Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖుదా-ఎ-సుఖన్(God of poetry) గా పరిగణించబడే ఉర్దూ మహాకవి మీర్ తఖీ మీర్ 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఆగ్రాలోని ఒక సూఫీ ఫకీరు కుటుంబంలో జన్మించాడు. 80 ఏళ్ళ సుధీర్ఘ జీవితంలో సంతోషం కంటే విషాదమే ఎక్కువగా అనుభవించిన మీర, తన జీవితానుభవాలనే కవితా వస్తువుగా స్వీకరించాడు. పైగా మీర్ ఏది చెప్పినా సీదా-సాదా మాటల్లో సూటిగా చెప్పేవాడు. మీర్ భావుకత ఎంతో అపూర్వమైనది, అద్వితీయమైనది. మీర్ ఫార్సీ భాషలో కూడా మంచి పండితుడు. ఫైజ్-ఎ-మీర్, జిక్ర్-ఎ-మీర్, నుకత్-ఉస్-షోరా, కుల్లియత్-ఎ-మీర్, కుల్లియత్-ఎ-ఫార్సీ వంటి పెద్ద పెద్ద రచనలు చేసాడు. ఉర్దూ భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మీర్, తన తరానికి, తన తర్వాత తరాలకు గొప్ప మార్గదర్శకుడయ్యాడు. గజల్ ప్రక్రియ విశ్వవ్యాప్తం కావడానికి ముఖ్య కారకుడయ్యాడు.
మూలం :
హస్తీ అప్నీ హబాబ్ కీ సీ హై
యే నుమాయిశ్ సరాబ్ కీ సీ హై.
నాజూకీ ఉస్ కే లబ్ కీ క్యా కహియే
పంఖుడి ఇక్ గులాబ్ కీ సీ హై.
చశ్మ్-ఎ-దిల్ ఖోల్ ఇస్ భీ ఆలమ్ పర్
యా కీ ఔఖాత్ ఖ్వాబ్ కీ సీ హై.
బార్ బార్ ఉస్ కే దర్ పే జాతా హూ
హాలత్ అబ్ ఇజ్తిరాబ్ కీ సీ హై.
నుఖ్తా-ఎ-ఖల్ సే తిరా అబ్రూ
బైత్ ఇక్ ఇంతిఖాబ్ కీ సీ హై.
ఆతిశ్-ఎ-ఘమ్ మే దిల్ భునా శాయద్
దేర్ సే బూ కబాబ్ కీ సీ హై.
దేఖియే అబ్ర్ కీ తరV్‌ా అబ్ కే
మేరీ చశ్మ్-ఎ-పుర్-ఆబ్ కీ సీ హై.
''మీర్'' ఉన్ నీమ్ బాజ్ ఆంఖోం మే
సారీ మస్తీ షరాబ్ కీ సీ హై.
అనువాదం :
నా జీవితమే బుడగలాగ ఉన్నది
ఈ చిత్రమేమో ఎండమావిలాగ ఉన్నది.
మదువైన తన పెదాలను ఏమని అనాలి?
అవి ఒక గులాబిపూవు రెక్కళ్ళా ఉన్నవి.
నీ మనోనేత్రం తెరుచుకో, ప్రపంచాన్ని చూసుకో
ఇక్కడి హౌదా అంతా కలలాగ ఉన్నది.
పదే పదే తన తలుపు వైపు వెళ్తాను
పరిస్థితి ఇపుడు ఆగలేకుండా ఉన్నది.
కళ తెలిసిన కనులతో చూసినపుడు
నీ కనుబొమ్మ ఎంచుకున్న కవితలాగ ఉన్నది.
దుఃఖాగ్నిలో నా ఎడద ఎంత ఉడికినదేమో
చాలా సేపటి నుండి వాసన కబాబులాగ ఉన్నది.
