Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పసిపిల్లల చెక్కిళ్లపై పాల చుక్కలు పడ్డట్టు/ పచ్చిక తివాచీపై కషీవలుని అడుగులు పడుతున్నవి'' సౌందర్యాన్ని అన్వేషించే కవి
గౌతమ్ లింగా రాసిన కవితా వాక్యాలివి. వత్తి రీత్యా దక్షిణాఫ్రికాలో సాప్ట్ వేర్ డెవలపర్. అయినా కవిత్వంతోనే సాంత్వన పొందే గుణం గల కవి. కావ్యమో , కమనీయ కవిత్వమో సజించబడాలంటే నిజానికి కవికి ప్రత్యేక అర్హతలేమీ అక్కరలేదు. తాను అనుభూతి పొందిన తీరును సుందరంగా వ్యక్తపరిచే టెక్నిక్ ఉంటే సరిపోతుంది. గౌతమ్ లింగా వంటి యువకవుల కవిత్వం చదివితే అది తెలియవస్తుంది. అయితే కవిత్వంలో ఏ భాష వాడితే పాఠకులకు దగ్గరవుతారో చెప్పడం అసాధ్యం. పరిపరి వేదనల మధ్య అక్షరం పుడుతుంది. ఆ క్రమంలో ఏ భాషా రూపంలోనైనా కవిత నిర్వహించబడవచ్చు. గౌతమ్ లింగా స్వస్థలం ఖమ్మం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామం. ఆయన రాసే కవిత్వం, కవిత్వపు భాష ఇతర యువకవులతో పోలిస్తే విపర్యయంగా సాగుతుంది. మణిప్రవాళశైలినే ఎక్కువ అనుసరించే వారితో ఈ వారం నర్రా 'అభిముఖం'...
- మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి
నేను పుట్టింది, పెరిగింది సత్యనారాయణపురం గ్రామం, గార్ల - బయ్యారం, ఖమ్మం జిల్లా. నాకు ఇది చెప్పుకోవడం చాలా ఇష్టం, గర్వం. పక్కనే అడవులు, ఊరిని తాచుపాములా చుట్టుకున్న అలిగేరు, గుట్టలు, కొండలు, అమాయకపు మనుషులు ఇలా అందంగా ఉంటుంది మా ఊరు. చాలా జ్ఞాపకాల నెమలీకల్ని దాచుకున్నాను మా ఊర్లో. వెళ్ళినప్పుడు తడిమిచూసుకుంటాను. విదేశాల్లో ఉంటున్నా కవిత్వం మాత్రం మా ఊరు వేదికగానే రాస్తాను. ఇప్పటికీ అక్కడ నుంచే ప్రపంచాన్ని చూస్తాను. మా నాన్న లింగా రమేష్ ప్రయివేటు స్కూల్లో తెలుగు టీచర్, అమ్మ లక్ష్మి, చెల్లి మౌనిక, బావ మనోహర్, నా కవిత్వాన్ని మొదట వినే అర్దాంగి కోటేశ్వరి, ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న నా కూతురు అనర్ఘ్య. ఇదే నా కుటుంబం, నాన్నగారి సాహితీతష్ణ కొంచెం నాకు అబ్బింది.
- సాప్ట్ వేర్ ఉద్యోగిగా ఉంటూ సాహిత్యం వైపు ఎలా మళ్ళారు?
నాకు చిన్నప్పటినుంచే సాహిత్యం పట్ల, తెలుగు భాష పట్ల అమితమైన ఇష్టం ఉంది, వయసుతో పాటు అది కూడా పెరుగుతూ వచ్చింది, చిన్నప్పుడు పాత న్యూస్ పేపర్లు, ఇంట్లో ఉన్న పుస్తకాలు, ఏది కనబడితే అది చదివే వాడిని. ఇప్పటికీ నాకు చదవడం అంటే చాలా ఇష్టం. అయితే నా వత్తి సాహిత్యాన్వేషణకి ఎలాంటి అడ్డంకీ కాలేదు, వారాంతాలలో కచ్చితంగా ఏదో ఒకటి చదవడం, సాహితీ మిత్రులతో చర్చించడం అలవాటుగా మారింది. నిజానికి ఉద్యోగ జీవితంలో చెలరేగిన ఒత్తిడి మంటల్ని ఆర్పే జడివాన నాకు ఈ సాహిత్యం.
- మీ కవితలకు శీర్షికలు సంస్కతభాషలోనే ఎందుకు పెడతారు?
