Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళిత సాహిత్యంలో కొత్త బాటలు పరుస్తున్న సృజనశీలి గుడిపల్లి నిరంజన్. కవిగా, కథకునిగా, పరిశోధకుడిగా మరీ ముఖ్యంగా బుద్ధిష్ట్ గా విలక్షణమైన జీవనం సాగిస్తున్న నిరంజన్ అసలు పేరు కొడిదల నిరంజన్. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన గుడిపల్లి వారి స్వగ్రామం. సుదీర్ఘకాలంగా రచనారంగంలో కృషి చేస్తున్న ఆయన అధ్యయనం, అనుశీలనం మార్గాలలో పడి రానురానూ తెలంగాణా సాహిత్యంలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకునే పనిలో పడ్డాడు. పొద్దైంది, ఎరుక, నిట్టాడి, లందపొద్దు, ఎడిగెల రచనల్లో ఆయన బుద్ధిష్ట్ ధోరణి కనిపిస్తుంది. దళిత, బహుజన అంశాలతో పాటు ఎస్సీ వర్గీకరణపై కూడా కవిత్వం వెలు వరించి సాహిత్యంలో కొత్త పాదులు తీస్తున్న గుడిపల్లి నిరంజన్ తో ఈ వారం కవి, పరిశోధకుడు నర్రా అభిముఖం....
8 మీ కవిత్వానికి తాత్విక పునాది బుద్ధిజం అనగా విన్నాను.! అయితే ప్రస్తుత సమాజానికి అది ఎంతవరకు మేలు చేస్తుంది?
నిజమే 100శాతం నా కవిత్వానికి పునాది బుద్ధిజం. 2000ల సంవత్సరాలకు పైగా, భారతదేశంలోనే కాదు, ఆ మాటకొస్తే ప్రపంచ సామాజిక, సాంస్కృతిక రంగాలను విశేషంగా ప్రభావితం చేసిన ధర్మం 'బౌద్ధ ధర్మం'. బుద్ధిజం సమతాధర్మంపై ఆధారపడి ఉంది. బుద్ధుడి సమతాధర్మం మనం పాటిస్తే గౌరవించబడుతాం. ఇతరులను గౌరవిస్తాం. నా దృష్టిలో మిగతా సిద్ధాంతాలకు బుద్ధిజానికి తేడా ఏమిటంటే, మనిషి గౌరవానికి బుద్ధిజంలో గొప్ప స్థానం ఉంది. మనిషి కేంద్రంగా ఉన్న ధర్మం బుద్ధిజం మాత్రమే. హిందూమతంలో కులాలను పుట్టించి, అంటరానితనం వ్యాపింపజేసి మనిషికి మకిలీ అంటించారు. మనిషిని ఘోరంగా అవమానించారు. కాబట్టి ఇవన్నీపోయి అసమానతల దొంతర్లుగా ఉన్న భారతీయ సమాజాన్ని సమతాసమాజంగా నిర్మాణం చేయాలంటే బుద్ధిజమే శరణ్యం. అందుకే నా 'ఎరుక' బహుజనమహోద్యమ దీర్ఘకావ్యంలో బుద్ధుడు చెప్పిన సూత్రాలను అక్షరబద్ధం చేసి కవిత్వం చేసిన.
8 'నిట్టాడి' దీర్ఘకవిత్వానికి ప్రేరణ ఏమిటి?
'నిట్టాడి' దీర్ఘకవితకు ప్రేరణ అబ్దుల్ కలాం శాస్త్రీయజీవితం, విజయాలు. డా|| ఏపీజే అబ్దుల్ కలాంను బహుజన శాస్త్రవేత్తగా భావించాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జీవితాలు ఉత్పత్తి జీవితాలు. ఉత్పత్తి అంతా కూడా శాస్త్రీయత పైననే ఆధారపడి ఉంటుంది. కులవృత్తి ,కులపరికరాలు అన్నీ కూడా శాస్త్రీయత పైననే ఆధారపడి ఉంటాయి. బహుజనుల వృత్తి కేవలం కుటుంబపోషణకే కాకుండా దేశరక్షణకు కూడా ఉపయోగపడే శాస్త్రీయ భావాలు కలది. కాబట్టే వీరిలో ఆయుధాలు తయారుచేసే ఓర్పు,నేర్పు ఉన్నవి. ఇదంతా అబ్దుల్ కలాం జీవితం చాటి చెబుతుంది. నేను అబ్దుల్ కలాంని బహుజనుల శాస్త్రవేత్తగా స్థిరపరచాలని ప్రయత్నించాను. అందులో భాగంగా అబ్దుల్ కలాం జీవితం, శాస్త్రీయ కృషి, విజయాలు కవిత్వీకరించాను.
