Authorization
Mon Jan 19, 2015 06:51 pm
A Book is a dream, that you hold in your hand అని బ్రిటిష్ రచయిత నీల్ గైమన్ అన్నట్టు అతడికి చరిత్ర అంటే అంత మక్కువ. కాకతీయుల చరిత్ర అంటే అంతకంటే ప్రాణం. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు చరిత్ర ప్రేమికుడిగా నిత్యం అన్వేషణ సాగిస్తూ , కొత్త విషయాలను వెలికితీస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. చరిత్ర పరిశోధకులు, పురాతత్వ శాస్త్రవేత్తల మన్ననలను పొందుతున్నాడు. అతడే... పకిడె అరవింద్ ఆర్య.
కళలకు కాణాచిగా, సాంస్కతిక రాజధానిగా పేరొందిన నగరం ఓరుగల్లు. అద్భుత చారిత్రక శిల్పకళా సంపదకు ఆలవాలం. అబ్బురపరిచే ఆలయాలతో పాటు ప్రాచీన ఆయుర్వేద వైద్యానికీ ఆలంబన. కాలక్రమంలో కనుమరుగైన ఆ వైభవాన్ని, చారిత్రక ఆనవాళ్లను గుర్తించి మళ్లీ వెలుగులోకి తెస్తున్నాడు అరవింద్. చారిత్రక ప్రాంతాలను శోధిస్తూ కొత్త విషయాలను ప్రపంచానికి చాటిచెబుతున్నాడు. అరవింద్ అందరి యువకులలా కాదు. నిత్యం ఏదో సాధించాలనే తపన గల్ల వ్యక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యాన్వేషి వీలు దొరికినప్పుడల్లా, భుజాన బ్యాగ్, చేతిలో కెమెరాతో తనదైన ప్రపంచంలోకి వెళ్లి శోధించి సాధించి, అన్వేషించి పురావస్తు శాఖ వారు కూడా దొరకపట్టలేని చరిత్రను వెలుగులోకి తెస్తున్నాడు ఈ పాతికేండ్ల యువకుడు.
చారిత్రక ప్రాంతాలకు నిలయం తెలంగాణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మధ్య యుగం నాటి ఆనవాళ్లు చారిత్రక కట్టడాలు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తూ ఉంటాయి. అయితే చారిత్రక పూర్వ యుగం నుంచి ఎన్నో వేల ఏండ్ల చరిత్ర కలిగిన తెలంగాణలో ఇంకా బయట పడని చరిత్ర ఎంతో ఉందని.. మరుగున పడిన తెలంగాణ చరిత్రను వెలికితీసేందుకు ' ఎవరికీ తెలియని తెలంగాణాను ఆవిష్కరించేందుకు నడుం కట్టాడీ జనగామ యువకుడు. అరవింద్ స్వస్థలం జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలానికి చెందిన కంచనపల్లి అనే మారుమూల గ్రామం. లీల, సత్యనారాయణ దంపతుల సంతానంలో మొదటివాడు అరవింద్. అతనికి ఒక సోదరుడు ఉన్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అరవింద్ బాల్యమంతా కంచనపల్లిలోనే గడిచింది. జేసుతిరు హదయ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అరవింద్ ఇంటర్ హన్మకొండలోని ఏకశిలా జూనియర్ కాలేజీలో, డిగ్రీ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జర్నలిజం చేశాడు. ఐదవ తరగతిలో ఉండగా అతని ఉపాధ్యాయులు పద్మ, అల్లం అనిల్ రెడ్డి గార్లు చెప్పిన సోషల్ పాఠాలతో చరిత్ర మీద ఇష్టం, ఆసక్తి ఏర్పడ్డాయి. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి గ్రంథాలయానికి వెళ్ళడం, పుస్తకాలు బాగా చదవటం నిత్యకత్యం అయింది. అంటే 2005 నుండి పత్రికలు చదవడం అతనికి అలవాటు అయింది.
పదవతరగతి తర్వాత హన్మకొండలోని ఏకశిలా జూనియర్ కాలేజిలో ఎం.పి.సి. కోర్సులో చేరాడు. అరవింద్‌కు చిన్నప్పటి నుంచి పురాతన కట్ట డాలు, చారిత్రక ప్రదే శాలు అంటే ఎంతగానో ఇష్టం. ఈ క్రమంలోనే అరవింద్ ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రాంతాలకు తరచుగా వెళ్తూ ఉండేవాడు. దీంతో వాటిపై అతనికి ఇంకా ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తే తర్వాత తర్వాత అతడ్ని పరిశోధకుడిగా మార్చింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. డిగ్రీ చేయదలచి హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో బి.ఎ. (జర్నలిజం) కోర్సులో చేరాడు. అందులో నేర్చుకున్న మెళకువలతో తన పరిశోధనలను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసురావడం మొదలుపెట్టాడు.
చరిత్ర పరిశోధన
వరంగల్‌లో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశాల గురించి తెలిసిన అతి తక్కువ మందిలో అరవింద్ ఒకడు. రాష్ట్రంలో ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించి అక్కడ లభించిన శాసనాలను గమనించి, విలువైన సమాచారాన్ని సేకరిం చడం మొదలుపెట్టాడు. చరిత్ర పరిశోధనా క్రమంలోనే క్రమ క్రమంగా రాష్ట్రంలోని జన ప్రాచుర్యంలో లేని 100కు పైగా పురాతన కట్టడాలను, చారిత్రక ప్రదేశాలను గుర్తిం చాడు. చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను గుర్తించేందుకు ఎన్నో పుస్తకాలు, కొంత మంది ఆర్కి యాలజిస్టులు, ఇంటర్నెట్ సహాయం తీసుకునేవాడు. జయ శంకర్ జిల్లా మంగపేట మండలం మల్లూరు కొండిపాంతంలో అరవింద్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున్న ఓ పురాతన గోడను కూడా కనుగొన్నాడు. 2016లో వరంగల్ అర్బన్ జిల్లాలోని శివనగర్ ప్రాంతంలో మరుగున పడిపోయిన ఓ కాకతీయుల కాలంనాటి అంతస్తుల మెట్లబావిని గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చాడు. అరవింద్ కషిని చూసి జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి సహకారాన్ని అందించారు. ఆ సహకారంతో ఆ బావిని పునరుద్ధరించి, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడంలో విశేష కషిచేసాడు. వరంగల్ ప్రాంతంలో ఏడు కోటలు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. ఇలాంటి కట్టడాలు, ప్రదేశాలు ఇంకా ఎన్నింటినో అరవింద్ గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఉన్న చారిత్రక ప్రాధా న్యత కలిగిన విగ్రహాలను, వస్తు విశేషాలను హైదరాబాద్ వరంగల్ మ్యూజియాలకి తరలించే విధంగా కషి చేశాడు. ఇప్పటివరకు పరిష్కరించబడని రెడ్లవాడ, శాయంపేట హవేలి, గుడి తండా, నరసింహస్వామి దేవాలయం శాసనాలను ఎన్ స్టాంపెజ్ చేసి వాటిని పరిష్కరించి ప్రచురించేలా కషి చేశాడు. దేవునిగుట్ట ఆలయం అనే పురావస్తు కట్టడం గురించి రాసిన కథనాలు అనేక విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షించి వారు భారతదేశం వచ్చి ఆ కట్టడాన్ని సందర్శించి వారు కూడా పరిశోధనలు చేసేలా పురికొల్పాయి. పలువురు విదేశీ పురాతత్వ శాస్త్రవేత్తలతో కలిసి ఆ కట్టడాన్ని పదుల సార్లు సందర్శించి పరిశోధనలు చేయడం జరిగింది.
అరవింద్ పరిశోధనల నిమిత్తం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1100 ప్రదేశాల్లో అనేక పర్యాయాలు పర్యటిం చాడు. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, కరీంనగర్, నల్లగొండ, యాదాద్రి, ఖమ్మం వంటి జిల్లాల్లో అతని పరిశోధనలు విస్తతంగా కొనసాగుతున్నాయి. ఎక్కువగా కాకతీయులకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేసిన వ్యక్తి కావడం మూలంగా ఎక్కువగా కాకతీయులు ఏలిన ప్రాంతాల్లో పర్యటించి కాకతీయుల కట్టడాలను, చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చాడు అరవింద్. ఇప్పటివరకు తెలంగాణలో వెలుగుచూడని శాసనాలు, వేల ఏండ్లనాటి సాంప్రదాయాలను మొదలగు వినూత్న అంశాల సమాచారాన్ని వివరించి తెలుపుతూ ''మనకు తెలియని తెలంగాణ'' పేరుతో ఒక పుస్తకం తీసుకువచ్చాడు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ ప్రోత్సాహ సహకారాలతో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ ప్రచురించిన ఈ పుస్తకం 2019, మే 20న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి (ఐఏఎస్) చేతుల మీదుగా ఆవిష్క రించబడింది. ఇంకా ఇవి కాక మరో రెండు పుస్తకాలు ప్రచురించాడు. ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు తెలిసిన వాటర్ ఫాల్స్ 18 నుండి 20 ఉంటాయని, కానీ వారి అధ్యాయనంలో 78 వరకు ఉన్నట్టు కనుగొన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా వివిధ చారిత్రక ప్రదేశాలను గుర్తించి దానిని ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఆరంభించాడు. అది అరవింద్ పరిశోధనలో ఒక భాగమే. మరో వైపు తన పరిశోధనల్లో భాగంగా అరవింద్ ఇటీవల దట్టమైన అడవుల్లో ముళ్లపొదల మధ్య కనుమరుగవుతున్న పురాతన విగ్రహాలను వెలికి తీశాడు.
పురావస్తు శాఖ శోధించని అనేక ప్రాంతాలను గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చాడు. అంతేకాదు, వివిధ ప్రదేశాల చారిత్రక అంశాలను డాక్యుమెంటేషన్ చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. దాంతో తాను కనుగొన్న వాటిని సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. బస్తర్ లో ఉన్న కాకతీయ వంశస్థుడు, ప్రస్తుత పాలకుడు మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ కలిసి ఇంటర్వ్యూ చేశాడు. ఇటీవల ఆయన తిరుపతి దేవాలయ సందర్శనకు వచ్చినప్పుడు అన్ని దగ్గరుండి చూసుకున్నాడు.
పరిశోధనలో భాగంగా అరవింద్ అనేక ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించాడు. విలువైన సమాచారాన్ని సేకరించాడు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చరిత్రను తెలుసుకున్నాడు. చరిత్రను సోషల్‌మీడియా ద్వారా తెలియ చెబుతుండటంతో ఇతర దేశాలకు చెందిన చరిత్ర పరిశోధకులు కూడా రావడం మొదలు పెట్టారు. ఇలా దాదాపు 10 దేశాల నుంచి చరిత్ర పరిశోధకులు వచ్చారు. ఈ క్రమంలో అరవింద్‌కు పలువురు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తన పరిశోధనలో భాగంగా అరవింద్ సుమారు 900 పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను గుర్తించాడు. వాటిలో కాకతీ యుల కట్టడాలు అధికం. వీటిపై గతంలో వెలువడిన పుస్తకాలను సేకరించాడు.
జర్నలిస్టుగా సంపాదించే కొద్ది మొత్తాన్ని కూడా తన పరిశోధనకే ఉపయోగిస్తు న్నాడు. తనకు తెలిసిన చరిత్రను అందరికి చాటి చెప్పేందుకు ప్రయివేటు వెబ్సైట్లు, పత్రికలు, సోషల్ మీడి యాను వినియోగిం చుకున్నాడు. తద్వారా వచ్చే డబ్బును కూడా పురాతన కట్టడాల పరిశీలించడానికి వెచ్చిస్తున్నాడు.
ఫోటో ఎగ్జిబిషన్
అరవింద్ సందర్శించిన పురాతన కట్టడాలు, ఆలయాలను ఫోటోల రూపంలో బంధించారు. ఇప్పటివరకు 30 వేల ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలు చాలావరకు ఎవరికీ తెలియని కట్టడాలే. 2019 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ రవింద్రభారతిలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్రంలోని మరుగున పడిపోయిన చారిత్రక కట్టడాల , ప్రాంతాల ఛాయాచిత్రాలతో 'ది అన్ టోల్డ్ తెలంగాణ' పేరుతో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాడు. మార్చి నెలలో వరంగల్ హరిత కాకతీయ హౌటల్ లో 3 రోజుల పాటు జరిగిన తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ కన్వెన్షన్ లో ఛాయాచిత్రప్రదర్శన నిర్వహించాడు. ములుగులోని ప్రసిద్ధ రామప్ప దేవాలయానికి ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో స్థానం లభించిన సందర్భంగా తను తీసిన రామప్ప దేవాలయ ఫోటోలతో ప్రస్తుతం హైదారాబాద్‌లోని రవీంద్ర భారతిలో 'ఏ సింఫనీ ఇన్ స్టోన్' పేరుతో ఐదు రోజుల పాటు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించాడు. 8వ తేదీ నుంచి బస్తర్‌లో రామప్ప విశిష్టతను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు.
- అనంతోజు మోహన్ కృష్ణ