Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాటంటే అతనికి ప్రాణం. కవిత్వం రాయనిపూట అతని ఊహలలోకం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. శరదృతువు మనసులకు ఏదో తెలియని అనుభూతిని కలిగించినట్టే ఇతని కవిత్వం కవితాప్రేమికుల హృదయాల్లో ఆహ్లాదాన్ని పెంచుతుంది. ఏ కవన కర్మాగారాల్లోను తయారవని నిక్కమైన నీలమతడు. లెక్కలేనన్ని పద్యాలను పుక్కిట బట్టిన అసామాన్యుడు . తండ్రికి తగ్గ తనయుడు. పలురకాల భావాలకు తనవైన పలుకులతో పందిళ్ళు అల్లగల సమర్థుడు. తన ప్రతిభతో మహామహుల మెప్పు పొంది, వారి చేత శభాష్!! అని పించుకున్న అసాధ్యుడు. కవిగా, సినీ గీతరచయితగా, పరిశోధక విద్యార్థిగా, పాటలను తన మాటలతో ఒప్పించి మెప్పించగల నేర్పరిగా, వ్యాఖ్యా తగా, రేడియో ప్రసంగకర్తగా, విద్యార్థుల మక్కువను చూరగొన్న మేటి ఆచార్యుడిగా అందరికి సుపరిచితులైన బహుముఖ ప్రజ్ఞాశాలి తిరునగరి శరత్ చంద్రతో ఈ వారం జోష్ ఇంటర్వ్యూ..
చాలా మంది కవుల రచనల్ని బాగా అధ్యయనం చేసేవాణ్ణి. అధ్యయనం చేసినంత మాత్రాన మన కవిత్వరచనలో కొత్తదనం దొర్లుతుందని కాదు. కాకపోతే అధ్యయనం వల్ల, ప్రముఖుల ప్రసంగాల వల్ల కొన్ని కవిత్వ నిర్మాణ రహస్యాలు తెలుస్తాయి. కవితను రాసిన తర్వాత మళ్ళీ మళ్ళీ శిల్పంలా తీర్చిదిద్దుకోవడం అలా అలవాటయ్యింది. మనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర ఉండాలనే ఆశయంతో కవితారచనలో తగిన జాగ్రత్తలు తీసుకునేవాణ్ణి.
నేను ముందు కవిని. తర్వాతే సినీకవిని. కవిగా కొంత గుర్తింపు వచ్చిన తరువాతే సినీరంగంలో అడుగుపెట్టాను.. కాబట్టి ముందుగా కవి అని పిలిపించు కోవడానికే ఇష్టపడతాను.
మీ కుటుంబ నేపథ్యం ?
నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని (ప్రస్తుత జగిత్యాల జిల్లా) కోరుట్లలో. నాన్న తిరునగరి శ్రీనివాసస్వామి, ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడు,కవి. అమ్మ మాధవి, చెల్లెలు శరణ్య. ప్రాథమిక విద్య కోరుట్లలోని ఆదర్శవిద్యాలయంలో, హైస్కూల్ గౌతమ్ ఉన్నత పాఠశాల, శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో చదివాను. కోరుట్లలోని శ్రీ విద్యార్థి జూనియర్ కళాశాలలో ఇంటర్మీ డియట్, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ సంస్క్రతాంధ్ర కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్ర్ కళాశాల నుంచి ఎం.ఏ తెలుగు పూర్తి చేశాను. ప్రస్తుతం ఉస్మానియాలోనే 'దాశరథి సినిమా పాటలలో కవితాత్మకత' అనే అంశంపై ఆచార్య సూర్యాధనంజరు గారి పర్యవేక్షణలో పిహెచ్.డి చేస్తున్నాను.