8 'ఎరుక' దీర్ఘకవిత్వం ప్రకటన వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?
నిజానికి బౌద్ధం జంబూద్వీప ధర్మంపై ఆధారపడి వెలుగొందింది. ప్రతిమనిషిపై తనకంటే ముందు జీవించిన మహనీయుల ఆలోచనల జ్ఞాన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అట్లా బుద్ధునిపై జంబూద్వీప రాజ్య నిర్మాత అయిన జాంబవంతుడి ప్రభావం, స్ఫూర్తి ,ప్రేరణలు ఉన్నాయి. బుద్ధుడికి కలిగిన జ్ఞానం అంతా కూడా జంబూద్వీప గణరాజ్య జ్ఞానమే. కాబట్టి బుద్ధుడికి గాడ్‌ఫాదర్ జాంబవంతుడు. నేను నా 'ఎరుక' బహుజన మహోద్యమ దీర్ఘకావ్యంలో జాంబవంతుడి నుంచి బుద్ధుడు, అశోకుడు, సంత్ రవిదాస్, సంత్ కబీర్ దాస్, మహాత్మా జ్యోతిరావుపూలే, అంబేడ్కర్, కాన్షీరాంలు నడిచిన బహుజనబాటను అంటే ఐదువేల సంవత్సరాల బహుజనచరిత్రను దీర్ఘకావ్యంగా రాశాను. బహుశా కవిత్వంగా ఇది మొదట నేనే చేశానేమో.
8 పాలమూరు జీవననేపథ్యం మీ కథల్లో కవితల్లో ఎట్లా ప్రతిఫలిస్తుంది?
ప్రపంచీకరణ విధ్వంసంలో ఎక్కువగా ధ్వంసం అయ్యింది మా పాలమూరు జిల్లా జీవితమే. ఇక్కడి జీవితం ఎండిపోయిన పంటలాగా వట్టిపోయి ఉంటుంది. దేశవ్యాప్తంగా వలసకూలీలు పొట్ట చేత పట్టుకొనిపోయే దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణం. ఆత్మహత్యలు కూడా దైనందిన కార్యకలాపాలుగా కొనసాగుతాయి. కరువు, వలస వీటి గురించి రాయకుండా, మాట్లాడకుండా ఏ పాలమూరుకవి ఉండలేడు. నేనూ అంతే. నా 'లందపొద్దు' కవిత్వంలో పాలమూరుజీవితం రేఖామాత్రంగా కనపడుతుంది. సీజ్ ది సెజ్, పుట్టినందుకు సిగ్గుపడుతున్నా, పోరుకేక వేస్తున్నా, శవాలైన మనుషులు మొదలైన కవితలు పాలమూరుజీవితాన్ని పట్టిస్తాయి. నేటివిటీ లేకుండా సమస్యలపై స్పందించకుండా ఈ జిల్లాకవి రాయకుండా ఉండలేడు. ఇకపోతే నా కథల్లో 'గుండెనిండా జీలుబండ, ఊరు మెచ్చిన మనిషి, నీరటికాడి కల, వలస చదువు మొదలగు కథల్లో పాలమూరు జీవితమే కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
8 కవిత్వం నుండి కథారచన వైపు మళ్ళడానికి కారణం?
