Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కదులుతుంది కదులుతుంది
మరోతరం మరోతరం
నలుదిక్కులు పిక్కటిల్లే
గళమెత్తి గర్జిస్తూ
పిడికిలెత్తి నినదిస్తూ
కదులుతుంది కదులుతుంది
మరోతరం మరోతరం
జడివానల వరదల్లే
చలి చీమల వరసల్లే
వడివడిగా తడబడకా
అడుగడుగున కసితోటి
కదులుతుంది కదులుతుంది
మరోతరం మరోతరం
కారుచీకటి కమ్ముకున్నా
కంటిరెప్పలు వాల్చకుండా
మిణుగురు పురుగుల
మిల మిల వెలుగులో
కలాలు కక్కిన పదాలు పలుకుతూ
స్వరాలు పరిచిన పాటలు పాడుతూ
కదులుతుంది కదులుతుంది
మరోతరం మరోతరం
కూలి లేక కూడు లేక
గూడు గుడ్డకు నోచుకోక
బీడు పడ్డా భూములలో
పాడు పడ్డా బావులల్లో
ఆత్మహత్యలు చేసుకున్న
అన్నదాతల చావు చూసి
కదులుతుంది కదులుతుంది
మరోతరం మరోతరం
పూరిగుడిసెలు మట్టితడకలు
కొట్టుకుపోయిన పట్టువదలని
అడవి బిడ్డల అస్తిత్వం కోసం
అదరక బెదరక అడవుల వెంట
కాలినడకన కాలువలు దాటుతూ
అలలు పొంగినా కొండలు విరిగిన
పెల పెల పెల పెల మేఘం మెరిసిన
పట పట పట పట పళ్ళు కొరుకుతూ
వేసిన అడుగుల మడిమలు తిప్పక
కదులుతుంది కదులుతుంది
మరోతరం మరోతరం
పట్టాలకు విలువలేక
పుట్నాలుగ అమ్ముతుండ్రు
డిగ్రీలు పొందినోళ్లు
దిగులుతోని చస్తుండ్రు
దినదినము ధన దాహపు
పెను భూతం పెరుగుతుంది
కదులుతుంది కదులుతుంది
మరోతరం మరోతరం
తరాలు గడిచిన పెదాలు విప్పని
పదవులు పొందిన వెదవల తరుముతూ
దిక్కు దిక్కునా కడలిగ పొంగుతూ
ఉక్కు నరాలకు ఊతం అవుతూ
ఎముకల గూడుల ఆకలి కేకలు
అర్థం కాని దరిద్ర పాలన
అంతం కోసం...
కదులుతుంది కదులుతుంది
మరోతరం మరోతరం.
- ఎనుపోతుల వెంకటేష్
9573318401