Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాండలిక భాషా సొగసును సమర్థవంతంగా వాడుకునే కవులు అరుదు. సాధారణ మాటలను కవిత్వీకరించే క్రమంలో కవి ప్రాంతీయ భాషను, నుడికారాన్ని వాడుకుంటూ కవితను అల్లుకుంటూ సాగుతాడు. తద్వారా పాఠకుల హదయాలకు కవి చేరువవుతాడు.
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నాగిళ్ళ రమేష్. వత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కవిత్వంలోకి తెలంగాణ మాండలిక భాషను తర్జుమా చేస్తున్న యువకవి. చిన్ననాటి నుంచే ఎత్తొంపుల జీవితం ఆయనది. అనుభవించిన ఆ ఎత్తొంపులను వాక్యాలుగా పరచి పల్లె కవిత్వమై ప్రవహిస్తున్నాడు. పరిశోధకుడిగా కూడా రాణిస్తున్న
నాగిళ్ళ రమేష్తో ఈవారం నర్రా అభిముఖం...
1. మిమ్మల్ని కవిత్వం వైపు మళ్లించిన సంఘటనలు ఏమిటి? మరచిపోని జ్ఞాపకాలేమైనా...?
నలభై యేండ్ల సంది పాలేరుగా జేసిన తండ్రి పాదం, అవ్వ తోటి కైకిలికి వోయి రాంగ పరిగె ఏరుకుంట మడికట్ల పొన్న పదును వాసనను పీల్చుకుంటూ మురిసిన జ్ఞాపకం, గూడెల్లి పటేండ్లకు, చాడోల్లకు, బొల్లమోల్లకు, ఎలుమ దొరలు గుజ్జోల్లకు, నాయనకు సద్ది కొనవోవడం మరచిపోలేని గుర్తులు... ఇట్లా మలెసుగున్నై. మళ్ళవోతే కేశవపట్నం, కాశిబుగ్గ, పున్నేలు, దేశారు పేటలల్ల నాయన తోటి ఇటుక బట్టీల సంచారం. అక్క వాకిల్లు ఊడ్సి వచ్చిన పైసలతోని మా ఊరి శావుకారి మాడిశెట్టి మహేందర్ దగ్గర బుక్కులు కొనిచ్చి, మంచిగ సదువుకోవాలన్న బుద్ది మాటలు. అవ్వకు కిడ్నీ కరాబ్ ఐనప్పుడు ఆపరేషన్ కు సహకరించిన రాంరెడ్డి డాక్టరు, వసుమతి దొరసాని. ఇంగ దసరా పండుగకు కనీసం ఒక కొత్త అంగైనా కుట్టియ్యమని ఇంట్ల ఏడ్సుడు...మా ముత్యాలమ్మ కుంట, పంగిడి గుట్టల పొన్న బర్లను మేపుకుంట గుట్టదోనెలోని మందాలున్న చోట నీల్లు తాగడం... ఈ రకంగా నా బాల్యంలోని ప్రతి సంఘటనా నాకు ఒక గురువు, ఒక పాఠం. మరచిపోలేని జ్ఞాపకం. మా ఊరి మనుషులు, ఆ వాతావరణపు వెలుగులలో నుంచే నా కవిత్వమైనా,నా ఉద్యోగ ప్రస్తానమైనా.
2. మీ 'ఉద్దరాశిపూలచెట్టు' కవిత్వంలో వస్తువైవిధ్యం స్పష్టం. ఇందులో చందమామ గురించి రాసిన కవిత ''మొగులు మీది పటువ'' ప్రత్యేకతను చెప్పండి?