కవిత్వాన్ని వదిలి పూర్తిస్థాయిలో నేను ఇంకా కథారచన వైపు మళ్ళలేదు. ఇప్పటికైతే కవిత్వం కథా రెండూ, రెండు రైలు పట్టాల్లాగా కొనసాగించాలని అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో కథలను ఎక్కువగా చదువుతున్న మాట నిజమే. ప్రముఖ పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ అన్నతో కలిసి నేను ''తెలంగాణ దళిత కథ'' పుస్తకానికి సంపాదకత్వం వహిస్తున్న.ఈ సందర్భంగా వందేండ్ల తెలంగాణ దళిత కథ పరిణామం తెలుసుకున్న. ఎక్కువగా కథలు సేకరించడం, చదవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగానే అయ్యింది. కథలు చదవడం వల్ల కవిత్వం కంటే కథలో నిక్షిప్తమైన జీవితం లోతులు బాగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. అందుకే కథలను ఎక్కువగా ఇష్టపడుతున్నా. రాస్తున్నాను కూడా. ఇప్పటి వరకు 10 కథలను రాశాను .ఇక ముందు కథారచన స్పీడ్‌గా కొనసాగించాలని అనుకుంటున్నా.
8 మిగతా జిల్లాలతో పోలిస్తే పాలమూరుజిల్లాకు ప్రత్యేకమైన మాండలిక భాష ఏమైనా ఉందా? తెలపండి.
తెలంగాణా తెలుగుభాషలో పాలమూరు జిల్లాది ప్రత్యేకమైన శైలి. గోకర్ణుడు, గోనబుద్ధారెడ్డి, చరిగొండ ధర్మన్న, బాలసరస్వతి, సురభి మాధవరాయలు, వెల్లాల సదాశివశాస్త్రి, రామచంద్రశాస్త్రి, గంగాపురం హనుమచ్ఛర్మ, ఇమ్మడిజెట్టి చంద్రయ్య, కపిలవాయి లింగమూర్తిలాంటి సాహిత్యకారుల్లో ఎక్కువగా అగ్రజాతుల జీవితాలకు సంబంధించిన పదబంధాలు, పలుకుబడులు ఉన్నాయి. కానీ పాకాల యశోదారెడ్డి, అంతర్జాతీయకవి గోరటి వెంకన్నల రచనల్లో సామాన్యజనంలో నిలదొక్కుకున్న భాష, పలుకుబడులు ఎగిసిపడ్డాయి. కపిలవాయి లింగమూర్తిగారు పాలమూరు మాండలికంపై ''పామర సంస్కృతం'' అనే నిఘంటువు రాశాడు. నలిమెల భాస్కర్ గారు కూడా పాలమూరు పదాలను రికార్డు చేసిండు. మిగతా జిల్లాలో కనపడని చాలా భాష పదాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లా మాండలికంపై కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల, ఉర్దూ భాషా ప్రభావాలు ఎక్కువగా ఉంటాయనిని వీటి ఆధారంగా చెప్పవచ్చు. ఆరివారం,సోద,దుదా ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయి. ఈ జిల్లాలో సామాన్య ప్రజలు వాడే ద్వంద్వాలు, అంగ వికారాలు, జాతీయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. వీటిని నలిమెల భాస్కర్ గారిలాగా ఎవరైనా రికార్డ్ చేస్తే బాగుంటుంది.
8 పాలమూరు జిల్లాలో ప్రగతిశీల, ప్రజా సాహిత్యం అసలుందా?
పాలమూరుజిల్లాలో ప్రగతిశీల, ప్రజాసాహిత్యం తక్కువ వచ్చినా చాలా బలంగా వచ్చింది. ఈ జిల్లాలో శతక ప్రక్రియా సాహిత్యం ఎక్కువగా వచ్చింది. అది కూడా భక్తి భావన, ఆధ్యాత్మికచింతన ఆధారంగానే. సమాజం పెట్టిన భారంపై, సమస్యలపై మాట్లాడకుండా ఊహాలోకంలోని అంశాల గురించి మాట్లాడడం నేనే అనే దృక్పథంలో భాగంగానే వచ్చినదని భావిస్తాను. అలా రాస్తే నేటివిటీ ప్రభావం లేనిది అవుతుంది. పాకాల యశోదారెడ్డి, గోరటి వెంకన్న, రాఘవాచారి, చింతకింది కాశీం, నాగవరం బలరాం, ఉదయమిత్ర, పరిమళ్, వనపట్ల సుబ్బయ్య, గుడిపల్లి నిరంజన్ ప్రగతిశీల సాహిత్య ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నారు. రాశిలో సాంప్రదాయ సాహిత్యకారుల రచనలు ఎక్కువగా వచ్చినట్లు అనిపించినా వాసిలో మాత్రం ప్రగతిశీల సాహిత్యం, దాని ప్రభావం ఎక్కువగా ఉంది.
