట్టి అగ్నితో మర్దనా చేస్తున్నట్లు ఉంది.
నువ్వొక అందమైన భవిష్యత్ అనుకున్నా కానీ ఓ చేదు జ్ఞాపకం లాంటి రోజు మిగులుతుందేమో అని భయం వేస్తుంది ఈ పూట.
కాలం మన మీద ఎందుకో విషపు నీడలు పరిచింది, ఉన్నట్టుండి ఉపద్రవాన్ని తోసింది, నడి మధ్యన ఉన్న నేను నిన్ను అందుకోలేకున్నాను.
ఓ నాడు గాఢమైన నిద్రలో ఉన్న నన్ను లేపి నిండుగా మన లా ఉన్న చందమమాని చూపించావు గుర్తుందా నీకు,ఈ రోజు ఈ ఒంటరి జ్ఞాపకాలలో అమావాస్య నన్ను నింపేసింది
''నీ ఈ జ్ఞాపకాలలో నిండు చందమామ కూడా చెల్లని రూపాయి లా కనిపిస్తుంది''.
ఒక్కోసారి ఏమీ మాట్లాడకుండా నువ్వు నేను నిశ్శబ్దంగా చేతులు పట్టుకుని కూర్చున్నప్పుడు అనుకోకుండా మన మధ్య ప్రేమ వెల్లువలా కురుస్తుంది, మన చుట్టూ అమృత ధారాలతో నిండిన వెండి మేఘం లాంటి వెలుగు పూస్తుంది. పవిత్ర మూర్తుల్లా నువ్వూ నేను వెలిగిపోతాం.అప్పుడు మన వెలుగు ఈ లోకాన్ని పాలిస్తుందా అనిపిస్తుంది నాకు.
కానీ ఈ రోజు నేనొక చీకటి కుహరంలోకి నెట్టబడ్డాను.
నీ దూరంతో ఏ వెలుగు నా దరి చేరడం లేదు ఒట్టి చీకటే మిగిలింది నాలో...
ఈ బాధ అర్థం కావడం లేదు ఏ మూలో కీచు గొంతు వేసుకొని ఆర్తనాదం చేస్తుంది ,ముందుకు వెళ్లలేని నా అసహాయతను చూస్తే ప్రాణం శివాలెత్తి భీకర నృత్యం చేస్తుంది ఒట్టి శోకం మిగిలింది గుండెలో...
నీ దూరం రోజు రోజుకి నన్ను సంహరిస్తుంది ఏదో ఒకరోజు పూర్తిగా కాలిపోయిన శవంలా ఈ లోకంలో వాలిపోతానేమో..
ఇది కులం చేస్తున్న హత్య
మతం జరుపుతున్న మారణహౌమం
వీటిల్లోకి నువ్వూ నేను ఓ సమిధలం...
హక్కులని నిలుపుకోలేని లోకం లో పుట్టినందుకు పుట్టిననాడే మరణించి ఉంటాం, తెలిసి ఈ రోజు మరణిస్తున్నాం మళ్లీ మళ్లీ మరణిస్తాం.కానీ ఈ లోకం తీరు మారదు.దానికి తెలిసింది వేధించటమే....
నీ జ్ఞాపకాలతో...
- పి.సురేంద్ర, 9346704966