Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్క రాత్రి
ముక్కలైన దేహన్ని కప్పినొక తెల్లని దుప్పటిపై పూసిన గుప్పెడు కలల రాత్రి....
ఓ కావడి కట్టై నిన్ను నన్ను కలిపిన రాత్రి.
ఒక్క రాత్రి
వీధులన్నీ వేలాడే వేల దీపాలయ్యాక
మిగిలిన చీకటి బొట్లను ఏరుకొచ్చి
గుమ్మానికి తోరణాలుగా కట్టిన రాత్రి
క్షణాల కునుకుపాటుకు వెచ్చని ఒడినిచ్చిన రాత్రి
ఒక్క రాత్రి
పచ్చని కోమ్మలు కూడేసి పరిచిన పందిరి కింద
వెన్నెల జాడ వెతికిన రాత్రి
వేకువ లోకం కోసం ఆతతగా ఎదురు చూస్తున్న రాత్రి...
ఒక్క రాత్రి
పొత్తి పేగుల రాగాలకు జతగా గొంతు కలిపి మండు బొగ్గుల మీద బువ్వటికే ముంత బెట్టి
అటుకుల ముద్ద చేసి అరిటాకుల గుమ్మరించిన చోట చేతులు చాచిన ఆకలి రాత్రి.
అదో అమ్మ లేని రాత్రి
ఒక్క రాత్రి
కన్నీళ్లు తుడిచిన కొంగంచు వేలు పట్టి ఊరి తోవల నాన్న భుజాల కానరాక
పొక్కిలైన మనసు నిండా ఒడవని దుఃఖపు రాత్రి
అది నాన్న ఇంటికి చేరని రాత్రి..
మట్టి గోడ నక్షత్రంగా నవ్వుతూ నాకు పహారా కాస్తున్న రాత్రి
కొన్ని రాత్రులు లాలించే కోయిల పాటలు
కొన్ని రాత్రులు హదయంపై చల్లే ముసురు కల్లాపి జల్లులు
కొన్ని రాత్రులు ఉలిక్కిపాటు అలజడుల జ్ఞాపకాలు
మిగిలిన ఇన్నేసి సామూహిక సందిగ్ధపు రాత్రుల్లో
ఆ రాత్రో
ఈ రాత్రో
ఏ రాత్రో తెలియక
నగర చౌరస్తాలో నిలబడి
అప్పుగా తెచ్చుకున్న ఆఖరి రాత్రికి
రేపటి కొత్తాశలను అద్దుతున్న తీరొక్క రంగుల రాత్రి
నన్ను నేనో నూతన పుస్తకంగా ముద్రించుకుని
కంటి రెప్పల కాగితాలకు పొద్దెరగని నిద్దురగా నామకరణం చేసిన రాత్రి
అదో ఉమ్మడి స్వప్నాలకు ఊపిరి పోసిన రాత్రి..
మరో మజిలికి ఆహ్వానం పలికిన తొలుసూరు రాత్రి...
- వెంకటాద్రి సిలపాక
9133495362