8 బహుజనవాదంలో దళితవాదం మిళితమై ఉందా? రెండూ వేరువేరా?ఎట్లా భావించాలి?
బహుజనవాదనలో దళితవాదం ఒక పాయ మాత్రమే. బహుజనులు అంటే ఎస్సీ, ఎస్ టి, బిసీ మత మైనారిటీలని ప్రముఖ సాహితీవిమర్శకులు జి. లక్ష్మి నరసయ్య విశాల నిర్వచనం ఇచ్చారు. నిజానికి బహుజన అనే పదం మొదట ఉపయోగించింది బుద్ధుడు. ''బహుజన హితాయ బహుజన సుఖాయ'' అని. తర్వాత కంచ ఐలయ్య ''దళిత బహుజనులు'' అనే పదం వాడటంతో దళితులంటే ఎస్సీలనీ, బహుజనులంటే బీసీలనే ఒక వక్రచర్చ కొన్నాళ్ళు జరిగింది. కానీ బహుజనవాదం దళితవాదం ఎంత మాత్రమూ వేరువేరు కావు. రెండు వాదాలకు జాంబవంతుడు, బుద్ధుడు, పూలే అంబేద్కర్, కాన్షీరాంల సిద్ధాంత, పోరాటాలే స్ఫూర్తిగా ఉన్నాయి. బహుజనవాదం ,దళితవాదం విజయవంతం కావాలంటే అంబెడ్కర్ ఐడియాలజీ, కాన్షీరాం మెథడాలజీలే శరణ్యం.
8ఎస్సీ వర్గీకరణపై కవిత్వం రాసారు కదా? ఇది అనైక్యతకు దారితీయదంటారా?
ఎస్సీ వర్గీకరణనే ఐక్యతకు,నిజమైన సామాజిక న్యాయానికి మార్గం వేస్తుంది. వర్గీకరణను సమర్థిస్తే విడిపోవడానికి అంగీకరించినట్లు కాదు. అది అర్థవంతమైన ఐక్యత కోసమే. నిజానికి మాల మాదిగల ఉమ్మడి శత్రువు మనువాదమే. అసలు శత్రువును వదిలి మాపైన మేమే పోరాటం చేసుకోవడం ఒక వైచిత్రే. కానీ తప్పడం లేదు. వర్గీకరణ పోరాటం ఒక అనివార్య ప్రజాస్వామిక ఘర్షణగా మారింది .ఈ ఘర్షణలో పూలే, అంబేద్కర్ స్ఫూర్తి కనపడుతుంది. అందుకే నేను 'అన్నం గిన్నెలో అగ్నిపర్వతం' అనే కవితలో ''రిజర్వేషన్ల అన్నం గిన్నెలో అగ్నిపర్వతం బద్దలవ్వాలి/ 59 ముక్కలను సప్పలుగా/ సమానంగా ఏరుకొని తినాలి'' అని చెప్పాను. ఎస్సీ వర్గాలలో ఎవరి జనాభా ఎంతో దానికి తగినట్లే రిజర్వేషన్లు అందాలనేదే వర్గీకరణ పోరాటం అంతఃసూత్రం. దీనితో ఐక్యత పెరుగుతుంది తప్ప, తగ్గదు.
8 ఇన్నేళ్ళ దళితవాద సాహిత్యం ఎటువంటి ఫలితాలను అందించింది? ముందుతరాలు ఈ వాదాన్ని కొనసాగిస్తాయా?