నాకు తెలుగుభాష ఎంత ఇష్టమో సంస్కతం కూడా అంతే ఇష్టం, తెలుగు - సంస్కతం కలిసిన మణిప్రవాళశైలిలో కవిత్వం మరింత మెరుస్తుందని నా భావన, భాష విస్తతమవుతున్న కొద్దీ కవి భావనలు చెప్పడానికి ఎక్కువ వీలుంటుంది, కవితలకి శీర్షికలు పెట్టడానికి నేను చాలా మథన పడతాను, నా మనసును ఆ శీర్షిక గొప్పగా విప్పి చెప్పాలనుకుంటాను. అయితే చాలా కాకతాళీయంగా అనర్ఘ్యలో ఎక్కువ శీర్షికలు సంస్కతభాషను ఆశ్రయించాయి. నిజానికి నేను కూడా ఆశ్చర్యపోయాను. కావాలని చేసింది కాదు.
- తెలుగు భాషావద్ధికి మీ కవిత్వం దోహద పడుతుందా? లేదా?
ఏ భాషకైనా అభివద్ధి అనేది కొత్తపదాలు పుడుతున్నప్పుడు, కొత్త దారుల్లో సాహిత్య సష్టి జరుగుతున్నప్పుడు, వేరే భాషా పదాలను ఆహ్వానించి మన భాషలో చేర్చుకోగలిగినప్పుడే ఉంటుంది. భాష నిత్యచైతన్య శీలి దానివెంట మనం ప్రయాణించాలి, పాత-కొత్తల గొప్ప కలయికతో మంచి మాటల్ని, పదబంధాల్ని, అభివ్యక్తుల్ని సష్టించి భాషకు అందివ్వాలి, తెలుగుభాష స్వతహాగా పరభాషా పదాలను చాలా అందంగా కలుపుకుంటుంది. నా కవిత్వంలో వీలైనన్ని కొత్త పదాలు, జనబాహుళ్యంలో మరుగునపడ్డ పదాలు పరిచయం చేశాను. మనకి భాష మీద ఉన్న ఇష్టమే భాషాభివద్ధికి దోహదం అవుతుందని నా విశ్వాసం.
- మీ కవిత్వం ఎక్కువగా గ్రాంథికభాషలోనే సాగింది కారణం?
చిన్నప్పటినుంచీ చదివిన పుస్తకాల ప్రభావం అనుకుంటాను. దాశరథి కష్ణమాచార్య, జాషువా, శ్రీ శ్రీ, కాళోజీ లాంటి కవులు నా మీద ఎక్కువ ప్రభావం చూపారు. అది కేవలం కవిత్వంలోనే కాకుండా జీవనసరళిలో కూడా ప్రతిబింబించింది. పూర్తి గ్రాంథికభాష కాకపోయినా ఆ ఛాయలు కొంత ఉండిఉండవచ్చు. అయితే ఇది కూడా కావాలని చేసింది కాదు. రాసేటప్పుడు భాష సరళత గూర్చి ఆలోచించలేదు. భాష పాఠకులకు కష్టంగా ఉంటుంది అని ఒక్కసారి అనిపించినా ఇంకొంచం జాగ్రత్త వహించేవాడినేమో. ఇకపై పెన్నుమీద ఓ కన్ను వేస్తాను.
- తెలంగాణకు చెందిన భాషను కవిత్వంలో వాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
నేను తెలంగాణా వాడిని. నా ప్రాంత భాష, నా ప్రాంత జీవన వైవిధ్యం దేదీప్యమానంగా వెలగాలనే స్వార్థం నాది, నిన్నటి వరకూ రాసిన కవిత్వం కన్నా ఈరోజు కొత్తగా రాయాలని ప్రతిరోజూ తపనపడతాను. నేను ప్రత్యేకంగా పనికట్టుకొని తెలంగాణాభాష వాడవలసిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, ఉద్యోగం చేశాను. ఇక్కడి సాహిత్యాన్ని చదివాను.నేను చూసిందంతా ఇక్కడి ప్రపంచమే. నా తెలంగాణాభాష సంస్కతానికి చాలా దగ్గరగా ఉంటుంది, నేను ఏది రాసినా ఇక్కడి మట్టి ప్రసాదించిందే, నేను రాసేది తెలంగాణమే, అయితే ఇది నా తెలం''గానము''.
- మీపై సంస్కత గ్రంథాల ప్రభావం ఏమైనా ఉందా?
నేను నిజానికి సంస్కత గ్రంథాలేమీ చదువుకోలేదు. ఈ మధ్య కొంత ప్రయత్నించి విఫలమయ్యాను కూడా. అయితే సంస్కత పదాలు వాటికి అర్థాలు తెలుసుకోవడం ఇష్టం. చాలా మారుమూల గ్రామం నుంచి వచ్చిన నాకు నిజానికి అలాంటి గ్రంథాలు ఉంటాయని కూడా నిన్నమొన్నటి దాకా తెలియదు. చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆకలిపోరాటం,పేదరికం మధ్యలోంచి సాగింది చాలామటుకు నా బాల్యం. దొరికిన పుస్తకాలు చదువుకుంటూ పోయానంతే. సంస్కత గ్రంథాల ప్రభావం నా కవిత్వంలో ఉందని ఎవరికైనా అనిపిస్తే వారి ప్రశ్నే నాది కూడా .
