Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడికి కాస్త సమయం దొరికితే చాలు ఏ కొండలనో, కోనలనో పట్టుకు తిరుగుతాడు. ప్రకృతితో మమేకమై పోతాడు. తన్మయత్వం చెందుతాడు. లాగిన్-లాగ్ అవుట్ల 'ఈ'- బంధాలను తెంచుకుని... చెట్టు చేమలతో గుట్ట పుట్టలతో బంధాలకై పరితపిస్తాడు. స్వచ్ఛమైన సెలయేరై ప్రవహిస్తాడు. అందుకే అతను Go back to natureµ విధానంలో నుంచి మనల్ని 'Pay back to nature' లోకి నడిపిస్తన్నాడు. ఆ ప్రకృతినే తన ఇంటిపేరుగా మార్చుకున్న ''వివేక్ లంకమల''తో పరిచయం ఈ నాటి జోష్...
'లంకమల' మీ ఇంటి పేరా?
కాదు. లోమాటి వివేకానందరెడ్డి నా పూర్తిపేరు. కొద్ది రోజులు 'వివేక్ సగిలేటి' అని ఉండేది. ఆ పేరుతో I Dream లో కొన్ని ఆర్టికల్స్ కూడా రాశా. కరోనా తర్వాత హైదరాబాద్ వదిలి ఇంటికొచ్చాక వీకెండ్స్‌లో లంకమలతో స్నేహం కుదిరింది. అలా 'లంకమల' వచ్చి నా పక్కన చేరింది. ఇప్పుడు తీద్దామన్నా వద్దంటున్నారు చాలామంది మిత్రులు. సరే ఇది నా ప్రాంత అస్తిత్వ ప్రకటనగా కూడా ఉంటదని అదే పేరును కొనసాగిస్తున్నా.
నల్లమల మాత్రమే ఎక్కువగా తెలుసు. ఈ లంకమల విశేషాలేంటి?
అటవీ వర్గీకరణలో లంకమల నల్లమలలో ఒక భాగం. కానీ భౌగోళికంగా చూస్తే నల్ల మలకు శేషాచలం కొండలకు మధ్యన వారధిగా నిలిచేదే ఈ లంకమల. అడవి నల్లమల అంత దట్టంగా లేకపోయినా కొండలు శేషాచలంలా నిలువెత్తుగా ఉంటాయి. మూడు వైపుల నీళ్లు (పెన్నా, సగిలేరు) ఒకవైపు భూభాగం. ఎర్రచందనంతో పాటు ప్రపంచంలోనే అరుదైన కలివి కోడి స్థావరం కూడా ఈ లంకమలలోనే. ఆధ్యాత్మిక పరంగా చూస్తే లంకమల కాపాలిక శైవానికి ప్రముఖ స్థావరంగా ఉండేది. శ్రీశైల దక్షిణ ద్వారంగా సిద్ధవటం గురించి చెప్తారు. ఈ మధ్య మా అన్వేషణలో బండిగాని సెల వద్ద ఉన్న గుహ గోడలపై రాతియుగపు ఆది మానవుని రేఖాచిత్రాలు కొన్ని బయట పడ్డాయి. ఇంతకు ముందు ఇలాంటివే కొన్ని యోగి వేమన యూనివర్సిటీ వారు మల్లుగాని బండ వద్ద కనిపెట్టారు.
బయటి ప్రపంచానికి పరిచయమవ్వని పదుల కొద్ది జలపాతాలు, చారిత్రక సంఘటనలు లంకమల కొండల్లో దాగి ఉన్నాయి. లంకమల చారిత్రక, భౌగోళిక, ప్రకతి విశేషాలు, మా ప్రయాణాలు, అనుభవాలతో ఒక పుస్తకం తీసుకు రావాలన్న ఆలోచన కూడా ఉంది.
మీ ప్రకృతి ఆరాధనకు కరువే కారణమా?