ఇన్నేళ్ళ దళితవాద సాహిత్యం తెలుగునేలలో స్వీయ చైతన్యానికే పనికొచ్చింది. ఇంకా సామూహిక చైతన్యం రావలసినంత రాలేదేమో అనిపిస్తుంది. అందుకేనేమో తెలుగులో దళితవాదం నిర్దిష్టమైన, ఖచ్చితమైన ఫలితాలను సాధించలేదు. కానీ ఉత్తర భారతదేశంలో సంత్ రవిదాస్ సాహిత్యాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడి దళితులు నాలుగు సార్లు అధికారాన్ని సాధించి ఖచ్చితమైన ఫలితాలు సాధించారు. ఆ ఫలితాలు ఎక్కువ రోజులు నిలవకపోయి ఉండొచ్చు. కానీ కల నెరవేరింది. తప్పకుండా రానున్న కాలంలో మనవు వర్సెస్ అంబేడ్కర్ పోరాటాలే ఉంటాయి. ముందున్న కాలమంతా బహుజనవాదానిదే. ఇప్పుడు దళితుల శత్రువు స్పష్టంగా కనిపిస్తున్నాడు. కాబట్టి ముందుతరాలు తప్పకుండా దళితవాదాన్ని కొనసాగిస్తాయి. వేరే మార్గమే లేదు.
8 ''వాడి గొడ్డలి చిప్పకు/ ప్రతిసారీ కాడను నేనే'' అంటూ 'లందపొద్దు' బహుజనుల కవిత్వం రాసారు. ఆధునిక సాహిత్యంలో దాని చోటెంత?
దళిత బహుజనుల ఐక్యత, సంఘీభావ అవసరాన్ని నొక్కి చెబుతూ అలా చెప్పాను. దళిత నాయకత్వం ఏవేవో చిన్నచిన్న ప్రభావాలకు లోనై, చీలిపోయి పెత్తందారులచేతుల్లో ఆయుధాలుగా మారుతూ, దళితవాదాన్ని బలహీన పరిచే విధంగా మాట్లాడుతుంటారు. ఇది ముఖ్యంగా రాజకీయరంగంలో బాగా కనపడుతుంది. బహుజనరాజ్యం నిర్మించుకోవడానికి అడ్డంకిగా తయారవుతున్నారు. తెలంగాణావాదం కూడా దళితవాదాన్ని మింగేసింది. చాలా మంది బహుజన సాహిత్యకారులు, కళాకారులు తెలంగాణావాదంలోకి పోయి ఇంకా మళ్ళీ తిరిగి రావడంలేదు. లోపలికి పోవడమే తప్ప మళ్ళీ బయటకు తిరిగిరాని అభిమాన్యుడి లాగా తయారయ్యారు. చాలా మంది బహుజనకవులు ప్రభుత్వ పథకాలపై కూడా కవిత్వమై పారుతున్నారు. అందుకే 'గొడ్డలి' అనేది అగ్రకులవాదానికి ప్రతీకగా, 'కాడ'ను దళితవాదానికి ప్రతీకగా వాడిన. కాడ లేనిదే గొడ్డలి విజయవంతం కాదు. దురదృష్టమేమిటంటే దళితులు కాడగా మారడమే.
8 మీ ఇతర రచనల గురించి ఏమైనా చెప్పండి?
నేను 2007 సంవత్సరం నుంచి రచనలు చేస్తున్న. తెలంగాణ ఉద్యమంలో 'పొద్దైంది' కందనూలు కవిత్వానికి సంపాదకుడిగా ఉన్నా. 'జులూస్' తెలంగాణ ఉద్యమ విముక్తి కవితా చిత్రకళ సంచికలో ఒకడిగా ఉన్నా. 2015లో 'మహాబోధి', 'బడి కైతలు' వెలువరించిన. 2016లో 'లందపొద్దు' తెలంగాణ బహుజన కవిత్వం, 2017లో 'ఎరుక' బహుజన మహోద్యమ దీర్ఘకావ్యం రాసిన. 2018లో నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య చరిత్ర రాసిన. ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది. 2019లో అబ్దుల్ కలాం సైంటిఫిక్ జీవితం,విజయాలపై 'నిట్టాడి' దీర్ఘకవిత. ఇప్పుడు 'వెన్నెల కల' ప్రచురణ దశలో ఉంది.
- నర్రా ప్రవీణ్ రెడ్డి .... ఉస్మానియా యూనివర్సిటీ