ఇప్పుడు కనిపిస్తున్న ఆ మేఘాలను చూడు
ఎప్పుడూ ఏడుస్తుండే నా కనులలాగ ఉన్నవి.
''మీర్'' మత్తెక్కించే సగం మూసిన కన్నులలో
సరదా మొత్తం మధువులాగ ఉన్నది.
వైవిధ్యమైన నేపథ్యాలు కలిగి భావార్థాన్ని సక్రమంగా ప్రదర్శించగలగడమే గజల్ ప్రక్రియకున్న ప్రాథమిక ప్రత్యేకత. మీర్ రాసిన 300లకు పైచీలకు గజళ్లలో ఈ గజల్ విశిష్టమైనది. వాస్తవికత, తాత్త్వికత, వేదన, మైకం, ఉన్మాదం, విషాదం, అందాన్ని ఆస్వాదించే లక్షణం (Aesthetic sense) మొదలైన నేపథ్యాలున్న ఈ గజల్లోని షేర్లు, నిండైన గజలియత్ని ఇమిడ్చుకుని ఆకర్షించే పోలికలతో స్వతంత్రంగా నిలబడ్డాయి. మొదటి షేర్లో మీర్ మనిషి జీవన స్థితిని, లోకాన్ని దష్టిలో ఉంచుకొని రాస్తాడు. ప్రేయసి పెదాల అందాన్ని గులాబి రెక్కలతో వర్ణించే సంప్రదాయం మీర్ నుండే ప్రారంభమయ్యిందనే చెప్పాలి. తర్వాత ఇలాంటి వర్ణనలెన్నింటినో దాశరథి, సినారె వంటి బహుభాషా పరిజ్ఞానం కలిగిన కవులు తమ తమ భాషల్లో పరిచయం చేసారు. రెండవ షేర్లో ప్రేయసి పెదాల కోమలత్వాన్ని గులాబి రెక్కలతో పోల్చుతాడు. అలా ప్రేయసి అందంలో మునిగిపోయిన మీర్ ఉన్నట్టుండి 3వ షేర్లో విచిత్రంగా ''నీ మనోనేత్రంతో ప్రపంచాన్ని చూస్తే అంతా కలలాగా కనిపిస్తుందని'' చెప్తూ ఉన్నతమైనతత్త్వాన్ని సంభాషిస్తాడు. మొదట్లో చెప్పినట్టు గజల్ ప్రత్యేకత ఇదే. ఒక షేర్‌కి ఇంకో షేర్ కి అనుబంధం ఉండదు. ఐదవ షేర్లో చేసిన వర్ణన సాహిత్య పరంగా శ్రేష్ఠమైనది. సౌందర్య కోణంలో చూస్తే ప్రేయసి కనుబొమ్మ బైత్ లాగా ఉందంటాడు. బైత్ అనేది ఉర్దూలోని ఒక కవితా ప్రక్రియ. కనుబొమ్మను కవితగా అభివర్ణించిన మీర్‌లో కవిత్వ పిపాస ఏ స్థాయిలో ఉందో, కవిత్వమంటే మీర్‌కి ఎంత మక్కువో అవగాహన చేసుకోవచ్చు. ఆరవ షేర్లో విషాదాన్ని చాలా వైల్డ్‌గా వెల్లిబుచ్చాడు. ఎడబాటుకు లోనైన మీర్ హదయం భారమైన బాధననుభవించింది. అందుకే మీర్ ఆ దుఃఖాన్ని అగ్నితో పోల్చి హదయం మండడం కాదు సుమా!, ఉడికిందని అంటాడు. మీర్ కవిత్వంలో విషాద శిఖరాగ్రంలో ఉంటుంది. గజల్ అనువాదం విషయానికొస్తే, ఉపయోగించే భాషను, భావానికి తగట్టుగా, గజలియత్ని ప్రదర్శించేందుకు వీలుండేలా తీసుకున్నాను.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి,
సెల్ : 94410 02256