ఈ కవిత నిర్మాణపరంగా చూస్తే దశ్యాలుగా సాగిన కవిత. పూర్వకవులకు భిన్నంగా సందమామను పోల్చిన విధానం మనం చూస్తాం. ఆనిగెపు పూతల్ల పాటిచ్చి సూసి సగం అండుకొని, సగం వొరకు పెట్టుకున్న గుండ్రటి వక్కతో, సొప్పగూడుతో, సుట్ట బట్టతో, తెల్లటి తరుపు దూడతో ఇలా వివిధ రకాల ప్రతీకలతో సందమామను గురించి చెప్పుతూ శ్రమ జీవన సౌందర్యంను, అస్థిత్వాన్నీ చెప్పిన. ''గొడ్డును గోసిన్నాడు/తడుకకు పూసె కొవ్వు/పర్ర సందమామ'' ఇలాంటి కవితాపంక్తులు గలదా కవిత. చాలా మంది ఇష్టపడ్డ కవిత ఇది.
3. ఈ కవితాసంపుటిలో అడవిని పలవరించిన విధానం ఎక్కువగా ఉంది! గర్జనపల్లి,ఎల్లారెడ్డిపేట ప్రాంతం అడవి మీకు ఇచ్చిన స్ఫూర్తి? నేర్పిన పాఠం?
పదేండ్లు అక్కడి అడవి నాతో మాట్లాడింది, నేను అడవితో మాట్లాడిన. నా పాదం అడవిని ముద్దాడడం నేను గర్వంగా చేప్పేకునే అంశం.ఆ పట్టె మనుషులు కుడుమంటే పండుగంటరు. స్వార్థం తెలియనోల్లు. అక్కడ ఊరురా ఉన్న స్థూపాలు పోరాట చరిత్రను తెలుపుతై. దుమాల, మానాల, నూకలమర్రి, నాగంపేట మొదలైనవి. ఆ జాగ చైతన్య దీపదారి. ఇలా ఆ అడవి నాకు స్ఫూర్తినిచ్చింది. కవిత్వానికి పాఠమైంది. కాబట్టే నా కవిత్వంలో ఈ అంశాలన్నీ వచ్చి చేరినై.
4. మీ కవిత్వంలో రాజ్యం పోకడలను నిరసించే వాక్యాలున్నాయి. వాటి గురించి చెప్పండి?
కడుపు కోతల పత్తా, కడగొట్టు బతుకమ్మ లాంటి ప్రశ్నాపూరితమైన కవితలే అందుకు ఉదాహరణలు. రాజ్యపు ఇలవర్శెను చూపినవవి. 'కడగొట్టు బతుకమ్మ కవిత'లో ''గడ్డిపువ్వు బతుకమ్మ కెక్కుతది/తంగెడు పువ్వు బతుకమ్మ కెక్కుతది/మా బతుకు రాజ్యాధికారం మీదకెక్కనప్పుడు/మా బతుకుల్ల బతుకమ్మెట్లవుంటదో చెప్పుండ్రుల్ల'' అని గొంతెత్తిన వాక్యాలు వున్నై.
5. మీరు కవితలకు శీర్షికలు వినూత్నంగా పెడతారు కదూ! వినూత్న శీర్షికలకున్న ప్రాధాన్యత ఏమిటి?
పిడికె కున్నె, ఎన్నెల కుంపటి, మంచుపూల దుప్పటి,దసన్న పూల తొవ్వ,గోగుపూల వాకిలి, కుదురు, ఇప్పపూల దారుల్లో...వంటి శీర్షికలు నా కవితలకు ఉన్నవి. శీర్షిక వల్లనే కవిత సగం మెరిసిపోతది. అలాగే రాసిన వాక్యంను మాగవెట్టాలి. దీన్ని పెద్దవాళ్ళ నుండి గ్రహించిన.
6. కవితావస్తువుల దష్ట్యా మీరిష్టపడే, మీకు అవసరమయ్యే అంశాలు ఏమిటి?