సాహిత్యం పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
మా నాన్న తిరునగరి శ్రీనివాసస్వామి గారు ప్రముఖకవి, సినీగీతరచయిత కావడం వల్ల నాన్న వెళ్ళే ప్రతీ సాహిత్య కార్యక్రమానికి నన్ను తీసుకెళ్ళేవారు. అలా చిన్నప్పటి నుంచే కవిసమ్మేళ నాలకు, మొ. సాహిత్యసభలకు వెళ్ళడం అలవాటయింది. అక్కడికి ఎందరెందరో ప్రముఖ కవులు, పాటల రచయితలు వచ్చేవారు. అలా మహాకవి సినారె, సుద్దాల అశోక్ తేజ, జె.బాపురెడ్డి వంటి పెద్దలెందరినో అతి దగ్గరగా చూసే అదష్టం నాకు లభించింది. వారి మాటలు వినడం అవి నాపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించడం, క్రమంగా వారి రచనలు చదవడం జరిగింది. ఇలా సాహిత్యంపై ఆసక్తి ఏర్పడింది. మా ఇంటికి దగ్గర్లోనే లైబ్రరీ ఉండేది. రోజూ వెళ్ళి అక్కడ తెలుగు సాహిత్యగ్రంథాలు తీసుకుని చదివేవాణ్ణి. అలా ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడిపే వాణ్ణి. తెలియని విషయాలు ఏవైనా ఉంటే నాన్నని అడిగి తెలుసుకునేవాణ్ణి. ఆవిధంగా సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడి, అందులో పూర్తిగా లీనమైపోయాను.
మీ కవిత్వం గురించి చెబుతారా?
నేను 7 వ తరగతి చదువుతున్నప్పటి నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టా.. అప్పుడు 'చిరుచిరునగవుల కవితా తలపుల' అంటూ ఒక కవిత రాసి నాన్నకు చూపించా.. నాన్న ఆ కవిత చదివి ఎంతో మెచ్చుకున్నారు. కవిత్వ మెళకువలు చెప్పారు. ఆవిధంగా మొదలైన నా కవిత్వప్రస్థానం గేయాలు, వచనకవితలు, గజళ్ళు, రుబాయీలు మొ.ప్రక్రియలుగా సాగింది..సాగుతూనే ఉంది. నా తొలికవితాసంపుటి 'అక్షరశిఖరం' 2019 లో హైదరాబాద్ లో తెలంగాణ సాహితి పక్షాన సుద్దాల అశోక్ తేజ గారు ఆవిష్కరించారు. మా నాన్న గారి పుస్తకం నా పుస్తకం ఒకే వేదికపై ఆవిష్కరించబడ్డాయి.
ఇప్పుడు చైతన్యలహరి(గజళ్ళు), విశ్వవీణ (రుబాయీలు), రెండు వచనకవితాసంపుటాలు ముద్రణలో ఉన్నాయి. అంతేకాకుండా నేను రాసిన 300 కవితలు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
మీ ధారణ శక్తి గొప్పది. వందలాది పద్యాలు కంఠతావచ్చు కదా అది ఎలా సాధ్యమైంది?
నేను 8 వ తరగతి చదివేటప్పుడు స్కూల్ లో మా తెలుగుసార్ పద్యపఠనం పోటీ పెట్టారు. ఎవరు ఎక్కువ పద్యాలు చదివితే వారికి ప్రత్యేకమైన బహుమతిని ఇస్తానన్నారు. రెండురోజులు టైం ఇచ్చారు. అందరూ పోటీకి సిద్ధమయ్యారు. అదేంటో కానీ అందరికంటే ఎక్కువ చదవాలన్న తపన నాకు. మా ఇంట్లో కూడా ప్రత్యేకమైన లైబ్రరీ ఉంది. ఇంటి పక్కనే లైబ్రరీ ఉంది. అలా పుస్తకాలన్ని అందుబాటులో ఉన్నాయి కదా అని పట్టుదలతో సాధన చేసి 100 పద్యాలు నేర్చుకుని అప్పజెప్పా. నాకే మొదటి బహుమతి వచ్చింది. అప్పుడు సార్ చాలా మెచ్చుకున్నారు. గొప్ప గొప్ప కవులంతా పద్యాలు, కవితలు బాగా చదివినవారే..చదివితేనే బాగా రాయగలరని అన్నారు సార్.. అలా... పద్యాలు నేర్చుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకుని ప్రాచీన,ఆధునిక కవులందరి పద్యాలు నేర్చుకున్నా..నేను ఎం.ఏ కి వచ్చేటప్పటికి 1000 పద్యాలు కంఠతా వచ్చేసాయి. నేర్చుకోవాలన్న తపన, సంకల్పం, తెలుగు సాహిత్యంపై నాకున్న ఇష్టమే నేను అన్ని పద్యాలు నేర్చుకోవడానికి కారణమైంది.