ప్రకతి ఆరాధన అనేది పెద్ద పదమేమో..! (నవ్వుతూ). కరువు కారణమా అంటే నేరుగా ఉండకపోవచ్చు. కానీ వర్షంలో తడుస్తూ, శరత్తుకు వణుకుతూ, శిశిరంలో ఆకులు రాల్చి వసంతానికై ఎదురుచూస్తూ అన్నీ తనలో భాగమన్నట్టుగా ఉండే ప్రకతిని చూస్తే స్థల, కాల ప్రభావానికి అతీతమైన జీవిత సత్యమేదో గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కరోనాకు ముందు కొండలు, అడవులతో ఉన్న నా సాన్నిహిత్యం తక్కువే. వర్క్ ఫ్రం హోం తెచ్చిన వెసులుబాటుతో అడవి ప్రయాణం మొదలైంది. వెళ్లి వచ్చిన తర్వాత మా ప్రయాణ విశేషాలు ముఖపుస్తక (Facebook) వేదికగా రాయడం మొదలయ్యాక ప్రకతి ప్రయాణాల విస్తతి అర్థమైంది. చుట్టూ ఉన్న సమాజం మరింత విశాలంగా కనిపిస్తోంది. దానికి తోడు కూర్చుని చేసే జాబ్ వల్ల శారీరక శ్రమ కాస్త తక్కువే. ఇలా తిరగడం వల్ల శరీరానికి మజ్జు వదిలించి శ్రమ కల్పించినట్టు అవుతోంది.
మీపై జియోగ్రఫీ ఛానల్ ప్రభావం ఏమైనా ఉందా? మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలు, పర్యావరణవేత్తలు?
జియోగ్రఫీ ఛానల్ కంటే సాహిత్యం ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి 'కొండపొలం' నవలలో ప్రస్తావించిన ప్రదేశాలను వెతుక్కుంటూ రచయితతో చేసిన నల్లమల యాత్ర, బిభూతిభూషన్ బంధోపాధ్యాయ 'వనవాసి', 'చంద్రగిరి శిఖరం', చెంగీజ్ ఐత్మతోవ్ 'జమీల్యా' లో వర్ణించిన కిర్గిస్తాన్ పర్వత పంక్తులు, స్టెప్ మైదానాలు, తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ 'అర్థనారి', 'కడప కైఫియ్యత్ కథల' పేరుతో కట్టా నరసింహులు క్రోడీకరించిన బ్రిటీష్ కాలం నాటి కడప స్థానిక చరిత్ర, భౌగోళిక అంశాలు మెదడులో నిక్షిప్తమైన అంశాలకు కళ్ళతో చూసి దశ్యమానం ఇవ్వాలనే దక్పథాన్ని కొత్తగా పరిచయం చేశాయి. జీవితం మొత్తాన్ని కాలి నడకలకు అంకితం చేసిన ప్రొ. ఆదినారాయణ మాచవరపు భ్రమణ కాంక్ష, జిప్సీలు కూడా కొంచెం ప్రభావం చూపారని చెప్పవచ్చు. ఇవి మాత్రమే కాకుండా సమాజం, సాహిత్యం, భౌగోళికం, ఆర్థిక కోణాల పట్ల శివ రాచర్ల అన్నతో జరిపిన చర్చలు, వారితో చేసిన ప్రయాణాలు నా చుట్టూ ఉన్న సమాజం పట్ల నా దష్టి కోణానికి కొంత విస్తతిని పరిచయం చేయడం నాపై ఎక్కువ ప్రభావం ఉంది అనుకోవచ్చునేమో. అలాగే దక్షిణాన సిద్ధవటం కోట, పడమటి దిక్కున పెన్నా నది సారవంతమైన మాగాణి భూములు, ఉత్తరాన నల్లమల, మూడు వైపులా నీరు, దట్టమైన అడవి కావడంతో బయట ప్రపంచం గుర్తుకు నోచుకోని కొన్ని చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దివిటీ మల్లుడు. అతని గురించి మా చుట్టుపక్క పల్లె జనాల మాటల్లో తప్ప రికార్డ్స్‌లో ఉండదు. వాళ్లు చెప్పే నోటి మాటల చరిత్ర తాలూకు ఆనవాళ్లను వెదుకుతూ చేస్తున్న లంకమల ప్రయాణాలు కొత్త కోణాన్ని పరిచయం చేస్తోంది. అల్లం శేషగిరిరావు, అంప శయ్య నవీన్, గుంటూరు శేషేంద్రశర్మ, కేశవరెడ్డి, ఫేస్బుక్ లో రాసే శివ రాచర్ల, నంద కిషోర్ ఇలా రచయితల లిస్ట్ అంటే చానా పెద్దది. ఒక్కొక్కరు ఒక్కో సమయంలో నచ్చుతారు. అయితే ఈ అభిమానమంతా వ్యక్తిగతంగా కాక వారి వారి రచనల ప్రభావంగా ఉండొచ్చు. పర్యావరణ పరంగా చూస్తే... నిస్సందేహంగా జాదవ్ పాయెంగ్.
మీకు లంకమలకు సాన్నిహిత్యం ఎక్కడ కుదిరింది?
ఇప్పుడంటే అడవికి, మనిషికి మధ్యనున్న సన్నటి దారం తెగి అడవులు విహార యాత్రలు, ఆటవిడుపులుగా మారాయి కానీ మన ముందుతరానికి పొయ్యిలో కట్టెల నుంచి వంటలో చింతపండు వరకు అడవే అన్నిటికీ జీవనాధారం. మా ఊర్లో రెడ్డి బ్రహ్మారెడ్డి పెదనాయన, రమణా రెడ్డి అన్న ఇంకా మరికొంత మంది గొర్లు మేపుకోడానికని వెళ్లి నెలలు, నెలలు కొండల్లోనే ఉండిపోతారు. వాళ్లకు లంకమల అడవిలో అణువణువూ తెలుసు. వాళ్ళు చెప్పే అడవి అనుభూతులు నాలో ఒక రకమైన ఆసక్తి కలిగించాయి. వాటిని తెలుసు కోవాలనే ఆలోచన పెరిగింది. దీనికి కరోనా తెచ్చిన వర్క్ ఫ్రం హోం జత కుదిరింది. వెనక్కి తిరిగి చూస్తే రెండేళ్ల కిందట పుట్ట గొడుగుల వెతుకులాటకని బయల్దేరిన ప్రయాణంలో చూసిన మల్లుగాని బండ వద్ద ఆది మానవుని రేఖా చిత్రాలు, సాలంక, కైలాస గుండాలు వెతుక్కుంటూ అక్కడికి వెళ్లి కూడా అది కాదని వెనక్కిరావడం, ఫేస్బుక్లో నేను రాసిన 'పొట్టేలు కథ'లో ప్రస్తావించిన ప్రదేశాలు, సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ నలభై అయిదు మందిమి చేసిన మల్లెంకొండ యాత్ర, తొంభై మందితో కలిసి వెళ్లిన నల్లమల బిలం గవి, పగులు చీకటి కోనను వెతుక్కుంటూ వెళ్లిన ప్రయాణంలో కనిపించిన శతాబ్దాల కాలంనాటి రాజుల చెరువు, రెండుసార్లు ప్రయత్నించినా కనిపెట్టలేని పగులు చీకటి కోన ఆనవాళ్లు, అడవిలో ఫోన్ పోగొట్టుకుని మళ్లీ ఉదయాన్నే వెతుక్కుంటూ వెళ్లి దొరకబట్టడం, మొండి భైరవుని కోన, సిద్ధేశ్వరం దగ్గర బుస్సా నాయుని కోట, చిలకలమర్రి దుర్గమ్మ కొండ, పాలకొండల్లోని బండేరు కోన, పెదగాడి, చెయ్యేరు వరదలప్పుడు రిస్క్ చేసి వెళ్లిన ఏకిరి పల్లె, సోమశిల వెనుక జలాల్లో చేపలు పట్టే వలస వాళ్లతో చేసిన పడవ ప్రయాణం, ఇలా ఎన్నెన్నో అనుభవాలు. పెన్నా నది బంగాళాఖాతంలో కలిసే చోటును వెతుక్కుంటూ ఊటుకూరు వెళ్లి వెన్నెల రాత్రుల్లో సముద్రాన్ని చూడటం అన్నీ వేటికవి ప్రత్యేక అనుభూతులే తప్పా కొలమానమంటూ లేదు.
