Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడి, ఆందోళనలు
మనసును చిత్తడి చేస్తుంటే
పుత్తడిలాంటి జీవితాన
భయం మత్తడై దూకుతుంటే
కన్న కలలన్ని కాలంతోపాటే
మెల్లిగా కరిగిపోతుంటే
ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో
తనువున రక్తం మరిగిపోతుంది..
ఏ క్షణాన ఏ దుర్వార్త
వినాల్సివస్తుందో
ఏ ఉదయం ఈ జీవితానికి
చరమాంకం పాడుతుందో,
ఏ రాత్రి కాళరాత్రియై తన
కబంధ హస్తాల్లో బంధిస్తుందోనని
క్షణమొక యుగంలా
ఈ విపత్తు సమయమొక
భయానక లోకంలా మారి
కంపింపజేస్తుంది..
అశేష జనవాహిని నిశ్శేషంగా
కాలం చేతిలో భాగింపబడుతుంటే
దినదినగండంతో, ప్రాణాపాయ
భయంతో ఆత్మవిశ్వాసం తీసివేతలా
ప్రతిరోజు తరిగిపోతుంది..
నిరాశనిస్పహలు కూడికలా
ప్రతిరోజు పెరిగిపోతుంటే
భయాందోళనలు గుణకారంలా
హెచ్చించబడుతున్నాయి
మానవత్వం ఒక అవశేషమై
మిగిలిపోతుంది..
జరిగిన దారుణకాండల్నిగాంచి
నిస్సహాయస్థితిలో ఉన్న కళ్ళల్లో
ఆశయ వత్తుల్ని వెలిగించి,
ఎద లోతుల్లో మిగిలిపోయిన
ఆత్మవిశ్వాసాన్ని పైకితెచ్చి,
ఎండిపోయిన ఆశలపై
ఆత్మస్థైర్య నీళ్లను చల్లి
ఈ లోకం శేషగీతం ఆలపిస్తుంది..
- సర్ఫరాజ్ అన్వర్.. 9440981198