'సాయారం' కవితలో లోతైన అంశాలు వున్నై. ''ఎండ పొడకు దండంబెట్టిన నారుమడికన్న/ కాలాన్ని, కన్నీళ్ళు సూపెట్టే/ జీవితార్థమేమున్నది?/ పెంచినోని బిరుజు కాపాడిన వరిగొల్కల కన్న/ ఆత్మగల్ల పేగేమున్నది?/ తేటగా కనిపించే గట్టి గింజలకన్న/ బతుకు సాయారమేమున్నది? ''అని వ్యవసాయ జీవితంలోనుండి సారంను ఒంపుకొవడం చాలా చాలా ఇష్టం. మొత్తంగా పల్లె, ప్రకతి, పచ్చని వండ్లగింజల వంటి మనిషులంటే ఇష్టం. అణువైన చోటల్లా వీటిని కవితావస్తువులుగా వాడుకుంటాను నేను.
7. బడి పిల్లలకవిత్వంను ''మిణుగురు పూలు'' పేరిట సంకలనం తేవటంలో ఉన్న ఉద్దేశ్యం?
2018 లో బడి పిల్లగాండ్ల కవిత్వం తేవడం నా జిమ్మకు తుర్తినిచ్చింది. యం.ఏ లో వున్నపుడు మా భూమయ్య సారు 'తెలుగు నందనం' పేరుతో మాతో వ్యాసాలు రాయించి అచ్చు వేయించడం దీనికి ప్రేరణ. పిల్లలను సజనరంగం వైపుకు మరల్చడం దీని ప్రధాన ఉద్దేశం. గర్జనపల్లి పాఠశాల పిల్లలు చాలా మాండలిక భాషా పదాలను పరిచయం చేసిండ్రు. నా పది సంవత్సరాల వత్తి జీవితంలో ఈ సంకలనం గొప్ప జ్ఞాపకం.
8. తెలంగాణ వాడుకభాషే కవిత్వం అంటారా? అయితే ఏట్లా అవుతుంది?
అవును.నిజానికి తెలంగాణ వాడుకభాషే కవిత్వం. ఉదాహరణకు ఇంటి ముందుకు ఒక బిచ్చగాడు వస్తడు. ఇంత అన్నముంటే ఎయి, కూరవుంటే
ఎయి అంటడు. ఇంట్లో వుండే అవ్వ ఏం లేదు పో అంటది. ఐనా అతడు ముత్యమంతైన ఎయిమంటడు. అవ్వ వాసనకు సుత లేదు పొమ్మంటది. ఈ సంభాషణలో కొంచె మన్న అనే పదానికి బదులు ముత్య మంత, వాసనకు అనే పదాలు కూడా గొప్పగా అనిపిస్తున్నై. ఇట్లా తెలంగాణ వాడుక భాషే నా కవిత్వంగా చెప్పవచ్చు.
9. తెలంగాణలో వర్తమానకవులు ఇంకా గ్రామీణ అనుభవాలు రాయడానికి కారణాలు ఏమిటంటారు?
తెలంగాణ వాళ్ళు ఇంకా గ్రామీణ అనుభవాల్లోనే వున్నరు. పెద్దలు యన్ .గోపి సార్ లాంటి వాళ్ళు 'గోడల్లోనే అద్దం ఉన్నది' అంటరు ఓ కవితలో. తెలంగాణలో గ్రంథస్తం చేయవలసిన జీవితం, సందర్భాలు చాలా ఉన్నయి. ఒకప్పుడు ఇక్కడి జీవితాన్ని ప్రచురించలేని పత్రికలుండడం మన వెనుకబాటుతనానికి కారణం. వర్తమాన కవులు తెలంగాణ సాహిత్య చరిత్రకు చేర్పు, కూర్పు ఏమి కాదు. ఖాళీని పూరించడం కోసం దేవులాట మాత్రమే. వర్తమానికులు తెలంగాణ రాజకీయ జీవితం రాయడానికి ఇంకా సమయం పడుతది. తెలంగాణ భవిష్యత్తు ఎట్లా వుండాలన్న దాని మీద కవిత్వం రావల్సివుంది.
- నర్రా ప్రవీణ్ రెడ్డి