లంకమల పరిరక్షణకై ప్రకతి ప్రేమికులతో
కలిసి నడిపిన ఉద్యమాలు ?
అడవులు అంటే కేవలం తిరగడం కోసం మాత్రమే కాకుండా మా వంతు బాధ్యతగా 'No Plastic Lankamala' పేరుతో లంకమల రామలింగేశ్వర ఆలయం పరిసరాల్లో గత మూడేళ్లుగా స్వచ్ఛందగా ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టాము. 2021 లో 22 మందితో మొదలై, 2022 కు 45 కు చేరి, 2023 కు 102 మంది వచ్చారు. బద్వేల్, సిద్ధవటం, మైదుకూరు మధ్య త్రిభుజాకారంలో ఉన్న లంకమల అడవి పరిధిలో మూడు ప్రదేశాలు తప్పా దాదాపూ అన్నీ చూశాం. త్వరలోనే అవి కూడా పూర్తిచేసి నల్లమల లేదా శేషాచలం వైపుగా అడుగులు వెయ్యాలి. ఇది ఇలాగే కొనసాగుతుంది. '×అ్శీ ుష్ట్రవ చీa్‌బతీవ' టీం తోడవ్వడంతో మరింత ఉత్సాహంగా సాగుతోంది. ఒక్క లంకమల అనే కాకుండా ఎవరైనా స్థానికులు ముందుకు వచ్చి వారి వారి ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం చెయ్యాలని సంప్రదిస్తే మా వంతు భాగస్వామ్యం తప్పక ఉంటుంది.
మీ నేపథ్యం, వత్తి వివరాలు కొంత తెలియజేయండి?
ఊరు వైయస్సార్ కడప జిల్లా, బద్వేల్ మండలం నందిపల్లె. చదువు మెకానికల్ ఇంజనీరింగ్. వత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రవత్తి అర్థమయ్యే ఉంటుంది. పూర్తిగా పల్లెటూరి వ్యవసాయ నేపథ్యం. ఇద్దరు అక్కలు. అమ్మ నాన్నలు ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటారు. అయిదు గేదెలు, ఒక ఆవు, ఒక కోడె దూడ ఉంది. వ్యవసాయం అంటే మరీ పెద్ద రైతులమేం కాదు. మా అబ్బ వాళ్లిచ్చిన ఎకరా, మా అమ్మానాయన కొన్న మరో ఎకరా. పెరిగి పోతున్న పెట్టుబడుల వల్ల వ్యవసాయంలో చిన్నకారు రైతులకు పెద్ద ఆదాయమేమీ ఉండదు గానీ మా అమ్మా నాయనల కోసం చెయ్యాల్సిందే. వాళ్లకు శ్రమ తప్ప ఖాళీగా ఉండటం తెలియదు. వాళ్ల శ్రమను గౌరవించాలి. పొలానికి మందు కొట్టడం, కావలి వెళ్లడం ఇంకా ఏవైనా అవసరమైనప్పుడు నేను కూడా చేస్తుంటా.
సాఫ్ట్‌వేర్‌గా ఉంటూ ఇన్ని వ్యాపకాలకు సమయం దొరుకుతుందా?
దొరకదు అనే ప్రశ్న లేదు నాకెప్పుడూ. అదీ కాక ఏ మిగతా ఎంప్లాయిస్‌కు లేనట్టు శని ఆదివారాల సెలవు ఉండనే ఉంది. ఆ సెలవులను వారి వారి అభిరుచులు, వెసులుబాట్లను బట్టి ఎవరికి వారు రకరకాలుగా వాడుతుంటారు. నేను ఇలా.
సాహిత్యంపై అభిరుచి ఎలా ఏర్పడింది?
బాల్యంలో ఏవో చదివినట్టు గుర్తు. నా అభిరుచితో చదవడం మొదలైంది మాత్రం 2014లో యండమూరి 'వెన్నెల్లో ఆడపిల్ల'తో. తర్వాత చదివిన 'అంతర్ముఖం' పెద్దగా అనపించ లేదు గానీ మూడో నవల 'ఆనందోబ్రహ్మ' లోని మందా కిని, యాజీల మధ్యన ప్రేమ, తాతయ్య పాత్ర, గోదావరి వర్ణనలు చదివాక ఒక రచన మనసుని ఇంత కదిలించగలదా అనిపించింది. అలా మొదలైన పుస్తక పఠనం నాలుగై దేళ్లు ఒక ఉద్యమంలా సాగింది. కేశవరెడ్డి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, బత్తుల ప్రసాద్‌ల రచనలు చదువుతూ ''కథలు ఎక్కడో పుట్టవు నీ చుట్టూ ఉన్న సమాజం నుంచే పుడ తాయి'' అని అర్థమయ్యాక ఫేస్బుక్ వేదికగా మా పల్లె భాషలో నా అనుభవాలను రాయడం తో మొదలైంది. అడవి, ప్రయాణాల వల్ల ఆ రచనలకు మరింత మేత దొరికింది. ఎక్కువగా అడవి, పల్లె, కుటుంబం, నీరు, వ్యవసాయం, మూగ జీవాలు, చరిత్ర, సంస్కతి మొదలైనవి కథా వస్తువులుగా ఉంటాయి.
సినిమా ప్రయత్నాలు ఏమైనా చేశారా?
బయట ప్రచారంలో ఉన్నట్టు రాయల సీమ అంటే ఫ్యాక్షన్, గూండా యిజం మాత్రమే కాదు 1990ల కాలం నాటి రాయలసీమ పల్లెటూరి ప్రేమ కథాంశంతో 'అరణ్యవాసం' అనే సినిమా చేశాం. దీనికి కథ, కథనం, మాటలు నేనే రాశాను. షూటింగ్ మొత్తం మా ఊరి చుట్టు పక్కలే పూర్తి చేశాం. డబ్బింగ్ పూర్తయింది. మిగతా పనులు జరుగుతున్నాయి. అందులో ఒక పాట కూడా రాశా. రాయల సీమ తత్వం కలగలిసిన ఆ లిరిక్స్ చూసి సింగర్ విజరు ప్రకాష్ మెచ్చుకుని శాలువా కప్పడం నేను మర్చిపోలేని జ్ఞాపకం. Forbidden Verse అనే కామిక్ బుక్కు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశాను. విడుదల త్వరలోనే ఉంటుంది. ఇంకో కొన్ని కథా చర్చలు నడుస్తున్నాయి.
మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారు?
To do list లో నచ్చిన పుస్తకాలు-సినిమాలు, సమాజం, రాజకీయాలపై నాదైన స్పందన, ప్రకతి ఒడిలో సేదతీరడానికి కొండ కోనలు, అడవులు, జలపా తాలు వాటితో పాటు మా రాయల సీమ పల్లెల్లో మనవంటూ కొన్ని కబుర్లు. ఇంతకు మించి ఇంకేం వద్దన్నట్టుగా ఉంది ప్రస్తుతానికి.
భవిష్యత్తులో వివేక్ లంకమలను ఇంకా ఏఏ కోణాల్లో చూడొచ్చు?
లంకమలలో నేను సంచరించిన అనుభవాల్ని పుస్తకంగా రాయాలని ఉన్నా. ఇవే కాక నా సజనాత్మక రచనలు, సినిమా ప్రయాణం... అనుకొంటున్నా. చూద్దాం. కాలం అన్నీ నిర్ణయిస్తుంది.