- మీరు ఇష్టపడే కవులు ఎవరెవరు? ఎందుకు?
చాలామంది ఉన్నారు. అలిశెట్టి ప్రభాకర్, కలేకూరి ప్రసాద్, దాశరథి, జాషువా, కాళోజీ, శ్రీ శ్రీ, తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ, శివారెడ్డి నాకు చాలా ఇష్టం. వారి కవిత్వంలో అంతర్లీనంగా ఒక ఆత్మ ప్రవహిస్తుంటుందని నేను నమ్ముతాను. ఆ ఆత్మ మన మనసులతో స్నేహం చేసి వారి ఆలోచనల వెంట మనల్ని తీసుకువెళ్తుంది. నా జీవితంలో తప్పు దారుల్లో అడుగేయడానికి చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతిసారీ ఈ కవులే వారి కవిత్వంతో మంచి దారుల్లోకి బలవంతంగా నన్ను నెట్టారు. అందుకే కవులన్నా, కవిత్వమన్నా నాకు ఇష్టం, ప్రేమ. వీరే కాకుండా కవిత్వం రాసిన వారందరూ నాకు ఇష్టమే. ఎందుకంటే ఎదో రూపంలో వారి అందమైన భావనల్ని అక్షరరూపంలో పంచుతున్నారు కాబట్టి. ఈ మధ్య కాలంలో చాలా మంచి కవిత్వం పుడుతుంది. అదంతా ఇష్టమే.
- మీ కవితలలో మీకు ఇష్టమైన కవిత ఏది?
నిజానికి నాకు అన్నీ ఇష్టమే. బాగా ఇష్టమైన వాటిని ప్రస్తావిస్తే ''విశ్వంభర'' కవిత కాస్త ముందుంటుంది. ఈ కవిత పూర్తిగా మనిషికోసం సాగిన అన్వేషణ, మనిషి కోసం మనిషి నడిచిన దారుల్లో కవితాన్వేషణ జరుగుతుంది. దీనికి ''ట్యాగ్స్'' ఉత్తమ కవితా పురస్కారం దక్కింది. రైతు జీవన నేపథ్యంగా సాగే ''కషాణ'' కూడా నాకు ఇష్టం. దీనికేమో ప్రతిష్టాత్మక ''తానా'' ఉత్తమ కవితా పురస్కారం వచ్చింది. ఇంకా కొన్ని ఉన్నాయి.
- దక్షిణాఫ్రికాలో తెలుగుకు ఏమేరకు ప్రాధాన్యం ఉంది, అక్కడి తెలుగు వారి సంస్కతులు ఎలా ఉన్నాయి?
దక్షిణాఫ్రికా దేశంతో తెలుగువారికి విచిత్రమైన అనుబంధం ఉంది. ఆంగ్లేయులకాలంలో వివిధ పనులకి ముఖ్యంగా చెఱకు పండించడానికి మనదేశం నుంచి చాలామందిని తీసుకెళ్లారు. వారిలో తెలుగువారు కూడా ఉన్నారు. 3,4 తరాలుగా అక్కడే ఉండడం చేత వారు తెలుగు మాట్లాడలేకపోయినా ఇంకా వారి సంస్కతి, పేర్లు మనకు చాలా దగ్గరగా ఉంటాయి. వారు ఇప్పుడు బాగా అభివద్ధి చెంది వివిధ రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ మధ్య వెళ్లిన మేము వివిధ సంఘాల వేదికగా భాషాభివద్ధికి సహాయపడుతున్నాం. పిల్లలకు ప్రతీ ఆదివారం మనబడిలో తెలుగు నేర్పుతున్నాం. సాహితీ, సాంస్కతిక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ తెలుగు ప్రాధాన్యతని, గొప్పతనాన్ని కొంత వరకు పెంచుతున్నాయి. అయితే ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది.
- మీ 'అనర్ఘ్య' కవితా సంపుటి గురించి రెండు మాటల్లో చెప్పండి?
'అనర్ఘ్య' మనిషి కేంద్రకంగా సాగే కవితా ప్రయాణం. మనిషి లోతుల్లో కొనసాగుతున్న జీవన సంఘర్షణకి కవన రూపం, అందుకే ఇందులో కవితా వస్తువులన్నీ మనిషి చుట్టూనే తిరుగుతాయి. పుట్టుక నుంచీ స్మశానం దాకా, ఉయ్యాల నుంచీ అంపశయ్యదాకా మహౌత్కష్కంగా సాగుతున్న మనిషి ప్రయాణానికి నా అక్షర ప్రణామం ఈ 'అనర్ఘ్య'.
- నర్రా ప్రవీణ్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం