Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రార్థించే పెదవులకన్నా... సాయం చేసే చేతులు మిన్నా...'' అన్న మథర్ థెరిస్సా.. మాటలను నిజం చేస్తున్న వ్యక్తి...
సేవే అతని ప్యాషన్.. అనాథ పిల్లలకు చేయూత ఇవ్వడం.. విద్యా అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారత అతని
లక్ష్యాలు. బాల్యం నుంచే అభ్యుదయ భావాలున్న వ్యక్తి. తన వంతుగా సమాజం కోసం ఏదో చేయాలని నిరంతరం
తపిస్తున్నారు. ఆ ఆశయసాధన కోసమే 'ప్రేరణ' స్థాపించారు. కరోనా కాలంలో పేదలకు విశేషమైన సేవలు
అందిస్తూ... ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్న శరత్ సుదర్శి పరిచయం ఈరోజు జోష్‌లో...
నాన్న సుదర్శి కోటేశ్వరావు. ఇసీఐఎల్ ఉద్యోగి. అమ్మ కృపా, ఉపాధ్యాయురాలు. మా సొంత ఊరు ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, సంకువారిగుంట. నాన్న ఉద్యోగరీత్యా పెండ్లి కాకముందే హైదరాబాద్ వచ్చేశారు. దాంతో నేనూ, నా ఇద్దరు చెల్లెళ్ళు హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగాము. నాన్న సీఐటీయూలో పని చేసేవారు. కమ్యూనిస్టు అభిమాని, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. చిన్నతనంలోనే నాన్న ఆలోచనలు నన్ను ప్రభావితం చేసేవి. నాన్న పాటలు రాసేవారు. సాహిత్యంపై ఆయనకున్న అభిమానంతో నాకు ప్రముఖ బెంగాల్ కవి శరత్చంద్ర పేరు కలిసేలా శరత్ బాబు అని ఎంతో ఇష్టంగా పెట్టుకున్నారు.
నాన్నతో చర్చించేవాడిని...
1992లో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మిత్రులందరం కలిసి షటిల్ ఆడేవాళ్ళం. అందులోనే రాజకీయ చర్చలు కూడా వచ్చేవి. ఒకరోజు నా స్నేహితుడు 'ఏంటి ఈ రోజు అరిగిపోయిన చెప్పులు వేసుకొచ్చావు' అని తమాషాగా అడిగాడు. దానికి 'నేను ఇలాంటి అరిగిపోయిన చెప్పులు కూడా లేని పేదలు దేశంలో చాలా మంది ఉన్నారు' అంటే 'ఏంటిరా నక్సలైట్లా మాట్లాడుతున్నావు' అని నవ్వాడు. ఇలా దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడం ఇంటర్లో వున్నప్పుడు మొదలయింది. మా ఇంటికి ప్రజాశక్తి పేపర్ వచ్చేది. మా నాన్నతో పాటు చదువుతూ దేశ రాజకీయాలు, పోరాటాల గురించి అవగాహన పెంచుకున్నా. పేదరికం, అసమానతల గురించి నాన్న నాతో మాట్లాడుతుండేవారు. ఇవే విషయాలను నేను నా స్నేహితులతో పంచుకునేవాడిని. అప్పటి నుంచే పేదల కోసం పని చేయాలనే నిర్ణయానికి వచ్చాను.
నాన్న కష్టాలు తెలుసుకుని...
మా బాబాయి ఇంటికి వచ్చినప్పుడు చిన్నతనంలో నాన్న పడిన కష్టాలను చెప్పాడు. మా నాన్న డిగ్రీ తర్వాత ఈసీిఐఎల్లో ఉద్యోగానికి అప్లరు చేస్తే జాయిన్ కావల్సిందిగా ఓ లెటర్ వచ్చింది. ఆ లెటర్ కాస్త లేట్‌గా వచ్చింది. 24 గంటల్లో ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగంలో చేరాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. హైదరాబాద్ కొత్త. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడ వుండాలో తెలీదు. అప్పట్లో హైదరాబాద్ వెళ్ళి రావాలంటే కనీసం 50 రూపాయలన్నా కావాలి. అప్పు కోసం తాతయ్య చుట్టుపక్కల భూస్వాములందరినీ అడిగాడు. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. చివరకు ఎలాగో ఒకరు వడ్డీకి ఇచ్చారు. ఆ వడ్డీ కింద పొలంలో పనిచేయమని తాతయ్యతో రాయించుకున్నారు. అలా మా నాన్న ఉద్యోగంలో చేరడం మేము చదువుకోడానికి దోహదపడింది.
విద్యుత్ ఉద్యమ ప్రభావంతో...
అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు, నాన్న పట్టుదల, నమ్మిన సిద్ధాంతం, క్రమశిక్షణ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నాన్న కష్టం ఫలితంగానే మా పెద్ద చెల్లి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా, చిన్న చెల్లి ఆయుర్వేదం డాక్టర్‌గా స్థిరపడ్డారు. నేనూ నాన్నలా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించాలని నిర్ణయించుకున్నాను. ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్‌సర్వీస్ రాసి ఆఫీసర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలనుకున్నా. ఓసారి రాస్తే ర్యాంక్ రాలేదు. ఆ సమయంలోనే జయప్రకాష్ నారాయణ లోక్‌సత్తా పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని తెలిసి ఓ నెల రోజులు వారితో కలిసి పని చేశా. ఎందుకో అది పెద్దగా రుచించలేదు. అప్పుడే 'చలో అసెంబ్లీ' అని పేపర్లో చదివాను. దాని గురించి అప్పట్లో ఏమీ తెలియకపోయినా అందులో పాల్గొనాలనీ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇందిరాపార్క్ వెళ్ళాను. అక్కడ పోలీసులు ర్యాలీలో పాల్గొన్న వాళ్ళను బాగా కొట్టారు. అది విద్యుత్ ఉద్యమం. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జరిగిన పోరాటం. న్యాయం కోసం పోరాడుతుంటే ఎందుకు కొడుతున్నారూ అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నాన్నతో కూడా దీని గురించి మాట్లాడాను. న్యాయం కోసం పోరాడే వాళ్ళతో కలిసి పని చేయాలని నిర్ణయించుకుని. ఇసీఐఎల్ల్లో ఉన్న వాళ్ళ ఆఫీసు వెదుక్కుంటూ వెళ్ళా. అక్కడ నాన్న స్నేహితులు, సీఐటీయూ నాయకులు యాదగిరిరావు గారు కలిస్తే విషయం ఆయనకు చెప్పాను. ఆయనే నాకు ఎస్ఎఫ్ఐ గురించి చెప్పారు. నేను అనుకున్నట్టు పేదలకు సేవ చేయాలంటే ఇదే మంచి మార్గం అని నిర్ణయించుకుని అందులో చేరిపోయాను.
ఇంట్లో భయపడ్డారు
పేద విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ చేస్తున్న కార్యక్రమాలు బాగా నచ్చాయి. ఐఏఎస్ ఆఫీసర్ కన్నా ఇలా రాజకీయాల్లో పని చేయడం ద్వారానే ప్రజలకు నిజమైన సేవ చేయవచ్చుని బలంగా అనిపించింది. దాంతో అందులోనే పూర్తికాలం కార్యకర్తగా చేరిపోయా. ఇంట్లో చాలా భయపడ్డారు. వెనక్కి వచ్చేయమని గట్టిగానే చెప్పారు. కానీ నా పట్టుదల చూసి చివరకు ఒప్పుకున్నారు. పెండ్లి విషయంలో కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాతోపాటు విద్యార్థి ఉద్యమంలో పని చేసిన టాన్యను ఆదర్శ వివాహం చేసుకున్నా. తను కూడా నేను చేసే సేవా కార్యక్రమాలకు ఎంతో సహకరిస్తుంది. విద్యార్థి సంఘానికి హైదరాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసి 2007లో ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యాను. ఆ తర్వాత సీఐటీయూలోకి వచ్చాను.
కార్మికుల సమస్యలపై విస్తతంగా పనిచేసే అవకాశం వచ్చింది.
మనసుకు నచ్చకపోయినా...
కార్మిక సమస్యల పరిష్కారమే ప్రపంచంగా పని చేస్తున్న సమయంలో నాన్న(2010)లో చనిపోయారు. మాకు ఓ చిన్న పాఠశాల ఉండేది. నాన్న ఉన్నన్ని రోజులు దాని గురించి నేను పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం రాలేదు. తర్వాత అనివార్యంగా బాధ్యతలు పెరిగాయి. ఇంట్లో నా అవసరం పెరిగింది. అయినా 2014 వరకు ఇటు కుటుంబాన్ని, అటు ట్రేడ్ యూనియన్ కార్యక్రమాలను బ్యాలెన్స్ చేస్తూ నెట్టుకు వచ్చాను. ఆ తర్వాత అమ్మ ఆరోగ్యం పాడయింది. స్కూలు నడవడం కష్టమయింది. దాంతో మనసుకు నచ్చకపోయినా అనివార్యంగా పూర్తిగా స్కూల్ బాధ్యతల్లోకి వచ్చేశాను.
'ప్రేరణ' ఏర్పడింది ఇలా...
అప్పటి వరకు ప్రజాసంఘాల్లో వున్న నాకు కేవలం స్కూలుకే పరిమితం కావడం నచ్చలేదు. అప్పుడప్పుడు మా ఏరియాలోనే యూనియన్ కార్యక్రమాలకు సమయం కేటాయించేవాడిని. జనవిజ్ఞాన వేదికలో కూడా పని చేశాను. సమాజానికి ఇంకా ఏమైనా చేయాలనే ఆలోచనతో కుటుంబ సభ్యుల సహకారంతో 2014లో 'ప్రేరణ' ఏర్పాటు చేశాను. దాని ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలకు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనుకున్నా. గత ఏడేండ్ల నుండి స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు చేశాము.
ప్రేరణ కార్యక్రమాలు...
ప్రతి సంవత్సరం పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన ఐదుగురు నిరుపేద విద్యార్థులకు ఇంటర్ విద్యను ఉచితంగా అందిస్తున్నాము. ఫౌండేషన్ ప్రారంభించన నాటి నుంచి 30 మంది అనాథ బాల బాలికలకు 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు బట్టలు, పుస్తకాలు అందజేస్తున్నాం. 2014 నుంచి 2017 వరకు గృహహింస, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని నడిపాము. 60 మంది మహిళలకు ఐదు నెలల పాటు ఉచిత కుట్టు శిక్షణా తరగతులు నిర్వహించాము. కోర్సు పూర్తి చేసి అత్యంత ప్రతిభ కనబరిచిన 15 మంది పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందజేశాము. ఫ్యాషన్ డిజైనింగ్‌లో 15 వారాల పాటు ఉచిత శిక్షణ ఇచ్చాము.
సాహిత్య పరంగా...
కరోనా సమయంలోనే రాయడం కూడా మొదలుపెట్టాను. కరోనా వల్ల అన్ని రంగాల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నా మనసుకు అనిపించిన వాటిని కవితలుగా రాసి ఫేస్బుక్లో పెడుతున్నాను. కరోనాపైనే 47 కవితలు రాశాను. వాటన్నింటినీ కలిపి త్వరలోనే పుస్తకంగా తీసుకురాబోతున్నాను. గత సంవత్సర లాక్డౌన్ సమయంలో తెలంగాణ సాహితీ, ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికుల సమస్యలపై కవితల పోటీ కూడా నిర్వహించి బహుమతులు ఇచ్చాము. ఇందులో 400 కవితలు వచ్చాయి.
మహిళా సాధికారతకై
సాధికారత అంటే కేవలం ఆర్థికంగా బలపడడమే కాదు.
సమాజం పట్ల అవగాహన, చైతన్యం, మహిళల్లో ప్రశ్నించేతత్వం పెరగడమే నిజమైన సాధికారత. అందుకే మహిళల్లో,
అమ్మాయిల్లో చైనత్యం రావాలని అంతర్జాతీయ మహిళాదినోత్సవం,
ప్రముఖ మహిళల వర్థంతులు, జయంతుల పురస్కరించుకుని సెమినార్లు,
సదస్సులు తరచూ నిర్వహిస్తున్నాం. అలాగే ఆటల పోటీలు, ముగ్గుల
పోటీలు, బతుకమ్మ సంబరాలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు
కూడా ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. వరదలు వచ్చినప్పుడు విరాళాలు
సేకరించి ఇవ్వడం, స్వైన్ ఫ్లూ మందుల పంపిణీ వంటివి
చేశాము. కేరళలో వరదలు వచ్చినపుడు 64 వేల రూపాయలు
విరళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించాము.
కరోనా సమయంలో...
కరోనా సమయంలో చేసిన సహాయ కార్యక్రమాలు గత కార్యక్రమాల కంటే మనసుకు ఎంతో తప్తినిచ్చాయి. కరోనా సమయంలో పేదలు, వలస కూలీల కష్టాలు చూసినపుడు కన్నీళ్ళు ఆగలేదు. ఎండను సైతం లెక్క చేయక పసిపిల్లలతో కాలినడకన బయలుదేరారు. చావైనా బతుకైనా సొంత వాళ్ళతోనే అంటూ రోడ్లపైకి వచ్చారు. ఇవన్నీ చూసి నా వంతుగా ఏదో చేయాలని తపన. కోవిడ్ - 19 సందర్భంగా హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో మూడు వేల మంది వలస కార్మికులకు, పేదలకు ఉచితంగా కూర గాయాల పంపిణీ చేశాము. మన కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేస్తున్న పారిశుద్ధ కార్మికుల్లో 50 మందికి నిత్యా వసరాలను పంపిణీ చేశాము. అలాగే 100 మంది ఆశా వర్కర్లకు, ఏఎన్ఎమ్లకు కోడిగుడ్లు అందించాము. అదే సమయంలో వలస కార్మికులతో సమానంగా ఇబ్బంది పడుతున్న ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయులు. అందుకే స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో 150 మంది ఉపాధ్యాయులకు నిత్యావసరాలు అందించాము. సెకండ్ వేవ్‌లో పేదలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. వారు పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్నారు. అది గమనించి గత 15 రోజులుగా ఈసీ నగర్‌లోని కరోనా టెస్ట్ సెంటర్ వద్ద పాజిటీవ్ వచ్చిన వారికి 'హెల్త్ ఇమ్యూనిటీ కిట్స్' అందజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీంటికీ సహకరిస్తున్న దాతలకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
- సలీమ