సినిమాపాటలపై పరిశోధనకు ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?
ఇంట్లో ఎక్కువగా నాన్నతో సినిమాపాటల గురించే చర్చించే వాణ్ణి. అలా చిన్నప్పటి నుంచే సినీసాహిత్యంపై ఎంతో మక్కువ ఏర్పడింది. కవిత్వం కంటే సినిమాపాట చాలా గొప్పది. సినిమాపాట రాయాలన్న, దానిపై పరిశోధన చేయాలన్న అదంత సులువైన పనికాదు. ఎంతో కషి అవసరమన్నారు నాన్న. అదే నేను సినిమాపాటలపై పరిశోధన చేయడానికి కారణమైంది. అంతేకాకుండా పత్రికల్లో సినిమాపాటల శీర్షికలు వస్తుండేవి. అందులో పాటరాసిన రచయిత, గాయకుల పేర్లు కూడా ఇచ్చేవారు. అవి కట్ చేసి దాచుకునేవాణ్ణి. టి.వి.లో సినిమా వస్తే స్క్రీన్ పై టైటిల్స్ లో.. పాటలు ఎవరు రాశారో చూసి ఆ కవుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసేవాణ్ణి.
ఒకవైపు సృజన, మరోవైపు పరిశోధన (కవి, కాలమిస్ట్, యాంకర్, రేడియో ప్రసంగకర్త, అసిస్టెంట్ ప్రొఫెసర్) ఇలా ఏకకాలంలో అన్ని పనులు చేయడం మీకెలా సాధ్యమైంది?
నాకు సాహిత్యంపై ఉన్న శ్రద్ధయే అందుకు కారణం. ఏకకాలంలో అనేక పనులు చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. కాసింత సమయాన్ని కూడా వధా చేసుకోకుండా ప్రణాళికా బద్ధంగా పనులు చేసుకోవాలే కాని అది ఎవరికైనా సాధ్యమే. విపరీతమైన పనుల ఒత్తిడి
ఉన్నా నాకు ఎప్పుడు కష్ట మనిపించలేదు..ఎందుకంటే ఇది నేను ఇష్టంతో చేసే పని కాబట్టి..
మీరు రాసే ప్రతీకవితలో ఏదో కొత్తదనం తొణికిసలాడుతుంటుంది. ఆకట్టుకునే ఎత్తుగడలు, మురిపించే ముగింపులు మీ సొంతం. అందుకోసం మీరేవైనా జాగ్రత్తలు తీసుకుంటారా?
చాలా మంది కవుల రచనల్ని బాగా అధ్యయనం చేసేవాణ్ణి. అధ్యయనం చేసినంత మాత్రాన మన కవిత్వరచనలో కొత్తదనం దొర్లుతుందని కాదు. కాకపోతే అధ్యయనం వల్ల, ప్రముఖుల ప్రసంగాల వల్ల కొన్ని కవిత్వ నిర్మాణ రహస్యాలు తెలుస్తాయి. కవితను రాసిన తర్వాత మళ్ళీ మళ్ళీ శిల్పంలా తీర్చిదిద్దుకోవడం అలా అలవాటయ్యింది. మనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర ఉండాలనే ఆశయంతో కవితారచనలో తగిన జాగ్రత్తలు తీసుకునేవాణ్ణి. ఆ తర్వాతే పత్రికకు పంపించేవాణ్ణి.
సినిమాపాటలపై నవతెలంగాణ సోపతితో పాటు మరో ప్రముఖ పత్రికకు కూడా కాలమ్ రాస్తున్నారు. దీనికి స్పందన ఎలా వస్తుంది?
అవును.. నమస్తే తెలంగాణ బతుకమ్మలో 'తెలంగాణ సిని మాకవులు' పేరిట కాలమ్ రాస్తున్నాను. చాలా విశేషమైన స్పందన వస్తుంది. తెలుగు సినిమా ఇండిస్టీలో ఉన్న అగ్రస్థాయి దర్శకులు, రచయితలు, నిర్మాతలు, నటులు కూడా చదివి నాకు ఫోన్లు చేస్తున్నారు. అంతేకాకుండా నవతెలంగాణలో పాటలముచ్చట కాలమ్ తో కూడా మంచి స్పందన వస్తుంది. తెలుగు సినిమాపాట గొప్పతనాన్ని చాటడానికి నేను చేస్తున్న చిన్ని ప్రయత్నమిది.
కొందరు పాటలు రాస్తారు. మరికొందరు పాటలకు మాటలు రాస్తారు. మీరైతే పాటలూ రాయగలరు, పాటలకు మాటలూ రాయగలరు. ఇలా సినిమా పాటపై ఇంతటి గట్టిపట్టును ఎలా సాధించారు?
నేను ముందు కవిని, గేయరచయితని. సినిమాపాటల్లోని కవిత్వాంశాల గురించి చర్చిస్తూ..అదే వాతావరణంలో పెరిగాను కాబట్టి పాటని సునిశితంగా విశ్లేషించే నేర్పు కూడా అలవాటయింది. అందుకే పాటలు రాయగలుగుతున్నా.. పాటలను విశ్లేషించ గలుగుతున్నా..
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినీకవి?
వేటూరి సుందరరామ్మూర్తి గారు.. తెలుగు సినీసాహిత్య ప్రపంచంలో ఆయనదొక శకం. అన్ని రకాల పాటలు రాయగలరు. ట్యూన్ కి వేగంగా పాటలు రాయడంలో దిట్ట. పద ప్రయోగ వైచిత్రిలో ఆయనది ప్రత్యేకముద్ర. వినగానే ఇది వేటూరి పాట అని తెలిసిపోతుంది. గీతరచయితగా సినీరంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి తన చివరి సినిమావరకు ఒకే రీతిలో ప్రవాహంలా అవకాశాలు అతనివెంట వచ్చిపడేవి..ఆయనకంత క్రేజ్ ఉండేది మరి..అందుకే ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం.. వారితో పాటు దాశరథి, సినారె, సిరివెన్నెల సీతారామశాస్త్రి మొ.వారు కూడా నన్ను ప్రభావితం చేసిన సినీకవులే..
ఇటీవల గానకోకిల ఎస్.జానకి గారు మీ పాట పాడినప్పుడు మీరు పొందిన అనుభూతిని వివరిస్తారా?
ఎస్.జానకి గారితో నాకు ముందు నుంచే ఆత్మీయానుబంధం ఉంది. ప్రియమిత్రుడు రేవంత్‌తో కలిసి వారి ఇంటికి కూడా వెళ్ళాను.వారిపై కవిత రాసి వినిపించాను కూడా. చాలా మెచ్చుకున్నారు.గొప్ప అనుభవజ్ఞులు రాసినట్టుగా ఉంది. భవిష్యత్తులో గొప్ప సినీకవివి అవుతావని ఆశీర్వదించారు. అంతేకాకుండా నేను రాసిన 'అలలవోలే అడుగులెత్తి సాగిపోనీ నీ గమనం' అనే ప్రబోధగీతాన్ని చూసి, మెచ్చుకుని, వారే స్వయంగా స్వరకల్పన చేసి పాడారు. సముద్రాల గారి తరం నుంచి ఈనాటి సిరివెన్నెల గారి వరకు ఎందరో మహామహాకవుల పాటలు పాడిన ఆ మహాగాయని నా పాట పాడడం నా జన్మజన్మల అదష్టం. నా ఆనందానికి అవధులు లేవు. ఇంకా చెప్పడానికి మాటలు లేవు.
స్వతహాగా మీరు మంచి కవి, దానికి తోడు సినిమాపాటలపైనే పరిశోధన, ఇవి మీరు సినీగీతరచయితగా ఎదగడానికి దఢమైన పునాదులని అనుకోవచ్చా?
అవును..ముమ్మాటికీ..
మీరు పొందిన అరుదైన గౌరవం?
2019 నవంబర్ 5 న మహాకవి దాశరథి వర్ధంతి సందర్భంగా పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు 'దాశరథి సినిమాపాటలు- సాహిత్యపు విలువలు' అనే అంశంపై ప్రసంగించమని నన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. నేను ఉస్మానియా యూనివర్సిటిలో పరిశోధక విద్యార్థి ని. ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉండి మరో విశ్వవిద్యాలయానికి అతిథిగా వెళ్ళి ప్రసంగించే అవకాశం రావడమనేది నా జీవితంలో అరుదైన గౌరవంగా భావిస్తాను.
ప్రస్తుతం మీరు రాస్తున్న సినిమాపాటల గురించి చెబుతారా?
ప్రముఖ దర్శకులు తల్లాడ సాయికష్ణ గారి దర్శకత్వంలో వస్తున్న 'నమస్తే సేట్ జీ' సినిమాలో వర్తకుల జీవనవిధానాన్ని, శ్రామిక విలువను చాటి చెప్పే ఒక పాటను రాస్తున్నాను. దీనికి కార్తీక్ కొడగండ్ల గారు సంగీతం. అలాగే సాయికష్ణ గారిదే 'సొగసు చూడ తరమా' సినిమాలో ఒక రొమాం టిక్ సాంగ్ రాస్తున్నాను. వి.ఆర్.ఎ. ప్రదీప్ , పవన్ గార్లు దీనికి సంగీతం అందిస్తున్నారు. అలాగే 'దక్ష - 302' లో ఒక పాట రాస్తున్నా..(దర్శకులు సాయికష్ణ) ఇంకా .. రమేశ్ రాజా గారి దర్శకత్వంలో వస్తున్న 'శుభలగం' సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ , తెలుగు సంస్క్రతిని చాటి చెప్పే పెళ్ళి పాట, ఒక విరహగీతాన్ని కూడా రాస్తున్నా...మరి కొన్ని సినిమాలకు కూడా రాస్తున్నా..
మీ కలమే కాదూ, గంభీరమైన మీ గళమూ ఓ అద్భుతమే. చక్కగా రాస్తారు. రాసిందాన్ని మరింత చక్కగా చదివే కళ మీలో ఉంది. దీని గురించి చెప్పండి?
విద్యార్థి దశ నుంచే సభల్లో సినారె లాంటి పెద్దల ప్రసంగాలు వినడం జరిగేది. వారిని అనుకరించడం అని కాదు కాని అలా గంభీరంగా చదవాలనే తపన ఉండేది నాకు. అందుకే కవిత రాశాక అద్దం ముందు నిలబడి నాకు నేనే కవితను గట్టిగా చదివి చూసుకోవడం, భావ ప్రకటన, ఉచ్ఛారణ బాగుందా.. లేదా.. అని నాకు నేను సాధన చేసుకోవడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగేది.
కవి, సినీకవి ఈ రెండింటిలో ఏది పిలిపించుకోవడానికి ఇష్టపడతారు?
నేను ముందు కవిని. తర్వాతే సినీకవిని. కవిగా కొంత గుర్తింపు వచ్చిన తరువాతే సినీరంగంలో అడుగుపెట్టాను.. కాబట్టి ముందుగా కవి అని పిలిపించుకోవడానికే ఇష్టపడతాను.
మీ రచనలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి కదా! వాటి గురించి వివరిస్తారా?
నా కవితల్లో కొన్నింటిని శాంతకుమారి గారు కన్నడంలోకి, డా.నాగపురి సంతోష్ గారు మరాఠీలోకి, అమోహ గారు ఉర్దూలోకి, ఎన్.విజరు గారు తమిళంలోకి అనువదించారు. ఇనుగుర్తి లక్ష్మణాచారి నా కవితల్లో చాలా వాటిని హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించాడు. అంతేకాకుండా 50 కవితలను Vవతీరవర శీట ్‌ష్ట్రవ ఔశీతీశ్రీస పేరిట ఇంగ్లీష్ లోకి అనువదించి ఒక పుస్తకంగా తీసుకొస్తున్నాడు. అది ఇప్పుడు ముద్రణలో ఉంది. ఇలా చాలా కవితలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి.
మిమ్మల్ని వరించిన పురస్కారాల గురించి చెబుతారా?
ఎం.ఏ లో యూనివర్సిటి ఫస్ట్ వచ్చినందుకు 2019 లో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాను. 2013 లో రాష్ట్రస్థాయి పద్యపఠన పోటీలో ప్రథమ బహుమతి, 2015 లో విజయవాడ చెలిమి సంస్థ వారి ఉత్తమ కవితా పురస్కారం, 2016 లో కరీంనగర్ లో ఏర్పాటు చేసిన కవితల పోటీలో గెలిచినందుకు కాళోజి కవితా పురస్కారాన్ని అందుకున్నాను. 2019 లో భిలాయివాణి వారి కవితల పోటీలో ప్రత్యేక బహుమతి, అదే సం. బి.ఎస్.రాములు స్ఫూర్తి పురస్కారం మొ. పురస్కారాలందుకున్నాను..
2019 నవంబర్ 5 న మహాకవి దాశరథి వర్ధంతి సందర్భంగా పొట్టిశ్రీరాములు
తెలుగు యూనివర్సిటీ వారు 'దాశరథి సినిమాపాటలు- సాహిత్యపు విలువలు' అనే అంశంపై ప్రసంగించమని నన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. నేను ఉస్మానియా యూని వర్సిటిలో పరిశోధక విద్యార్థి ని. ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉండి మరో విశ్వవిద్యాలయానికి అతిథిగా వెళ్ళి ప్రసంగించే అవకాశం రావడమనేది నా జీవితంలో అరుదైన గౌరవంగా భావిస్తాను.
విద్యార్థి దశ నుంచే సభల్లో సినారె లాంటి పెద్దల ప్రసంగాలు వినడం జరిగేది. వారిని అనుకరించడం అని కాదు కాని అలా గంభీరంగా చదవాలనే తపన ఉండేది నాకు. అందుకే కవిత రాశాక అద్దం ముందు నిలబడి నాకు నేనే కవితను గట్టిగా చదివి చూసుకోవడం, భావ ప్రకటన, ఉచ్ఛారణ బాగుందా.. లేదా.. అని నాకు నేను సాధన చేసుకోవడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగేది.
నన్ను బాగా ప్రభావితం చేసిన సినీకవి వేటూరి సుందరరామ్మూర్తి గారు.. తెలుగు సినీసాహిత్య ప్రపంచంలో ఆయనదొక శకం. అన్ని రకాల పాటలు రాయగలరు. ట్యూన్‌కి వేగంగా పాటలు రాయడంలో దిట్ట. పద ప్రయోగ వైచిత్రిలో ఆయనది ప్రత్యేకముద్ర. వినగానే ఇది వేటూరి పాట అని తెలిసిపోతుంది. గీతరచయితగా సినీరంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి తన చివరి సినిమావరకు ఒకే రీతిలో ప్రవాహంలా అవకాశాలు అతనివెంట వచ్చిపడేవి.. ఆయనకంత క్రేజ్ ఉండేది మరి..అందుకే ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం.. వారితో పాటు దాశరథి, సినారె, సిరివెన్నెల సీతారామశాస్త్రి మొ.వారు కూడా నన్ను ప్రభావితం చేసిన సినీకవులే..
ఎం.ఏ లో యూనివర్సిటి ఫస్ట్ వచ్చినందుకు 2019 లో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాను.
- ఎస్. సంజయ్ కుమార్
రీసెర్చ్ స్కాలర్, యూనివర్సిటి ఆఫ్ ఢిల్లీ